ఏపీ హైకోర్టు కొత్త సీజే ప్రమాణస్వీకారం.. అభినందనలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్.. కొత్త సీజేతో ప్రమాణం చేయించారు. ఇక, ఈ కార్యక్రమానికి శాసనమండలి సీఎం వైఎస్ జగన్‌తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువులు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం గవర్నర్, సీఎం వైఎస్ జగన్ కొత్త సీజేను సన్మానించి అభినందనలు తెలిపారు. హై టీ సమయంలో సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. శాలువాతో సన్మానించారు.
నిర్మలా సీతారామన్‌కి పురంధేశ్వరి లేఖ.. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు..!
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా.. సీఎం జగన్, వైసీపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ఇక, తాజాగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖరాశారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.. వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తోందంటూ ఫిర్యాదు చేశారు.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏయే విధంగా అప్పులు చేసిందనే వివరాలను లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రూ.7.15 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకుందని లేఖలో వెల్లడించారు. ఉద్యోగులకివ్వాల్సి పీఎఫ్ క్లైమ్స్.. డీఏలు కూడా భారీగా పెండింగులో ఉన్నాయన కేంద్ర ఆర్థికమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి. లిక్కర్ ఆదాయం తాకట్టు పెట్టి ఇప్పటికే తీసుకున్న అప్పులే కాకుండా మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని లేఖలో స్పష్టం చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న ఆర్థిక అవకతవకలపై సమీక్షించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను లేఖలో కోరారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ చేస్తూ వస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు తాజాగా, మరికొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హర్టికల్చర్ డైరెక్టర్‌గా గంధం చంద్రుడు.. గ్రామ, వార్డు సచివాలయ అసిస్టెంట్ డైరెక్టరుగా హెచ్ ఎం ధ్యానచంద్ర, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా నిశాంతి, కొనసీమ జిల్లా జేసీగా శ్రీవాస్ నూపూర్, నంద్యాల జేసీగా రాహుల్ కుమార్ రెడ్డి, కేఆర్ పురం ఐటీడీఏ పీవోగా సూర్యతేజ, ఎస్ఎస్ శ్రీధర్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కాగా, ఈ మధ్యే.. పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా ఆర్.గోవిందరావు, అన్నమయ్య జిల్లా జేసీగా పర్మాన్ అహ్మద్‌ఖాన్, వెనుకబడిన తరగతుల ఆర్థిక కార్పొరేషన్‌కు వీసీ, ఎండీగా క్రైస్ట్ కిషోర్, ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌గా హిమాన్షు కౌశిక్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఎ.భర్వత్ తేజ, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ డైరెక్టర్‌గా వి.ఆంజనేయులు, స్వామిత్వ స్పెషల్ కమిషనర్‌గా ఎ.సిరి, ఆయుష్ కమిషనర్‌గా ఎస్.బి.ఆర్.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే.
తెలంగాణలో వర్ష బీభత్సం.. రికార్డు బద్దలు కొట్టిన వర్షపాతం
గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యగా ఈరోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో 8 మంది చనిపోయారు. తెలంగాణలో గురువారం కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, వ్యవసాయ పంటలు దెబ్బతినడంతో జూలై 22 నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాల కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో ములుగు జిల్లాలో 649.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా అత్యధికంగా 24 గంటల వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇదే కాలంలో సగటు వర్షపాతం 97.7 మిల్లీమీటర్లు కురిసింది, ఇది మునుపటి ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న హైదరాబాద్‌లో దాదాపు 300 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) గణాంకాల ప్రకారం, జూలై 19 నుండి 26 వరకు, హైదరాబాద్‌లో 299 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో, నగరంలో సంచిత వర్షపాతం 399.1 మి.మీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సగటున 530.2 మిల్లీమీటర్ల సంచిత వర్షపాతం నమోదైంది. సాధారణ స్థాయి 329.3 మిమీ నుండి 61 శాతం విచలనం. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని లోటు నుంచి మిగులు జిల్లాలుగా మారాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. హనుమకొండలో పలుచోట్ల, కరీంనగర్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల, జనగాం, భద్రాద్రి కొత్తగూడెంలో కొన్నిచోట్ల అనూహ్యంగా భారీ వర్షాలు కురిశాయని తెలంగాణ రోజువారీ వాతావరణ నివేదికలో వాతావరణ కేంద్రం తెలిపింది.
ముంబయిలో భారీ వర్షాలు.. పాల్ఘర్, థానేలో స్కూళ్లకు సెలవులు
ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. మహారాష్ట్రలోని పాల్ఘర్, థానేలోని పాఠశాలలను మూసివేసింది. గురువారం వరకు ముంబయిలో 90 శాతానికి పైగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 13 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమై దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్రలోని పాల్ఘర్, థానేలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే, పలు ప్రాంతాలకు ‘రెడ్’ అలర్ట్ జారీ చేసింది. ముంబయి నగరం, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్లో పేర్కొంది. నీటిని సరఫరా చేసే ఏడు సరస్సుల్లో ఒకటైన మోదక్ సాగర్ సరస్సు గురువారం రాత్రి 10:52 గంటలకు ఉప్పొంగడం ప్రారంభమైంది.
యూజర్స్ కు గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్.. ఇకమీదట వీడియో చాట్..
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వాడుతున్న యాప్ వాట్సాప్.. వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్ కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.. తమ యూజర్స్ కు ఎటువంటి భంగం కలగకుండా సరికొత్త ఫీచర్స్ ను తో పాటుగా డాటాను సెక్యూర్ గా ఉంచుతుంది.. దాంతో వాట్సాప్‌కు భారతదేశంలోనే 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రజలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, వెబ్‌లో వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు..కస్టమర్స్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ యాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఇది వినియోగదారులకు చిన్న వీడియో సందేశాలను పంపడానికి వీలు కల్పిస్తుంది. మునుపటి వినియోగదారులు తక్షణ ఆడియో లేదా చిన్న సందేశం సహాయంతో ప్రత్యుత్తరం ఇవ్వగలిగినప్పటికీ, కొత్త ఫీచర్ ఇప్పుడు వినియోగదారులను చిన్న వీడియోలను రికార్డ్ చేయడానికి మరియు టెక్స్ట్ మెసేజ్ లకు బదులుగా వాటిని పంపడానికి అనుమతిస్తుంది. ఈ వీడియో సందేశాలు 60 సెకన్ల వరకు ఉండవచ్చు. ఈ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని కంపెనీ పేర్కొంది. ఫీచర్ యొక్క రోల్ అవుట్ ఇప్పటికే ప్రారంభించబడింది… ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ త్వరలో అందుబాటులో ఉంటుంది.
యాపిల్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 విడుదల ఆ రోజే!
యాపిల్ విడుదల చేసే ‘ఐఫోన్’ మోడల్స్ విడుదలకు ముందే.. మొబైల్ మార్కెట్‌లో ఓ ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. ఐఫోన్ మోడల్స్ ధర, ఫీచర్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని టెక్ ప్రియులూ ఆసక్తిగా ఉంటారు. అలాంటి ఐఫోన్ లవర్స్‌కు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌ను మార్కెట్‌లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై యాపిల్ కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. యాపిల్ తన ఉత్పత్తులను మార్కెట్‌లో రిలీజ్ చేసే ముందు ఓ ప్రత్యేక కార్యక్రమంను నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 15 సిరీస్ కోసం కుపెర్టినోలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ప్రత్యేక కార్యక్రమంను ఏర్పాటు చేసిందని సమాచారం తెలుస్తోంది. భారతదేశంలో ఐఫోన్ 15 ధర దాదాపుగా రూ. 80,000 ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇప్పటివరకు యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 ధర గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ధర బేస్ మోడల్‌కు ఉండవచ్చు. ఫీచర్లు మరియు కాన్ఫిగరేషన్‌పై ఆధారపడి ధర పెరుగుతుంది. ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల ధరలు లక్ష్య పైనే ఉండనున్నాయి.
కర్మరా బాబు.. మొబైల్ పోయిందని స్టేషన్‌కు పోతే నిమిషాల్లోనే బైక్ పోయింది
అదృష్టం బాగుంటే ఒంటెపై కూర్చున్న వ్యక్తిని కూడా కుక్క కాటు వేయవచ్చని అంటారు. పూణెకు చెందిన ఓ వ్యక్తి విధి ఎంత దారుణంగా మారిందంటే.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండు ఘటనలకు బలయ్యాడు. మొదట సాయం కోరిన ఓ వ్యక్తి తన మొబైల్‌తో పారిపోయాడు. ఘటన తర్వాత.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న బాధితుడికి సాయం పేరుతో మరో వ్యక్తి బైక్‌ను ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించి పూణెలోని భోసారి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూలై 20న జరిగింది. ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి తన ఇంట్లో ఓ ముఖ్యమైన పని చేయాల్సి ఉందని చెప్పాడని బాధితుడు తన ఫిర్యాదులో పేరొన్నాడు. అతని దగ్గర ఫోన్ కూడా లేదు. దీంతో ఏదో అర్జంట్ అయి ఉంటుందిలే అనుకుని బాధితుడు కాల్ చేయడానికి తన ఫోన్ ఇచ్చాడు. మొబైల్ చేతికి చిక్కగానే సదరు వ్యక్తి పారిపోయాడు. ఈ వ్యక్తి సమస్య ఇక్కడితో ముగియలేదు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ చిరునామా కోసం అక్కడ ఉన్న ప్రజలను అడిగాడు. ఈ ముఠాతో సంబంధమున్న మరో వ్యక్తి అక్కడ ఉన్నాడు. బాధితుడి వద్దకు వచ్చి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సహాయం చేస్తానని చెప్పాడు. అందుకు ప్రతిగా సిగరెట్ ఇవ్వమని చెప్పాడు ఈ దుండగుడు. బాధితుడు సిగరెట్ కొనేందుకు సమీపంలోని దుకాణానికి రాగానే.. ఆ దుండగుడు బైక్‌తో పరారయ్యాడు. ఈ కేసులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాంగ్ వస్తుంది… త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యుట్యూబ్ ని కుదిపేసిన సలార్ టీజర్, అప్పటివరకూ ఉన్న రికార్డులు చెల్లా చెదురు చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. టీజర్ కే ఇలా అయిపోతే ఎలా సలార్ ట్రైలర్ వస్తుంది వెయిట్ చేయండి, మాస్ హిస్టీరియా అనే పదానికి అర్ధం చూపిస్తాం అంటూ మేకర్స్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆగష్టులో ట్రైలర్ రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఫస్ట్ సాంగ్ బయటకి రానుంది. సలార్ ట్రైలర్ కన్నా ముందు సాంగ్ బయటకి రానుంది. KGF సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటుందో సాంగ్స్ కూడా అదే రేంజులో ఉంటాయి. తుఫాన్ సాంగ్ కైతే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఆ రేంజ్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు సలార్ విషయంలో అది రిపీట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి. మేకర్స్ ఫస్ట్ సాంగ్ ని రెడీ చేసారట, ప్రశాంత్ నీల్ వైఫ్ సలార్ మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో సలార్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి సలార్ సాంగ్స్ KGFని మించి ఉంటాయా లేదా అనేది చూడాలి.
బాలీవుడ్ లిస్టులో మరో హిట్… మంచి రోజులు వస్తున్నాయి
కోవిడ్ ఎరాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేసింది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. షారుఖ్, సల్మాన్, ఆమిర్, అక్షయ్ లాంటి స్టార్ లు ఫ్లాప్స్ ఇవ్వడం… సుశాంత్ మరణం… వీక్ కథలు… కరోనా… నెపోటిజం… బాయ్ కాట్ బాలీవుడ్ లాంటి కారణాలతో బాలీవుడ్ విపరీతమైన డౌన్ ఫాల్ ని ఫేస్ చేసింది. ఇదే సమయంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై స్వైర విహారం చేసాయి. దీంతో బాలీవుడ్ గత 40-50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నెగటివ్ ట్రెండ్ ని చూసింది. ఇదే నెగటివ్ ట్రెండ్ లో రెండేళ్ల పాటు నెట్టుకొచ్చిన బాలీవుడ్, ఎట్టకేలకు రెక్కలు విదిలించడం మొదలుపెట్టింది. జనవరిలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం బాలీవుడ్ మార్కెట్ ని బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బాలీవుడ్ కోలుకోవడం మొదలయ్యింది. ఫిబ్రవరి నెలలో పెద్దగా సినిమాలు లేకపోయినా మార్చ్ లో రణబీర్ కపూర్ ‘తూ జూతి మే మక్కర్’ సినిమాతో హిట్ కొట్టాడు. ఏప్రిల్ సల్మాన్ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ మూవీ లాంగ్ రన్ లో నిలబడలేదు కానీ ఓపెనింగ్స్ విషయంలో ట్రేడ్ కి మంచి జోష్ తెచ్చింది. మే నెలలో ది కేరళ స్టోరీ, IB 71 సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ది కేరళ స్టోరీ వివాదాలతో మొదలై సెన్సేషనల్ హిట్ అయితే IB 71 స్లోగా స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయ్యే వరకూ వెళ్ళింది.