బీఆర్ఎస్‌కు బిగ్ రిలీఫ్.. ఈసీ నిర్ణయంతో..!
కేంద్ర ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పింది.. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్‌ను కొన్ని గుర్తులు దెబ్బకొట్టాయి.. కారును పోలిన గుర్తులు బ్యాలెట్‌లో ఉండడంతో.. చెప్పుకోదగిన స్థాయిలో వాటికి ఓట్లు వచ్చాయి.. అదే సమయంలో బీఆర్ఎస్‌కు తగ్గిపోయాయి.. దాని మూలంగానే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయి.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు ఆ పార్టీ నేతలు.. ఇన్నాళ్లకు వారికి ఈసీ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల గుర్తు జాబితా నుంచి బీఆర్‌ఎస్ ఆక్షేపించిన గుర్తులను తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎవరికీ కేటాయించకూడదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. ఈసీ తాజా నిర్ణయం ప్రకారం.. ఆటోరిక్షా, హ్యాట్ (టోపీ), ఇస్త్రీపెట్టె, ట్రక్ గుర్తులు ఇకపై తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ కేటాయించారు.. ఆ గుర్తులను నిషేధిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది ఈసీ.. ఇదే సమయంలో మొత్తం 193 గుర్తులను జాబితాలో పొందుపరిచింది ఎన్నికల కమిషన్.. ఇక, తెలంగాణలో నాలుగు పార్టీలు ఈసీ గుర్తించింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి కారు గుర్తు, ఎంఐఎంఐఎంకి గాలిపటం, తెలుగుదేశం పార్టీకి సైకిల్, వైఎస్సార్సీపీకి సీలింగ్ ఫ్యాను గుర్తులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. మరోవైపు.. జనసేన పార్టీకి షాకిచ్చింది ఈసీ.. ఏపీలో రెండు పార్టీలకు మాత్రమే ఎన్నికల సంఘం గుర్తించింది. వైఎస్సాసీపీకి సీలింగ్ ఫ్యాన్, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఖరారు చేసింది.. కానీ, జనసేన పార్టీ త గుర్తుగా ప్రచారం చేసుకుంటున్న ‘గాజు గ్లాసు’ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.
టెన్త్ టాపర్లకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ సారి 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరిగింది.. అయితే, గవర్నమెంట్ స్కూళ్లలోని టెన్త్ చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. గవర్నమెంట్ స్కూళ్లలో టెన్త్‌లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు విస్తరించారు.. రాష్ట్ర, జిల్లా స్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు.. నియోజకవర్గంలో 1, 2, 3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ. 15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.
పొత్తులపై సీపీఐ రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌కు ఆ విషయం చెబుతాం..!
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా ఎన్నికల పొత్తులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేదా టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలు వెళ్తాయా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఇక, బీజేపీని దూరంగా పెడితే తాము కూడా పొత్తుకు సై అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.. పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలతో మేం కలిసి పనిచేస్తున్నాం.. మేం అందరం కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.. అయితే, బీజేపీతో కలసి పోటీ చేయవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెబుతాం అన్నారు. పాచిపోయిన లడ్డూలు.. మంచి లడ్డూలు ఎలా అయ్యాయో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ నేత రామకృష్ణ.
కొడాలి నానికి విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్.. గన్నవరం వస్తా రెడీయా..?
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.. ప్రజా చార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు.. మాజీమంత్రి కొడాలి నాని వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినా నేను రెడీ అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని చెప్పగలరా..? అంటూ సవాల్ చేశారు.. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ, తమ బంధువుల ఆస్తుల వ్యత్యాసం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, వైసీపీకి అనుకూలమైన ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీ.. ఇప్పుడు స్నేహం కోసం వెంపర్లాడుతోందంటూ సెటైర్లు వేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలవబోతోందని జోస్యం చెప్పారు.. మరోవైపు.. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు.. కానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారు. రేపు గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుతోంది.. 2024 ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుందని.. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని వెల్లడించారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.
రాయదుర్గం- ఎయిర్‌పోర్టు మధ్య 9 స్టేషన్లు.. ఖరారు చేసిన హెచ్‌ఏఎంఎల్ అధికారులు
రాయదుర్గం నుండి విమానాశ్రయానికి 31 కి.మీ. ఈ మార్గంలో మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగానే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు (హెచ్‌ఏఎంఎల్) 9 స్టేషన్లను ఖరారు చేసింది. మొదటి స్టేషన్ రాయదుర్గంలో ప్రారంభమవుతుంది. తదుపరి స్టేషన్లు బయోడైవర్సిటీ క్రాసింగ్, నానక్రంగూడ క్రాసింగ్, నార్సింగి, అప్పా క్రాసింగ్, రాజేంద్రనగర్, శంషాబాద్ టౌన్, విమానాశ్రయం వద్ద జాతీయ రహదారి (NH)కి దగ్గరగా, విమానాశ్రయ టెర్మినల్ వద్ద భూగర్భ మెట్రో స్టేషన్‌తో ముగుస్తుంది. క్రాసింగ్ లేని చోట స్టేషన్లు నిర్మించారు. ఏవైనా అడ్డంకులు ఎదురైతే మార్పులు, చేర్పులు చేయడానికి రాయితీదారుని అనుమతించడానికి స్టేషన్లు గుర్తించబడతాయి. మెట్రో ప్రయాణ వేగం, స్టాపింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వాటిని ఖరారు చేయనున్నారు. భవిష్యత్ అవసరాల కోసం మరో 4 స్టేషన్లు ఉండేలా అలైన్‌మెంట్ రూపొందించారు. భవిష్యత్తులో నార్సింగి-అప్పకూడలి మధ్య మంచిరేవు వద్ద స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పకూడలి మరియు రాజేంద్రనగర్ మధ్య కిస్మత్‌పూర్ వద్ద అదనపు స్టేషన్ కూడా సాధ్యమే. శంషాబాద్ పట్టణ కేంద్రం రాజేంద్రనగర్ నుండి చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉందని, చాలా కంపెనీలు ఉన్నాయని పేర్కొంది. జనాభా విస్తరిస్తే ఇక్కడ కూడా స్టేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో నిర్మాణ పనులకు అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గ్లోబల్ టెండర్ల దాఖలుకు జూలై 5 వరకు గడువు ఉందని, రూ.6250 కోట్ల పనుల్లో నిర్మాణానికి రూ.5,688 కోట్లు, పెగ్ మార్కింగ్ తదితర పనులకు మిగిలిన రూ.562 కోట్లు కేటాయించామని ఎండీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఏకైక డిప్యూటీ సీఎంగా డీకేఎస్.. పార్టీ అధికారిక ప్రకటన
కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలని మల్లగుల్లాలు పడిన పార్టీ అధిష్ఠానం.. చివరకు సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది. ఎట్టకేలకు కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు కేపీసీసీ అధ్యక్షుడిగానూ డీకే సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం మే 20న ఉంటుందని వెల్లడించారు. కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
పెళ్లి పీటలు ఎక్కి ట్విస్ట్ ఇచ్చిన వధువు.. కలరే కమాల్ చేసిందా..?
బీహార్ రాష్ట్రంలోని బాగల్పుర్లోని కహల్గావ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినోద్ మండల్ కుమార్తె కిట్టూ కుమారికి.. ధనౌరా ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరేంద్ర సింగ్ తనయుడు నీలేశ్ కుమార్ సింగ్‌తో.. వివాహం నిశ్చయించారు.. ఇక, పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి.. ఈ తంతు చూసి.. కొత్త జంటను ఆశీర్వదించడానికి స్నేహితులు, బంధువలు, స్థానికులు అంతా వచ్చారు.. వరుడు ఊరేగింపుగా వివాహ వేదికకు చేరుకున్నాడు.. కొద్దిసేపట్లో దండలు మార్చుకునే కార్యక్రమం ప్రారంభమైంది.. కాబోయే వరుడిని చూడగానే యువతి ముఖంలో హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి.. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు.. అతడిని చూడగానే యూటర్న్ తీసుకుంది.. నాకు ఇతడితో పెళ్లి వద్దని తెగేసి చెప్పింది.. వరుడి మెడలో దండ వేసేందుకు, తిలకం పెట్టేందుకు నిరాకరించింది.. కుటుంబ సభ్యులు, బంధువులు, చివరకు ఆ పెళ్లి కూతురు తండ్రి రంగంలోకి దిగి సద్దిచెప్పే ప్రయత్నం చేసినా.. యువతికి పలు హామీలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆపై కుటుంబ సభ్యులు ఆమెను మందలించే ప్రయత్నం చేశారు. కొందరైతే గట్టిగా బెదిరించారు. వధువు వెనక్కి తగ్గడం అటుంచితే.. మరింత మొండికేసింది.. వివాహ వేదిక నుంచి దిగిపోయింది.. చేసేది ఏమీ లేక చివరకు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు ఇరు కుటుంబాల సభ్యులు.
రూ.535 కోట్ల నగదుతో రోడ్డుపై నిలిచిపోయిన కంటైనర్.. ఆ తర్వాత ఏమైందంటే?
రెండు కంటైనర్ ట్రక్కులు, చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ట్రక్కులలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగవలసి వచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై నిలిపివేశాడు. దీంతో రెండో ట్రక్కు కూడా అక్కడే ఆగింది. ఆ రెండు ట్రక్కుల్లో రూ.1,070 కోట్లు ఉండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై 17 మంది పోలీసులు ట్రక్కులకు ఎస్కార్ట్‌గా ఉన్నారు. రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ట్రక్కు చెడిపోయిందని తెలుసుకున్న క్రోంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మరింత రక్షణ కోసం పోలీసులను పిలిచారు. జిల్లాలోని బ్యాంకులకు కరెన్సీని అందించేందుకు రెండు లారీలు చెన్నైలోని ఆర్‌బీఐ కార్యాలయం నుంచి విల్లుపురం బయలుదేరినట్లు తెలిసింది. ట్రక్కులలో ఒకటి చెడిపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా దానిని చెన్నైలోని తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు తరలించారు. తాంబరం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసన్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని చెడిపోయిన లారీని గుర్తించారు. ట్రక్కును సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించి, గేట్లను మూసివేశారు. ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించడం కొంతకాలం నిషేధించబడింది. మెకానిక్‌లు ట్రక్కును రిపేరు చేయలేకపోవడంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి పంపించారు.
టయోటా కీలక నిర్ణయం.. ఇక, నో వెయిటింగ్..!
టయోటా కిర్లోస్కర్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది.. తన కర్ణాటక ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచింది.. ఏకంగా 30 శాతం పెంచడానికి మూడో షిఫ్ట్‌ను ప్రారంభించింది.. దీనికి ప్రధాన కారణం.. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోవడమే.. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ మోడళ్లను కస్టమర్లకు అందించడానికి సమయం పడుతోంది.. దీంతో.. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలన్నది కంపెనీ ప్రధాన టార్గెట్‌గా ఉంది.. దీని కోసం ఈ యూనిట్‌లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కంపెనీ రూ.90 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ఆటోమేకర్ మే మొదటి వారం నుండి బెంగుళూరు శివార్లలోని బిడాడిలోని ప్లాంట్ 1లో తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి మూడవ షిప్టును ప్రారంభించింది. ఈ సదుపాయంలో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కంపెనీ రూ.90 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ప్లాంట్‌లో మూడో షిఫ్ట్ కోసం దాదాపు 1,500 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది.. “మేం ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ మరియు ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లో మూడో షిప్ట్‌ను ప్రారంభించాం. ఈ ఉత్పత్తులు చాలా విజయవంతమయ్యాయి.. మరోవైపు చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది.. దీంతో, వినియోగదారులకు వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. అని టీకేఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుదీప్ ఎస్ దాల్వి వెల్లడించారు.
‘ఆదిపురుష్’ రన్ టైం లాక్… ‘జై శ్రీరామ్’ ఫుల్ సాంగ్ వచ్చేస్తోంది!
ఆదిపురుష్ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది జై శ్రీరామ్ సాంగ్. ఇప్పటికే రిలీజ్ చేసిన వన్ మినిట్ డ్యూరేషన్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది, ట్రైలర్‌లో కూడా ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. దాంతో జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. మే 20న జై శ్రీరామ్ సాంగ్ ని విడుదల చేయనునున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ బయటకి వస్తే ఆదిపురుష్ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే… చాలా రోజులుగా ఆదిపురుష్ రన్ టైమ్ గురించి టాక్ నడుస్తునే ఉంది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ నిడివి లాక్ అయినట్టు తెలుస్తోంది. ఇండియన్ వెర్షన్ రన్‌టైమ్ రెండు గంటల యాభై ఆరు నిమిషాల నిడివి ఉండబోతున్నట్లు సమాచారం. ఓవర్‌సీస్ వెర్షన్ రెండు నిమిషాలు తక్కువగా అంటే రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక నిడివితో వస్తున్న సినిమాగా ఆదిపురుష్ నిలవనుంది. మొత్తంగా ఇంటర్వెల్ తో కలుపుకోని ఆదిపురుష్ సినిమా కోసం థియేటర్లో మూడు గంటలకు పైగా సమాయాన్ని కేటాయించాల్సిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను జూన్ 16న గ్రాండ్‌గా అన్ని భాషల్లో 2డి, 3డిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. తానాజీ లాంటి విజువల్ వండర్ మూవీని ఇచ్చిన ఓం రౌత్.. ఆదిపురుష్‌తో మరోసారి ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
గన్స్, బైక్స్, ఛేజ్… మెగా ప్రిన్స్ ఎదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నాడు
మెగా ఫ్యామిలీ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కాస్త ట్రెండ్ మార్చి కొత్త రకం సినిమాలు చేసే హీరో వరుణ్ తేజ్. రిజల్ట్ తో సంబంధం లేకుండా అంతరిక్షం, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు చెయ్యడం వరుణ్ తేజ్ నైజం. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీ ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ తన ఫిల్మోగ్రఫీలో మంచి వేరియేషన్స్ చూపిస్తున్న వరుణ్ తేజ్, రీసెంట్ గా ‘గని’ సినిమాతో మెగా ఫాన్స్ ని డిజపాయింట్ చేసాడు. బాక్సింగ్ నేపధ్యంలో రూపొందిన ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ బాగానే కష్టపడ్డాడు కానీ ఫలితం దక్కలేదు. దీంతో మెగా ప్రిన్స్ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ‘VT 12’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మేకర్స్ ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు. టైటిల్ మెగా ఫాన్స్ నే కాకుండా రెగ్యులర్ మూవీ లవర్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. ఏజెంట్ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ‘సాక్షి’ గాండీవధారి అర్జున సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ముఖేష్ కెమెరా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఆర్ట్ విభాగాన్ని అవినాష్ కొల్లా చూసుకుంటారు. ప్రస్తుతం ఈ స్పై యాక్షన్ మూవీ ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. “బడాపెస్ట్ లో ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్నాం. కొన్ని కీ సీన్స్ ని ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నాం” అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా సెట్స్ నుంచి కొన్ని ఫొటోస్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. వీటిలో గన్స్, బైక్స్, ఛేజ్ లకి సంబందించిన ఫోటోలు ఉన్నాయి. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న గాండీవధారి అర్జున సినిమాతో అయినా వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. వరుణ్ తేజ్ కి మాత్రమే కాదు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నాగార్జునతో ప్రవీణ్ సత్తారు చేసిన యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’ హెవీ లాస్ ని ఫేస్ చేసింది. సో ప్రవీణ్ సత్తారుని హీరోలు, ప్రొడ్యూసర్ లు మళ్లీ నమ్మాలి అంటే అతను గాండీవధారి అర్జున సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల్సిందే.