బదిలీలకు అప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవాలి.. ఇవి కీలకం..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ.. వారి బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపిన విషయం విదితమే.. జూన్ 10వ తేదీ వరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులుగా పేర్కొన్నారు.. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిల్లాల్లో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించనున్నారు.. ఇక, అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇవ్వనున్నారు.. ఇక, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.. సోమవారం నుంచి ఉద్యోగులు అన్‌లైన్ పోర్టల్‌లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేసింది ప్రభుత్వం. అయితే, సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లోనే బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచనున్నారు. ఆన్‌లైన్‌లో బదిలీల దరఖాస్తు నమోదు సమయంలో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై సొంత ధృవీకరణతో కూడిన సంతకాలు చేసి, వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
హత్యకు నెల రోజుల ముందే కుట్ర.. అవినాష్‌రెడ్డి సాకు చూపి తప్పించుకుంటున్నారు..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా.. వాదనలు వాడీవేడీగా సాగుతున్నాయి.. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన సీబీఐ తరపున న్యాయవాది.. అవినాష్‌రెడ్డి సీబీఐకి విచారణకు సహకరించడంలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్‌రెడ్డి ఏదో సాకు చూపి తప్పించుకున్నాడని తెలిపారు.. ఇక, వైఎస్ వివేకా హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందన్న సీబీఐ లాయర్.. వివేకా హత్య వెనుక రాజకీయ కారణం ఉందని వాదించారు.. అయితే, లోకసభ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డిని అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్‌మెంట్ చెబుతుంది కదా? అని సీబీఐ లాయర్‌ను ప్రశ్నించింది హైకోర్టు.. అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించినట్టు స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా? అన్న కోర్టు.. రాజకీయంగా అవినాష్‌రెడ్డి బలవంతుడు అని మీరే అంటున్నారు.. అలా అయితే వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐని ప్రశ్నించింది.. మరోవైపు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?.. వాళ్ల నుండి ఏమైనా సమాచారం రాబట్టారా? అని కూడా సీబీఐని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.. అయితే, వాళ్లు విచారణకు సహకరించలేదని కోర్టుకు విన్నవించింది సీబీఐ.. తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండగా.. ఎలాంటి తీర్పు వస్తుంది? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
160 స్థానాల్లో గెలవడం.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం..
వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడ.. అధికారంలోకి రావడం ఖాయం అన్నారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది ప్రజాపక్షమే అన్నారు. 2019లో ఓ దొపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని.. దాంతో సమానంగా అభివృద్ధి చేశాం. కానీ, మనం చేసిన పనులను చెప్పుకోలేకపోయాం. టీడీపీని ఎదుర్కొలేక కోడి కత్తి డ్రామా, సొంత బాబాయిని చంపి ప్రజల సింపతితో జగన్ సీఎం అయ్యారని విమర్శించారు.. సీఎం జగన్.. వేటాడి.. వెంటాడి తరిమి కొట్టే రోజులు వచ్చాయని హెచ్చరించారు.. 151 స్థానాలు రావడంతో జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయి.. ఒళ్లు మదమెక్కింది. ఇంత అనుభవమున్న పార్టీ అయినా సరే గత నాలుగేళ్లల్లో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు సీఎం జగన్‌ని ఛీకొడుతున్నారని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. సీఎం జగన్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ పేదవాడంట.. చంద్రబాబు ధనవంతుడట. జగన్ అబద్దాల కోరు అంటూ మండిపడ్డారు.. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుందన్న ఆయన.. 30 కేజీలున్న జగన్‌కు ఏడు బంగళాలు కావాలంట.. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? అని నిలదీశారు. ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తానంటూ విశాఖలో రాజధాని పెట్టి అక్కడో ఇల్లు కడతాడంట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే కాదు.. పులివెందులలో కూడా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు.
బెజవాడలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదు..!
బెజవాడలో ఫ్లెక్సీల రాజకీయం కాకరేపుతోంది.. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది పరిస్థితి… పటమట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది.. ఎన్టీఆర్, సీఎం జగన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. ఎన్టీఆర్ కి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.. అయితే, అవినాష్ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.. ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భారీగా పోలీసులను మోహరించారు. ఇక, ఘటనపై స్పందించిన వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్.. టీడీపీపై సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం .. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు దేవినేని అవినాష్.. ఎన్టీఆర్ లలితకళా అవార్డును పోసానికి ఇస్తున్నాం.. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారని మండిపడ్డారు.. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి నేత వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. ఇక, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వైసీపీ ఫ్లెక్సీలపై దేవినేని అవినాష్ స్పందిస్తూ.. మేం కూడా ఎన్టీఆర్ అభిమానులమే.. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు మాకుందన్నారు.. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదు.. అది వాళ్ల పార్టీ ఆఫీసు కాదు అని ఎద్దేవా చేశారు. మేం బ్యానర్లు కట్టే వరకు అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరన్నారు. వారి ప్రవర్తన చాలా బాధగా కలిగించింది.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కవ్వింపు చర్యలు.. అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దె రామ్మోహన్‌ను హెచ్చరించారు దేవినేని అవినాష్.
పెళ్లి సాకుతో మహిళా డాక్టర్ నుంచి 13 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మహిళా వైద్యురాలు మోసపోయిన ఉదంతం వెలుగు చూసింది. మ్యాట్రిమోనియల్ సైట్‌లో నకిలీ ఐడీలు సృష్టించి నిందితులు మహిళలను తమ వలలో వేసుకునేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అందిన కాడికి సొత్తు మొత్తాన్ని దోచుకునేవారు. మహిళా డాక్టర్ విషయంలో కూడా అదే జరిగింది. మ్యాట్రిమోనియల్ సైట్‌లో బాధితురాలిని నిందితుడు గుర్తించాడు. ఆ తర్వాత పెళ్లి సాకుతో మహిళా వైద్యురాలి నుంచి నిందితులు రూ.13 లక్షలకు పైగా దోపిడీ చేశారు. మోసం చేసిన ముగ్గురు నైజీరియన్ పౌరులను పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. కొంతకాలం క్రితమే మ్యాట్రిమోనియల్ సైట్‌లో వికాస్‌కుమార్‌తో పరిచయం అయినట్లు పోలీసులకు తెలిపింది. తాను స్కాట్లాండ్‌లో ఉంటున్నానని వికాస్ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. వారిద్దరూ వాట్సాప్ కాల్స్, చాట్‌ల ద్వారా రోజంతా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇంతలో వికాస్ బాధితురాలికి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిపాడు, దీనికి మహిళా డాక్టర్ కూడా అంగీకరించింది. ఇంతలో తన పుట్టినరోజు సందర్భంగా నిందితుడు తనకు బహుమతి పంపాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనకు కాల్ వచ్చిందని తెలిపింది. ఫోన్ చేసిన వ్యక్తి నేను కస్టమ్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడుతున్నాను అని చెప్పాడు. మీ బహుమతి కస్టమ్‌లో చిక్కుకుంది, మీరు దానిని ఫార్వార్డ్ చేయాలనుకుంటే, మీరు రూ. 35,000 చెల్లించాలి. దీంతో సదరు యువతి ఆ వ్యక్తి ఇచ్చిన ఖాతాలో 35 వేల రూపాయలు జమ చేసింది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ కాల్ వచ్చింది. మీ పార్శిల్‌లో విదేశీ కరెన్సీ ఉందని, దాని కోసం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని, దానిపై మహిళ పేర్కొన్న బ్యాంక్ ఖాతాలో మొత్తాన్ని జమ చేసింది.
‘ఇక్బాల్’ చాప్టర్‌ను తొలగించిన ఢిల్లీ యూనివర్సిటీ..!
సారే జహాసే అచ్చా.. హిందూస్తాన్ హమారా.. హమారా.. గేయం గుర్తుందిగా.. ఈ గేయాన్ని ప్రముఖ కవి మహ్మద్ ఇక్బాల్ రాశారు. అవిభక్త భారతదేశంలో రాసిన గేయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని.. ఎంతో ప్రజాదరణ పొందింది. అటువంటి గేయాన్ని రచించిన ఇక్బాల్ చరిత్రను విద్యార్థులకు తెలియజేసేలా సిలబస్‌లో ఆయన గురించి చాప్టర్‌ను పెట్టారు. అది కూడా పీజీ స్థాయిలో పెట్టారు. అయితే, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇక్బాల్ గురించి ఉన్న చాప్టర్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ అకాడమీ మండలి ఇక్బాల్‌కు సంబంధించి ఉన్న చాప్టర్‌ను తొలగించాలని తీర్మానం చేసింది. బీఏ పొలిటికల్ సైన్స్ చదివే విద్యార్థులకు వారి 6వ సెమిస్టర్ పేపర్‌గా ఇక్బాల్ గురించి ఉంది. మాడ్రన్ ఇండియన్ పొలిటికల్ థాట్ చాప్టర్‌లో ఇక్బాల్ గురించి ఉంది. ఆ చాప్టర్‌ను తొలగించాలని యూనివర్సిటీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్(ఈసీ) తుది నిర్ణయం తీసుకుందని వర్సిటీ అధికారులు తెలిపారు. అవిభాజిత భారతదేశంగా ఉన్నపుడు 1877లో సియాల్‌కోట్‌లో ఇక్బాల్ జన్మించారు.
అమెరికాలో ఫెడరల్ హాలీడేగా దీపావళి!
భారత ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి ఇకపై అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా అధికారిక సెలవు ఇవ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో శుక్రవారం గ్రేస్ మెంగ్ ఈ ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టారు. గ్రేస్ మెంగ్ ప్రతిపాదనను కొందరు చట్టసభ్యులతోపాటు అమెరికాలోని భారతీయ కమ్మూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ బిల్లు తొలుత పార్లమెంటులో పాస్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత అధ్యక్ష్యుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగను సెలవు దినంగా అమెరికా చట్టసభలో ఆమోదముద్ర పడితే అమెరికా ఫెడరల్ హాలీడేస్‌లో 12వది నిలువనుంది. గ్రేస్ మెంగ్ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైందని.. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోని ఎన్నో కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయని గ్రేస్ తెలిపారు. అమెరికన్ పౌరులు సైతం దీపావళి వేడుకల్లో హుషారుగా పాల్గొనడం చూస్తున్నామన్నారు. దీపావళి వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయన్నారు. ఈ నేపథ్యంలోనే దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతోపాటు పలువురు చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు చెందిన మరో చట్ట సభ్యురాలు జెన్నిఫర్ కూడా దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌మ్యాన్ శేఖర్ క్రుష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతించారు. శేఖర్ క్రుష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హైజ్లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండటం చూస్తున్నాం. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తోపాటు ప్రత్యేక సెలవులుగా ఫెడరల్ హాలీడేస్ కూడా ఉంటాయి. అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్ హాలీడేస్ ఉన్నాయి. ఇపుడు దీపావళికి కూడా ఫెడరల్ హాలీడే ఇస్తే 12వ ఫెడరల్ హాలీడేగా గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న 11 ఫెడరల్ హాలీడేస్‌లో న్యూ ఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్‌డే, మెమొరియల్ డే, జూన్‌టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్ గివింగ్ డే, క్రిస్మస్ డే ఉన్నాయి. ఇపుడు దీపావళికి ఫెడరల్ హాలీడేగా ప్రకటిస్తే 12వ ఫెడరల్ హాలీడేగా నిలవనుంది.
లాంగ్ కోవిడ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలు
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 తరువాత ప్రస్తుతం చాలా మంది లాంగ్ కోవిడ్‌తో బాధ పడుతున్నారు. ఇలా బాధపడటానికి ప్రధాన కారణం.. వారు గతంలో కొవిడ్-19 బారిన పడి ఉండటమే. కొవిడ్-19లో వచ్చిన వేరియంట్లలో ఒమిక్రాన్ వేరియంట్ తరువాత కరోనా బాధితుల్లో ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడయింది. కోవిడ్ బారిన పడిన ప్రతి 10 మందిలో ఒకరు ఇప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. లాంగ్ కొవిడ్‌లో భాగంగా మనుషులు చిన్న పనికే అలసిపోవడం, మెదడుపై ప్రభావం చూపడం, తల తిరిగడం, గ్యాస్ర్టిక్ సమస్యలు రావడం, గుండె దడ, సెక్స్‌పై ఆసక్తి ఉండకపోవడం, తరచు దాహం వేయడం వాటితోపాటు రుచి, వాసన తెలియకపోవడం లక్షణాలుగా ఉన్నాయి. వీటితోపాటు విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు లాంగ్ కోవిడ్ ఉన్న వారిలో కనిపిస్తున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకటించింది.
మోడీ అమెరికాకు వెళ్లకముందే.. భారత్‌ను నాటో ప్లస్‌లో చేర్చాలని డిమాండ్
గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య స్నేహం చాలా బలంగా మారింది. దీని ఫలితం వ్యాపారం రంగంలో కూడా కనిపించింది. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాలు దగ్గరయ్యాయి. ఈ ఎపిసోడ్‌లో, నాటో ప్లస్‌లో భారత్‌ను చేర్చాలని అమెరికాలో సిఫార్సు చేయబడింది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అతని పర్యటనకు ముందు, ఒక శక్తివంతమైన కాంగ్రెస్ కమిటీ భారతదేశాన్ని NATO ప్లస్‌లో చేర్చడం ద్వారా బలోపేతం చేయాలని సిఫార్సు చేసింది. ‘అమెరికా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య వ్యూహాత్మక పోటీ’పై ఏర్పాటు చేసిన హౌస్ సెలెక్ట్ కమిటీ ఈ మేరకు ప్రతిపాదించింది. ఈ కమిటీకి మైక్ గాలగర్ (రిపబ్లికన్) ఛైర్మన్‌గా, రాజా కృష్ణమూర్తి (డెమొక్రాట్) సభ్యుడిగా ఉన్నారు. తైవాన్ భద్రత సహా, ‘నాటో ప్లస్’ బలోపేతం కోసం భారత్‌ను భాగస్వామిగా చేసుకోవాలని ఈ కమిటీ స్పష్టం చేసింది. NATO Plus ప్రస్తుతం NATO Plus 5గా పిలువబడుతుంది. NATO Plus అనేది ఒక భద్రతా వ్యవస్థ. NATO మరియు ఐదు కూటమి దేశాలను ఒకచోట చేర్చడం దీని పని, తద్వారా ప్రపంచ రక్షణ సహకారాన్ని పెంచవచ్చు. ఈ 5 దేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ కూటమిలో భారత్‌ను కూడా చేర్చినట్లయితే, ఈ దేశాల మధ్య గూఢచారాన్ని పంచుకోవడం సులభం అవుతుంది. అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని కూడా పొందడం భారత్‌కు సులువు అవుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో వ్యూహాత్మక పోటీలో విజయం సాధించాలని అమెరికా భావిస్తున్నట్లు సెలక్షన్ కమిటీ తెలిపింది. అలాగే, తైవాన్ భద్రతను నిర్ధారించడం దీని లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, అమెరికా తన మిత్రదేశాలు మరియు భారతదేశంతో సహా భద్రతా భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. నాటో ప్లస్ భద్రతా వ్యవస్థలో భారత్‌ను చేర్చాలని కమిటీ చెబుతోంది. ఇది ప్రపంచ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో CCP దురాక్రమణను ఆపడంలో ఇండో-యుఎస్ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.
ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే Vs గుజరాత్.. ట్రోఫీ విజేత ఎవరో..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించి చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం 7: 30గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ పోరు జరుగనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే 10 సార్లు ఫైనల్ కు చేరింది. ఐపీఎల్‌లో 61.28 శాతం సీఎస్కే అత్యధిక విజయాల రికార్డును కలిగి ఉంది. ఈ సీజన్లో గుజరాత్ నెంబర్ 2 జట్టుగా ఉండటమే కాకుండా నంబర్ 1 జట్టుగా ఫ్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. తొలి క్వాలిఫయర్ మ్యాచులో చైన్నై 172 పరుగులు చేయగా.. హార్ధిక్ పాండ్యా సేన 157 పరుగులే చేసి ఓటమిపాలైంది. ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఐదోసారి ఛాంపియన్ గా నిలుస్తుందా..? లేక గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఛాంపియన్ అవుతుందా..? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మహేష్ అలా చేసినప్పుడల్లా బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించింది
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ టైటిల్ ని మే 31న థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం, అది కూడా అభిమానులు చెప్పే కౌంట్ డౌన్ తో అని మేకర్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని వెనక్కి తిరిగి సిగరెట్ తాగుతూ కనిపించాడు. మహేశ్ మాస్ లుక్ లో ఉన్నాడు అంటూ ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు. #SSMB28 అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి మహేశ్ ఫాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే టైటిల్ కూడా దాదాపు నేటివిటీ మ్యాచ్ అయ్యేలా మాస్ కనెక్ట్ అయ్యేలా ‘గుంటూరు కారం’ని ఫైనల్ చేసారని సమాచారం. ఇదిలా ఉంటే మహేశ్ బాబు హెడ్ బ్యాండ్ కట్టిన ప్రతిసారీ బాక్సాఫీస్ కి బొమ్మ చూపిస్తూ ఉంటాడు. రీజనల్ సినిమాలతో కూడా కలెక్షన్స్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే మహేశ్ బాబు మొదటిసారి ‘పోకిరి’ మూవీలో హెడ్ బ్యాండ్ కట్టాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పటివరకూ టాలీవుడ్ లో ఉన్న ప్రతి బాక్సాఫీస్ రికార్డుని బ్రేక్ చేసింది. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాలో కూడా మహేశ్ హెడ్ కి బ్యాండ్ కట్టాడు. ఈ మూవీ ఏకంగా నాన్-బాహుబలి రికార్డులని క్రియేట్ చేసింది. ఈ సెంటిమెంట్ ని బేస్ చేసుకోని #SSMB28 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఘట్టమనేని అభిమానులు చెప్తున్నారు. అతడు, ఖలేజ సినిమాలతో మహేశ్-త్రివిక్రమ్ లు హిట్ కొట్టలేక పోయారు కానీ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజులో హిట్ కొట్టడం గ్యారెంటి అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని త్రివిక్రమ్, మహేశ్ బాబు నిజం చేస్తారో లేదో తెలియాలి అంటే 2024 జనవరి 12 వరకూ ఆగాల్సిందే.