కోడి పందాల క్రేజ్.. పుంజులకు భారీ డిమాండ్
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో కోడి పందాల హడావిడే మామూలుగా ఉండదు.. కోడి పందాలు నిర్వహించొద్దు.. కఠిన చర్యలు తప్పవు అని అధికారులు, పోలీసులు హెచ్చరించినా.. బహిరంగంగా కొన్ని ప్రాంతాల్లో.. గుట్టుగా మరికొన్ని చోట్ల నిర్వహిస్తూనే ఉన్నారు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ రోజుల్లో 200 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు పందాల్లో చేతులు మారతాయనే అంచనాలు లేకపోలేదు.. అయితే, అదంతా పందాల రూపంలో.. ఇప్పుడు పందెం బరిలో దిగే కోడి పుంజలకు భారీ డిమాండ్ ఉంది.. సంక్రాంతి కోడి పందేలకు ఉండే క్రేజే వేరే లెవల్ కాగా.. పందెంలో మన కోడి నిలవాలి.. గెలవాలి అనుకునేవారు.. ఏరికోరి కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు.. దీంతో, సంక్రాంతి పందాల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు.. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెబుతన్నారు. కోడి పుంజులు అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది అంటే మామూలు విషయం ఏమీ కాదు.
వేగంగా రైల్వేల అభివృద్ధి.. 2.94 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాం..
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. గూడ్స్ రవాణా నుంచి ప్యాసింజర్ ట్రైన్లు అభివృద్ధి చేశాం.. 53 శాతం రాయితీతో రైల్వే సేవలందిస్తోందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా వేగంగా రైల్వే అభివృద్ధి చెందింది.. స్విట్జర్లాండ్ తో సమానంగా నెట్వర్క్ అభివృద్ధి చేశాం.. 2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు. రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ పెరుగుతోంది.. 5750 కిలోమీటర్ల ట్రాక్ లు, బ్రాడ్ గేజ్ లుగా అభివృద్ధి చేశాం.. రైల్వే లైన్ల విద్యుదీకరణకు రూ.38,650 కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. 26296 కొత్తగా 231 డబ్లింగ్ లైన్లకు రూ.2.7 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేశాం.. అమృత్ భారత్ ద్వారా 1309 రైల్వేస్టేషన్ లు మోడరన్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. 508 రైల్వేస్టేషన్ లు అభివృద్ధికి ప్రధాని మోడీ ఒకే రోజు భూమి పూజ చేశారు.. 41 వందే భారత్ ట్రైన్లు, స్వదేశీ టెక్నాలజీతో సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు కిషన్‌రెడ్డి. ఇక, 2.94 లక్షల కొత్త ఉద్యోగాలు రైల్వేలో కల్పించామని తెలిపారు. 100 మీటర్ల పొడవైన స్క్రీన్ తో అతిపెద్ద ఆపరేషనల్ కమాండ్ సెంటర్ పని చేస్తోంది.. రెండు ఫ్రైట్ కారిడార్లు.. లుథియానా నుంచీ బీహార్ సోన్ నగర్ వరకు, ముంబై జవహర్ లాల్ నెహ్రూ పోర్టు నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని దాద్రి వరకూ ఉంటాయన్నారు. నిధుల అంశం పట్టించుకోకుండా RUB, ROBలు నిర్మాణం చేశాం.. జమ్మూకాశ్మీర్ లో చినాబ్ నది మీద ఐఫిల్ టవర్ కంటే అత్యంత ఎతైన పిల్లర్ల మీద వెళ్ళే రైల్వే బ్రిడ్జి నిర్మించాం అని వెల్లడించారు. విశాఖ నుంచి అరకు వరకూ విస్టాడాం కోచ్ లను ఏర్పాటు చేస్తున్నాం.. 6100 రైల్వేస్టేషన్ లలో ఫ్రీ హైస్పీడ్ వైఫై ఇచ్చామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
జనసేన వైపు మాజీ మంత్రి చూపు..! త్వరలో పవన్ కల్యాణ్ భేటీ..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. జనసేన పార్టీతో టచ్‌లోకి వెళ్లిపోయారట మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది.. అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేనలో చేరికపై కొణతాల క్లారిటీ ఇస్తారని ఆయన అనుచరులు చెబుతున్నమాట.. అయితే, వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల ఆలోచనగా ఉందట.. దాని అనుగుణంగా.. తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారట కొణతాల.. కాగా, కొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.. ఉమ్మడి విశాఖజిల్లాలో బలమైన గవర సామాజిక వర్గం ప్రతినిధిగా చెలామణీ అయ్యారాయన. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో పదేళ్లు పదవుల్లో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన కొణతాల.. కేవలం తొమ్మిది ఓట్లతో గెలిచారు. ఒక ఎంపీ… సింగిల్ డిజిట్ మెజారిటీతో గెలవడం ఇప్పటికీ రికార్డే. అయితే.. 2009లో ఓడిపోయినప్పటికీ కొంత కాలం ఆయన హవా నడిచింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం ఉండేది. 2014లో పార్టీ ఓడిపోవడం, విశాఖ ఎంపీ సీటులో ఎదురైన వైఫల్యాలు కొణతాలకు అధినాయకత్వంతో దూరం పెంచాయనేది రాజకీయ ప్రచారం. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ పక్కన పెట్టేసిన రామకృష్ణ సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల ముందు టీడీపీ ఆహ్వానం మేరకు చంద్రబాబును కలిశారు. దీంతో మరోసారి ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయం అనే ప్రచారం జరిగినా అది సాధ్యపడ లేదు. ఇక రాజకీయాలను పక్కన బెట్టి రైతు సమస్యలపై దృష్టి పెట్టారు. చెరకు సాగు ఇబ్బందులు, సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు మూత పడటం వంటి వాటిని అజెండాగా పెట్టుకుని వీలున్నప్పు డల్లా నియోజకవర్గాల్లో తిరుగుతూ వచ్చారు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఇప్పుడు కొణతాల.. జనసేన నేతలతో టచ్‌లోకి వెళ్లారట.. ఆయన జనసేనలో చేరతారని ఎప్పటి నుంచి ప్రచారం ఉన్నా.. ఇప్పుడు గ్లాసు గుర్తు పార్టీలో చేరి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్‌లో ఉన్నారు.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పార్టీ ఏదైనా సరే ఈ సారి పోటీ చేసి తీరాలని భావిస్తోన్న కొందరు నేతలు.. పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. ఏపీలో తిరిగి పుంజుకోవడానికి పావులు కదుపుతోన్న కాంగ్రెస్.. ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించే పనిలో పడిపోయింది.. విజయవాడలో ఈ రోజు మీడియాతో మాట్లాడి గిడుగు రుద్రరాజు.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు.. కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను స్ధానాలను మారిస్తే, ఒకచోట చెల్లనిది మరోచోట ఎలా చెల్లుబాటు అవుతుంది? అని ప్రశ్నించారు. బలహీనవర్గాల నాయకులను తక్కువ చేయడానికే ఈ మార్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల కు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని మండిపడ్డారు రుద్రరాజు.. టీడీపీ ఇద్దరితోనే నడుస్తోంది.. వైసీపీ కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరిగిందో తెలీదు.. అందరూ రండి కలిసి పనిచేద్దాం.. కాంగ్రెస్ నుంచి అందరికీ పిలుపునిచ్చారు. ఒంగోలులో యువభేరి నిర్వహించాం.. పాదయాత్ర, ర్యాలీ నిర్వహించామని గుర్తుచేశారు. అయితే, రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోయింది.. మత్తు పదార్ధాలు, గంజాయి అక్రమ రవాణా, సేద్యం మీద ఉక్కుపాదం మోపాల్సి ఉందన్నారు. 25 వేల కోట్ల రూపాయల మద్యం రాష్ట్రంలో అమ్ముడవుతోందన్నారు. పార్టీ నాయకుల మనోభావాలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ తెలుసుకున్నారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మండలాధ్యక్షులను నియమించుకున్నాం.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.
కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె.. మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె 32వ రోజుకు చేరింది.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్.. ఓవైపు ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ.. విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆందోళన మాత్రం విరమించడం లేదు.. తమ సమస్యలు పరిష్కరించి, డిమాండ్లను తీర్చాల్సిన ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు.. అయితే, కార్మిక సంఘాల ఆందోళనల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అంగన్వాడీలతో మరోసారి చర్చలు జరపనుంది ఏపీ ప్రభుత్వం.. అంగన్వాడీ సంఘాలకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చింది.. ఈ సాయంత్రం 3 గంటలకు చర్చలు జరపనున్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ .. ఈ చర్చలకు సచివాలయం వేదిక కానుంది.. కాగా, నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు.. ఇప్పటికే సమ్మె, ఆందోళనలు నిషేధిస్తూ ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం.. అయినా వెనక్కి తగ్గని అంగన్వాడీలు.. సమ్మె కొనసాగిస్తున్నారు. విధుల్లోకి రాకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.. కానీ, అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో.. సమస్య జటిలం కాకుండా చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మె విరమింప చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అంగన్వాడీల విషయంలోనూ అదే పంతా కొనసాగించాలనే ఆలోచనతో మరోసారి ఆయా సంఘాల నేతలను చర్చలకు పిలిచింది.
పార్టీ నన్ను మోసం చేసింది.. పెత్తందార్ల కోసం..! వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సీట్ల మార్పులు చేర్పులు కొన్ని స్థానాల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్నాయి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ నన్ను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి నిత్యం జనంలో ఉన్నా.. పెత్తందార్ల మాట కోసం నన్ను పక్కనబెట్టారని అసహనం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో ఏం జరుగుతుందో పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంలేదన్నారు. చింతలపూడిలో పెత్తందార్లకు పేదలకు మధ్య యుద్ధం జరిగింది.. కానీ, పార్టీ అధినేత జగన్ పెత్తందారులకే ప్రాధాన్యత ఇచ్చారని కామెంట్ చేశారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ కు, నాకు మధ్య విభేదాలు ఉన్నాయి.. పెత్తందారుల కాళ్లపై పడలేదు కాబట్టి నన్ను పక్కనబెట్టారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఎలిజా.. నేను పని చేశానో లేదో జనాన్ని అడిగితే చెప్తారన్న ఆయన.. ఒక పథకం ప్రకారం పార్టీ పెద్దలకు లేనిపోనివి చెప్పి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని.. పార్టీ చెప్పిన అన్ని పనులు నేను చేస్తూ వచ్చాను.. అన్ని చేసినా రిపోర్టులు బాగాలేదు అనడం అంటే పొమ్మనలేక పొగ పెట్టడమే అన్నారు. పార్టీ చేసే సర్వేలో రిపోర్టులు మంచిగా చెప్తున్నా కొంతమంది సీఎం వైఎస్ జగన్‌ను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. నాకు వ్యతిరేకంగా ఉన్న రిపోర్టులు ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నా దగ్గర ఉన్న రిపోర్టులు బయట పెడతానని సవాల్ చేశారు. ఇప్పుడు చింతలపూడిలో వైసీపీ, టీడీపీ – జనసేన తరపున బరిలో దిగబోయేది అందరూ పెత్తందారుల మనుషులే అంటూ మండిపడుతున్న ఎమ్మెల్యే ఎలిజా చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
టీడీపీకి వచ్చేవి 54 సీట్లే..! తేల్చేసిన కేశినేని నాని..
టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బెర్త్ దక్కించుకున్న.. ఎంపీ కేశినేని నాని.. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. విజయవాడ ద్రోహి చంద్రబాబు.. పొరపాటున కూడా గెలవడు అని జోస్యం చెప్పారు.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా బయటపెట్టారు.. టీడీపీకి 54 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. ఇక, ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ ఇది.. నా ఆటోనగర్.. నాకు ఎంతో ఇష్టమైన ప్రాంతం.. వాటర్ ట్యాంకుకు ఎంపీ లాడ్స్ నిధులతో పాటు, ఐలా నుంచీ అవినాష్ సహకారంతో నిధులు వచ్చాయి.. సమర్ధత కలిగిన వ్యక్తి అవినాష్, నేను కూడా సమర్ధుడినే.. నన్ను, అవినాష్ ని గెలిపించాలి.. మేం ఇద్దరం కలిస్తే డబుల్ రీటైనింగ్ వాల్ వస్తుందన్నారు. సమర్ధులకు ఓటేయండి… జగన్ ని, నన్ను, అవినాష్ ని గెలిపించండి అని పిలుపునిచ్చారు కేశినేని నాని. తూర్పు నియోజకవర్గం కనుక ఇంత క్లారిటీతో చెపుతున్నాను అన్నారు. ఇక, వైసీపీ అభ్యర్ధుల లిస్టులో ఎంపీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు కేశినేని నాని.. నన్ను టీడీపీ మెడపట్టుకుని అవమానకరంగా గెంటేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, నన్ను అక్కున చేర్చుకుని సీటిచ్చారు వైఎస్ జగన్ అని కొనియాడారు. లోకేష్ సీఎం అవ్వడమే చంద్రబాబు లక్ష్యం అని పేర్కొన్న ఆయన.. చంద్రబాబు విజయవాడని స్మశానం చేయాలని కంకణం కట్టుకున్నాడని.. విజయవాడను మరో ఓల్డ్ సిటీ చేయాలని చంద్రబాబు ఆలోచన.. విజయవాడకు ఎయిర్ పోర్ట్ కూడా ఉండకూడదని చంద్రబాబు ఆలోచించారని సంచలన ఆరోపణలు చేశారు.
ఆ కోడి నాదే ఇచ్చేయండి.. అంత సీన్ లేదన్న ఆర్టీసీ అధికారులు
తెలంగాణలో పందెం కోడి కేసు హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగు రోజులుగా కోడి వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఇవాళ కోడి వేలం పాటకు ఆర్టీసీ అధికారులు టైం ఫిక్స్ చేశారు. అయితే కోడి విషయంలో ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కోడి నాదే అంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ అధికారులను కోరడంతో సంచలనంగా మారింది. ఆ కోడి నాదే సార్ నాకోడి నాకు ఇచ్చేయండి అంటూ తెలిపాడు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రకాశం జిల్లా రుద్రంగికి చెందిన మహేష్ అనే వ్యక్తి కోడి నాదే.. నాకు అప్పగించాలని ముందుకు వచ్చాడు. మహేష్ రుద్రంగిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కోడిని అప్పగించాలని మహేష్ కోరుతున్నాడు. అంతేకాకుండా అతను తన ఇంట్లో, పెరట్లో కోడి తిరుగుతున్న వీడియోలతో సహా పంపించడం గమనార్హం. ఈ కోడి నాదే అంటూ వీడియోలు, ఫోటోలు పంపించినా ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. నీదే అని గ్యారెంటీ ఏమిటి? కోడిని నీకు ఇచ్చేదే లేదని ఖరా ఖండిగా చెప్పేశారు. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇవాళ మధ్నాహ్నం వేలం వేస్తున్నామంటే నీకోడి అని గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. కోడిని ఇచ్చేదే లేదని స్పస్టం చేశారు.
ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం ఈ మేరకు రియాక్ట్ అయింది. కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అంగీకరించడంతో పాటు కేంద్రానికి నోటీసులిచ్చింది. కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, ఈ కొత్త చట్టంపై స్టే కోరిన కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తరఫు సీనియర్ లాయర్ వికాస్ సింగ్.. కేంద్రం తీసుకువచ్చిన చట్టం అధికార విభజనకు విరుద్దమన్నారు. ఈ చట్టంపై స్టే విధించాలని కోరారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే విధించలేదమని ధర్మాసనం తెలిపింది. పిటిషన్ కాపీని కేంద్ర సర్కార్ తరఫు న్యాయవాదికి అందజేయాలని ధర్మాసనం పేర్కొనింది. ఇక, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)లను ఎన్నుకునే అధికారం కలిగిన ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపై ప్రస్తుతం రాజకీయ వివాదం కొనసాగుతుంది. దీనిపై జయ ఠాకూర్‌తో సహా పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. ఎన్నికల సంఘానికి నియామకాలు చేయడానికి కేంద్ర సర్కార్ కు విస్తృత అధికారాలను కల్పించే కొత్త చట్టాన్ని క్యాన్సిల్ చేయాలని కోరుతూ న్యాయవాది గోపాల్ సింగ్ కూడా సుప్రీంకోర్టును కోరారు.
రామ మందిర ప్రారంభోత్సవం.. ప్రమిదలకు భారీగా పెరిగిన డిమాండ్
రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటారు. ఇందుకోసం ప్రజలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. దీపాలు, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు జనం తరలివస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా దీపాలకు డిమాండ్ పెరిగింది. దీపావళి కానప్పటికీ, దేశవ్యాప్తంగా దీపాలకు డిమాండ్ వేగంగా పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో దీపాలను మార్కెట్ కు అందించేందుకు చేతివృత్తుల వారికి కష్టతరంగా మారే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో మార్కెట్‌లో దీపాల ధర కూడా రెట్టింపు అయింది. చేతివృత్తిదారులకు వస్తున్న ఆర్డర్లు నెరవేర్చడం కష్టంగా మారుతోంది. మార్కెట్‌లో దీపాల కొరత తీవ్రంగా ఉంది. దీపావళి రోజున దీపాల తయారీకి ఆరు నెలల ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తారని దీపాలు తయారు చేసే కళాకారులు చెబుతున్నారు. ఈ సమయంలో దీపాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. గత నెల రోజుల నుంచి వాటికి ఆర్డర్లు రావడం ప్రారంభించాయి. అందుకే కష్టాలు వస్తున్నాయి. పైగా ఈ ఎండలు లేని వాతావరణం వారి సమస్యలను మరింత పెంచింది. సూర్యకాంతి లేకుండా దీపాలు ఆరవు. జనవరి 22 నాటి డిమాండ్‌ను నెరవేర్చడానికి కళాకారులు పగలు రాత్రి శ్రమిస్తున్నాడు.
భారత్- మాల్దీవుల మధ్య క్షీణిస్తున్న దౌత్య సంబంధాలు.. చైనానే కారణం..?
భారత్- మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య పాత స్నేహానికి తెర పడుతుంది. మహ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవుల్స్ ఆరు దశాబ్దాల వెనుకబడి పోయింది. 1965లో బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన మాల్దీవులకు స్వతంత్ర దేశ హోదాను ఇచ్చిన మొదటి దేశం భారతదేశం.. అయితే, 1980లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల.. చైనా 2011లో మాల్దీవులలో తన దౌత్య కేంద్రాన్ని ప్రారంభించింది. అయితే చైనా మాల్దీవులతో స్నేహం చేసిన వెంటనే.. మాల్దీవులు- భారతదేశం మధ్య సంబంధాలు క్షీణించడం స్టార్ట్ అయ్యాయి. ఇక, నవంబర్ 2013లో అబ్దుల్లా యమీన్ మాల్దీవుల కొత్త అధ్యక్షుడయ్యాడు. యమీన్ చైనా వైపు మొగ్గు చూపాడు. ఆయన ప్రభుత్వ హయాంలో చైనా దౌత్యం వర్ధిల్లింది. కానీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చైనా మాలెలో భారీగా డబ్బు ఖర్చు చేసి అభివృద్ధి పేరుతో మాల్దీవులపై భారీ అప్పులు చేసింది. దీంతో అంగోలా, జిబౌటి తర్వాత చైనాకు మాల్దీవులు మూడవ అతిపెద్ద రుణగ్రహీతగా మారింది. ఈ చిన్న ద్వీపం దేశం దాని జీడీపీలో దాదాపు 30 శాతానికి సమానమైన మొత్తంలో చైనాకు రుణపడి ఉంది. ఇక, ఆర్థికవేత్తగా పేరొందిన అధ్యక్షుడు యమీన్ నిర్ణయాల కారణంగా మాల్దీవుల్లో భారీ నిరసనలు మొదలయ్యాయి. చైనా స్ఫూర్తితో కూడిన విధానాన్ని తిరస్కరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. యమీన్ ప్రభుత్వం అందుకు నిరాకరించడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
నా వయసు 112ఏళ్లే… నాకు మొగుడు కావాలి.. కానీ నాదో కండీషన్..
ప్రస్తుతం మలేషియాకు చెందిన ఓ బామ్మ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ బామ్మ వయసు జస్ట్ 112 ఏళ్లు. ఆమె తన చివరి దశలో వెల్లడించిన కోరికను విన్న జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మహిళ తన పెళ్లి కోరికను వ్యక్తం చేయడం ద్వారా ప్రేమకు వయస్సు లేదని నిరూపించింది. అంతేకాదు ఓ అబ్బాయి ముందుకు వచ్చి ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని వృద్ధురాలు కండిషన్ కూడా పెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పెళ్లి జరిగితే ఈ మహిళకిది ఎనిమిదో పెళ్లి అవుతుంది. సితి హవా హుస్సిన్ అనే ఈ వృద్ధురాలు మలేషియాలోని కెలాంతన్‌లోని తుంపట్ నగరంలో నివాసి. ఆమె ఏడుసార్లు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వృద్ధురాలు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హవా హుస్సేన్‌కి పిల్లలు ఉన్నారు. ఈ వృద్ధ మహిళకు వారికీ పిల్లలు ఉన్నారు. మొత్తంగా ఆమెకు 19 మంది మనవళ్లు, 30 మంది మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న కుమారుడు అలీ వయస్సే 58 సంవత్సరాలు.
మిచెల్ సాంట్నర్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో న్యూజిలాండ్ స్టార్!
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం సాంట్నర్ బాగానే ఉన్నాడని, సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు న్యూజిలాండ్ బోర్డు తెలిపింది. సాంట్నర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, రెండో టీ20 జరిగే హామిల్టన్‌కు ఒంటరిగా వెళతాడు అని పేర్కొంది. కరోనా పాజిటివ్ కారణంగా పాకిస్తాన్‌తో ఈరోజు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే తొలి టీ20కి అతడు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ సాంట్నర్.. జట్టులో లేకపోవడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బే అని చెప్ప్పాలి. సాంట్నర్ 64 టీ20 ఇన్నింగ్స్‌లలో 16.94 సగటుతో 610 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. 93 మ్యాచ్‌లలో 105 వికెట్లు పడగొట్టి.. బంతితో నిలకడగా రాణిస్తున్నాడు. సాంట్నర్ స్థానంలో ఐష్ సోది ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరగనున్న రెండో టీ20కి కూడా సాంట్నర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
క్రికెట్ ఆడిన టెన్నిస్ స్టార్ జకోవిచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024కు ముందు టెన్నిస్ లెజెండ్, సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో గురువారం ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్‌లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా క్రికెట్ ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా జకోవిచ్ బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా స్మిత్, జాక్సన్ సైతం జకోతో టెన్నిస్ ఆడాడు. టెన్నిస్ కోర్టులోనే జాక్సన్ వార్న్ బౌలింగ్ చేయగా నొవాక్ జకోవిచ్ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. దాంతో జకో నిరాశచెండాడు. అయితే ఆ తర్వాత బంతిని టెన్నిస్ బ్యాట్‌తో ఆడి స్టాండ్‌లోకి పంపాడు. దాంతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఆపై స్టీవ్ స్మిత్‌తో సెర్బియన్ స్టార్ టెన్నిస్ ఆడాడు. స్మిత్ ఆటకు జకో ఫిదా అయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా జకో టెన్నిస్ బ్యాట్‌తో బంతిని స్టాండ్‌లోకి పంపడాన్ని ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
అనుకున్న డేట్ కే కల్కి ఆగమనం… కొత్త పోస్టర్ హాలీవుడ్ రేంజులో ఉంది
ది మచ్ అవైటెడ్ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. సస్పెన్స్ ని రివీల్ చేస్తూ… కౌంట్ డౌన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని వైజయంతి మూవీస్ ప్రకటించింది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో హాలీవుడ్ స్టైల్ డిజైన్ తో కల్కి 2898 ఏ డేట్ కి ఆడియన్స్ ముందుకి వస్తుందో చెప్పేసారు. నిజానికి కల్కి సంక్రాంతి నుంచి వాయిదా పడినప్పుడే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో సినీ అభిమానులకి ఒక క్లారిటీ ఉంది. దాన్ని నిజం చేస్తూనే కల్కి 2898AD సినిమా 2024 మే 9న రిలీజ్ అవుతుందంటూ అనౌన్స్మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక ఫ్యూచరిస్టిక్ పోస్టర్ లో ప్రభాస్ ని చూపిస్తూ, సూపర్ హీరో రేంజులో ప్రొజెక్ట్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ని డిజన్ చేసి… ఈ బ్రాండ్ న్యూ పోస్టర్ తో కల్కి రిలీజ్ డేట్ ని రివీల్ చేసిన విధానం ప్రభాస్ ఫాన్స్ ని ఖుషి చేస్తుంది. దీంతో కల్కి 2898 ఆన్ మే 9 అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ కి మే 9వ తేదికి దశాబ్దాల అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా తుఫానుకి కూడా ఎదురు నిలిచింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మోడరన్ క్లాసిక్ ‘మహానటి’ కూడా మే 9నే రిలీజ్ అయ్యింది. చివరగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో వైజయంతి మూవీ మే 9న హిట్ కొట్టింది. ఇప్పటివరకూ మే 9న వైజయంతి మూవీస్ నుంచి వచ్చి సినిమాలు నెవర్ బిఫోర్ హిట్స్ గా మారాయి. ఈ సెంటిమెంట్ ని బిలీవ్ చేస్తూ 2024 మే 9న కల్కిని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా… దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. కల్కి 2898AD ఇండియాస్ నెక్స్ట్ బిగ్ థింగ్ లా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ హైప్ ఉన్న కల్కి మూవీని రిలీజ్ టైమ్ కి వరల్డ్ వైడ్ బజ్ జనరేట్ చేయడం గ్యారెంటీ.
అక్కడున్నది మహేష్ బాబు… క్రిటిక్ ప్రూఫ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 13 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఘట్టమనేని అభిమానులకి పూనకాలు తెస్తుంది. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ బయటకి ఇంకా పూర్తిగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు లేకుంటే గుంటూరు కారం సినిమా ఈ పాటికి విపరీతమైన నెగటివ్ టాక్ సొంతం చేసుకునేదేమో అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేష్ వన్ మ్యాన్ షో చేసిన గుంటూరు కారం సినిమా కథనం విషయంలో గురూజీ కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే బాగుండేది అనే టాక్ వస్తుంది. హాఫ్ బేక్డ్ ప్రాడక్ట్ గా ఉంది గుంటూరు కారం అని సింపుల్ గా చెప్పేస్తున్నారు క్రిటిక్స్. మహేష్ సినిమాలకి ఈ మధ్య ఇలాంటి టాక్ సర్వసాధారణం అయిపొయింది. ఏ సినిమా వచ్చిన పాయింట్ బాగుంది కానీ హాఫ్ బేక్డ్ గా ఉంది, ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండు అనే మాట ఏళ్ల తరబడి వినిపిస్తూనే ఉంది కానీ టాక్ తో సంబంధం లేకుండా క్రిటిక్స్ ఇచ్చే రివ్యూస్ ని లెక్క చేయకుండా మహేష్ సినిమాలు కలెక్షన్స్ తెస్తున్నాయి. మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట లాంటి సినిమాలు యావరేజ్ రివ్యూస్ నే అందుకున్నాయి. ఈ సినిమాలకి డే 1 టాక్ చాలా బ్యాడ్ వచ్చింది. ఆ టాక్ ని దాటి ఈ సినిమాలు కలెక్షన్స్ ని తెచ్చాయి. సినిమాల టాక్ యావరేజ్ ఏమో కానీ కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా కాకుండా అదిరిపోయేలా వచ్చాయి. అందుకే మహేష్ బాబు సినిమాలు క్రిటిక్ ప్రూఫ్ అనే పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది కానీ కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా ఉండే అవకాశమే లేదు. ఓపెనింగ్స్ విషయంలో మహేష్ కొత్త బెంచ్ మార్క్స్ ని సెట్ చేయడం గ్యారెంటీ.