నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్..! వైసీపీలో చేరనున్న సీనియర్ నేత..
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. అయితే, ఇప్పుడు టీడీపీకి షాక్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అందులో భాగంగా త్వరలోనే ఆత్మకూరు టీడీపీ నేత, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి త్వరలోనే వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధం అవుతున్నారు.. బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో ఇప్పటికే చర్చలు జరిపారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి.. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బొమ్మారెడ్డి.. దీంతో, వైసీపీలోకి ఆహ్వానించారు.
హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది..!
హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సోమువీర్రాజు.. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి..? అని మండిపడ్డారు.. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం.. ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి..? అంటూ నిలదీశారు.. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారు.. హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు సోము వీర్రాజు.
శ్రీశైలంలో కలకలం.. చక్కర్లు కొట్టిన చార్టర్ ఫ్లైట్..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి కలకలం రేగింది.. ఆలయ పరిసరాలలో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది.. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.. అయితే, నో ఫ్లై జోన్ గా ఉన్న శ్రీశైలం ఆలయ పరిసరాల్లో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో కలకలం రేగుతోంది.. గతంలోనూ శ్రీశైలం ఆలయం పరిసరాల్లో పలుమార్లు డ్రోన్‌లు ఎగిరాయి.. ఇక, తాజాగా, గత నెలలో ప్రధాన గోపురంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దానికి లైటింగ్ కూడా ఉందని స్థానికులు తెలిపారు.. అర్థరాత్రి వేళ ఎగిరే పళ్లెం లాగా అది ఎగురుతూ ఉండటాన్ని ఆలయ సిబ్బంది చూశారు. అలర్ట్ అయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దాన్ని కూల్చేద్దామని ప్రయత్నించారు.. కానీ, అది సాధ్యపడలేదు. కాసేపు ఎగిరిన తర్వాత ఆ డ్రోన్ దూరంగా వెళ్లిపోయింది. ఇంతవరకు ఆ డ్రోన్ ఆచూకీ లభ్యం కాలేదు.. అయితే, మరోసారి చార్టర్ ఫ్లైట్ ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చార్టర్ ఫ్లైట్‌లు ఎవరు ఉన్నారు? ఏదైనా కుట్ర కోణం ఉందా? లేదా పర్యాటకులు ఏమైనా వచ్చారా? లాంటి విషయాలు తేలాల్సి ఉంది.
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..
రాష్ట్రంలో వర్షాల అనంతర పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు వివరించిన అధికారులు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్న ఆయన.. పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే వివరాలు తెప్పించుకోవాలన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. ఇది పూర్తి స్థాయిలో జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం పెట్టాలని సూచించారు సీఎం జగన్.. రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఆయన.. పంట కొనుగోలు చేయడం లేదన్న మాట కూడా ఎక్కడా వినిపించకూడదన్నారు.. రైతులకు ఫిర్యాదులు చేయటానికి ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని.. ఈ ఫిర్యాదులపై అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
సీఎం జగన్‌కు మంత్రి బొత్స కృతజ్ఞతలు.. అందుకే చంద్రబాబుకు కడుపు మంట..!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంఖుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇంత అద్భుతమైన కార్యక్రమం జరిగితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది అంటూ ఫైర్ అయ్యారు.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం వల్లనే చంద్రబాబు 2,300 ఎకరాల భూ సేకరణకు కుదించారన్న ఆన.. ఇది వాస్తవం కాదా? భోగాపురం విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా? ఆ రోజు టీడీపీ నేత, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఎందుకు హాజరు కాలేదు? ప్రజల నుంచి తిరుగుబాటు ఉంటుందని భయపడే దాక్కున్నాడు అన్నది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇక, చంద్రబాబు ఏం పని చేసినా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
కాశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..
జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కిష్త్వార్ జిల్లాలోని మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో గురువారం ఆర్మీ ఛాపర్ కూలిపోయింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. పైలట్, కో పైలట్ గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. హిల్ మార్వా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారుల తెలియజేసిన వివరాలు ప్రకారం హెలికాప్టర్ లో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు. “ఆర్మీ ALH ధ్రువ్ హెలికాప్టర్ జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్త్వార్ సమీపంలో కుప్పకూలింది. పైలట్లకు గాయాలయ్యాయి, అయితే సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో అరుణాచల్ ప్రదేశ్ మండల కొండల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లు మరణించారు.
గ్రహాన్ని కబళిస్తున్న నక్షత్రాన్ని గుర్తించిన సైంటిస్టులు.. ఏదో రోజు భూమికి కూడా ఇదే పరిస్థితి..
విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. ఇందుకు గ్రహాలు, నక్షత్రాలు మినహాయింపేం కాదు. ఏదో రోజు సూర్యుడు కూడా అంతం కావాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు ఓ నక్షత్రం, దాని చుట్టూ తిరుగున్న గ్రహాన్ని కబళించడాన్ని గుర్తించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), హార్వర్డ్ యూనివర్సిటీ మరియు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం గ్రహాన్ని, మాతృ నక్ష్రతం ఎలా చంపేస్తుందనే దాన్ని గమినించారు. సూర్యుడి పరిమాణంలో ఉండే నక్షత్రం, గురుడు పరిమాణంలో ఉండే ఓ వాయుగోళాన్ని అంతం చేస్తున్నాడని గుర్తించారు. శాస్త్రవేత్తలు ఈ ఖగోళ విషయాన్ని గమనించడం ఇదే మొదటిసారి. భూమికి 12,000 కాంతి సంవత్సరాల దూరంలోని అక్విలా కాన్స్టలేషన్ లో దీన్ని గమనించారు. వృద్ధాప్యంలో ప్రతీ నక్షత్రం కూడా చనిపోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా నక్షత్రాలు హైడ్రోజన్ ను హీలియంగా మార్చి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఏదో రోజు నక్షత్రంలోని ఇంధనం పూర్తిగా అయిపోయిన వెంటనే అవి ఉన్న సైజు కంటే కొన్ని వందల రెట్లు పెరుగుతూ..రెడ్ జాయింట్ గా మారుతోంది. ఆ సమయంలోనే గ్రహాలను అంతమొందిస్తుంది. ప్రస్తుతం గమనించిన ఈ ఖగోళ విషయం సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.
లిటన్ దాస్ స్థానంలో కేకేఆర్ టీమ్ లోకి విండీస్ ప్లేయర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు ఫలితం ఇరు టీమ్స్ మధ్య దోబూచులాడుతుంది. ఈ సీజన్ లో పలు జట్ల ప్లేయర్లు గాయాల బారిన పడుతూ టోర్నీకి దూరమైతే.. మరి కొందరు విదేశీ ప్లేయర్లు మాత్రం వ్యక్తిగత సమస్యల కారణంగా స్వదేశానికి వెళ్తున్నారు. వీరిలో కోల్ కతా జట్టు ప్లేయర్ ఒకరు లిట్టన్ దాస్.. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. లిట్టన్ దాస్ ను కేకేఆర్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కోల్ కతా జట్టు యాజమాన్యం అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. చార్లెస్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్. ఇవాళ సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ లో కేకేఆర్ తరపున అతడు జట్టులో చేరతాడని కేకేఆర్ యాజమాన్యం వెల్లడించింది. కోల్ కతా జట్టు ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్ లు ఆడింది. వాటిలో మూడు మ్యాచ్ లు మాత్రమే గెలిచి మిగిలిన ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదివ స్థానంలో నిలిచింది.
వారెవ్వా జాంటీ రోడ్స్.. నీకు సలాం
సౌతాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆయన పేరు వినగానే సంచలన క్యాచ్ లు.. మెరుపువేగంతో రనౌట్లు చేసిన సంఘటనలు గుర్తుకొస్తాయి. తన స్టన్నింగ్ ఫీల్డింగ్ తో ఎన్నోసార్లు దక్షిణాఫ్రికా గెలిచింది. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ గా మారిన జాంటీ రోడ్స్ తన మార్క్ ను చూపిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు. అయితే జాంటీ రోడ్స్ మంచి ఫీల్డర్ మాత్రమే కాదు.. తనలోని మంచితనం ఎలా ఉంటుందనేది కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు. సాధారణంగా మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తే పిచ్ పై కవర్లను కప్పడం మనం చూస్తాం.. కానీ ఆ కవర్లు లాగడానికి గ్రౌండ్స్ మెన్ చాలా కష్టపడతారు. చాలా బరువుండే దానికి గ్రౌండ్ లోకి తీసుకురావడం కత్తిమీద సామే.. అలాంటి కష్టం తెలిసి వ్యక్తి జాంటీరోడ్స్ గ్రౌండ్స్ మెన్ కు తనవంత సహాయం చేశాడు.
బక్క చిక్కిన హీరోయిన్.. గుండెలు బాదుకుంటున్న కుర్రకారు
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే హీరో, హీరోయిన్లు ఫిట్‌నెస్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా ఉండి మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే బెటర్ అని అంటున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి హీరోయిన్ మెహ్రీన్ కూడా చేరింది. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో మరీ సన్నబడింది. మెహ్రీన్ వస్తూ వస్తూనే సంచనాలు చేసింది. ముద్దుగా బొద్దుగా ఉన్న ఆమె ఫిగర్ తో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. అలాంటి మెహ్రీన్ పూర్తిగా మారిపోయారు. ఆమె బాగా బరువు తగ్గారు. తాజాగా డెనిమ్ జీన్స్ లో నడుము చూపిస్తూ కుర్ర గుండెలు కొల్లగొట్టింది.