ఏలూరు జనసేన ఇంచార్జ్ అసంతృప్తి.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు
టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన తర్వాత.. రెండు పార్టీల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.. సీటు దక్కని నేతలు.. పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇంతకాలం టికెట్‌కోసం వేచిచూసిన నేతలు.. కన్నీరుమున్నీరవుతున్నారు.. ఇక, భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా? లేదా? అనే విషయాన్ని ఆలోచించుకుని కార్యాచరణ రూపొందించుకుంటామని ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. 2019 కంటే బలపడిన జనసేన పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడం, పవర్ షేరింగ్ లేకపోవడం వల్ల జన సైనికుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్‌ఫర్ అవుతాయా ? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు ఏలూరు జనసేన ఇంఛార్జ్ అప్పలనాయుడు.
గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. ఆగినట్టే ఆగి మళ్లీ ఎగసిన మంటలు..!
విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో మూడంతస్తుల భవనంలో చిన్నగా మొదలైన మంటలు.. క్రమంగా అలుముకొని భారీగా వ్యాపించాయి.. రెండో అంతస్థులో ఉన్న ఆకాష్ బైజుస్ విద్యాసంస్థలో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్ లు ఉండడం తో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా, ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. అయితే, ఓ దశలో మంటలు అదుపులోకి వచ్చినట్టే అనిపించినా.. మళ్లీ ఒక్కసారిగా ఎగసిపడుటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు అలుముకున్నాయి.. బిల్డింగ్ వెనుక భాగంలో నివాస ప్రాంతాలు ఉండటంతో భయబ్రాంతలకు గురవుతున్నారు ప్రజలు.. ఇక, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
అనర్హత వేటుపై స్పందించిన కోటంరెడ్డి.. సాధించింది ఏమీలేదు..!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 8 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై స్పందించిన వైసీపీ రెబల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అనర్హత వేటు వల్ల మాకు ఎలాంటి నష్టమూ లేదన్నారు.. అసలు ఈ ఎపిసోడ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. ఏడాది క్రితమే వైసీపీ మమ్మల్ని సస్పెండ్ చేసింది.. సస్పెండ్ చేసిన తర్వాత మాపై అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు.. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణ సరికాదని హితవుపలికారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.
కందుల దుర్గేష్ జనసేన పార్టీలో ఉండాల్సిన నేత కాదు.. జనసైనికుల పరిస్థితి బాధాకరం..!
ఎన్నికల టిక్కెట్లు కేటాయింపు విషయంలో జన సైనికుల పరిస్థితి బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. టీడీపీ-జనసేన ఉమ్మడి లిస్ట్ ప్రకటన తర్వాత టీడీపీ, జనసేన నేతలు కొన్ని ప్రాంతాల్లో చేస్తోన్న ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే కాగా.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్.. 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో అధికారంలోకి వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు.. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఒరగ బెట్టేది ఏమీ ఉండదని విమర్శలు గుప్పించారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆంధ్రప్రదేశ్ కు ది బెస్ట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కితాబిచ్చారు.. మరోవైపు.. జనసేన నేత కందుల దుర్గేష్‌కు సీటు దక్కకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కందుల దుర్గేష్ జనసేన పార్టీలో ఉండాల్సిన నేత కాదన్న ఆయన.. కందుల దుర్గేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీ అధిష్టానం ఆహ్వానిస్తుందనే అనుకుంటున్నానని అన్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కల్యాణ్ ఉన్నారని ఆరోపించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.
నెల్లూరులో పదికి పది స్థానాలు గెలుస్తాం.. క్లీన్‌స్వీప్ చేస్తాం..
నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుస్తాం.. క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఆయన.. వచ్చే నెల రెండో తేదీన చంద్రబాబు నెల్లూరు పర్యటనపై చర్చించారు.. ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన నారాయణ.. నెల్లూరులో పదికి పది స్థానాలు గెలుస్తాం.. క్లీన్ స్వీప్ చేస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతలే లేరన్న ఆయన.. వచ్చే నెల రెండో తేదీన జరిగే చంద్రబాబు టూర్‌లో.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరుతారని వెల్లడించారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చంద్రబాబు – పవన్ కల్యాణ్ చర్చించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారోననేది మాకు తెలియదన్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే చంద్రబాబు క్లారిటీ ఇస్తారని తెలిపారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ.
వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్.. మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక తాజాగా.. రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు నేటితో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు పథకానికి అర్హులుగా నిర్ణయించింది. మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపింది. గత మూడేళ్ల సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీంకి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారుల గుర్తింపు లభించనుంది. తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా పెట్టింది. మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్ల కేటాయించారు. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనున్నారు. నెల నెల సబ్సిడీ అమౌంట్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లకు ప్రభుత్వం నేరుగా ట్రాన్స్ఫర్ చేయనుంది. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం 500 రూపాయలు చెల్లించేలా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్ లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానుంది.
ఏ సమయమైనా సహకరిస్తాం.. ఫార్మా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి హామీ
ఎలాంటి సమయంలోనైనా సహకారాం అందించేందుకు సిద్దంగా ఉన్నామను హామీ ఇస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HICCలో ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు నేటి నుంచి ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో తొలిరోజు జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ తదితర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. ఈ కార్యక్రమానికి తెలంగాన సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కరోనా ఎన్నో ఇబ్బందులను సృష్టించిందని తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఉత్పత్తి అయిన కరోనా టీకాలు ప్రపంచ వ్యాప్తంగా సరాఫరా అయ్యాయన్నారు. ఫార్మా రంగానికి చెందిన ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యామని అన్నారు. ఎలాంటి సమయంలోనైనా సహకారాం అందించేందుకు సిద్దంగా ఉన్నామను హామీ ఇస్తున్నామని రేవంత్ అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పడుతున్న ఫార్మా రంగ ప్రతినీధులకు అభినందనలు తెలిపారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ ప్రపంచ వేదికగా ఉందన్నారు.
ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఫార్మావిలేజ్ లకు రూపకల్పన చేశామన్నారు.
6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్..
చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మోడీ సర్కార్ లేఖలు రాసినట్లు సమాచారం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) 2020, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కింద ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరని లేఖలో కేంద్రం వెల్లడించింది. 2024 – 25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, 3 నుంచి 8వ సంవత్సరాల వయసు మధ్యలో పిల్లలకు 3 ఏళ్ల ప్రి స్కూల్, 1, 2వ తరగతులు పూర్తయిను పిల్లలను నేర్చుకునేందుకు మంచి అవకాశాలుంటాయని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పేర్కొన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చించే వయసు పలు రాష్ట్రాల్లో పలు రకాలుగా ఉందని గతంలో లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం చెప్పుకొచ్చింది. నూతన విద్యావిధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత విషయం..
మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒక వ్యక్తి ఏం ధరించాలో నిర్దేశించకూడదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. అయితే, కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. గతంలో దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే, కర్ణాటకలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై ఓ విద్యార్థిని రాహుల్ గాంధీని ప్రశ్నించింది. మీరు ఒక వేళ ప్రధాన మంత్రి అయితే’ అంటూ ఆ వివాదంపై అభిప్రాయాన్ని కోరింది.. దానికి, ఒక మహిళ ఏం ధరించాలన్నది ఆమె వ్యక్తిగత విషయం.. అందుకు అనుమతించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.. మీరేం ధరించాలనేది పూర్తిగా అది మీ నిర్ణయం.. దానిని మరొకరు నిర్దేశించాలని నేను అనుకోను అని రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు.
భారతదేశంలో పెరిగిన యువ ఓటర్లు.. ఏఏ రాష్ట్రంలో ఎంతంటే..?
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారీ తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి అందిన లెక్కల ప్రకారం.. మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 21.5 కోట్ల మంది వ్యక్తులు కేవలం 29 ఏళ్లలోపు వారు మాత్రమే ఉన్నారు. యంగ్ ఓటర్లే భారతదేశంలో రాబోయే ఎన్నికలకు పునాదిగా నిలవనున్నారు. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో సీనియర్ సిటిజన్ ఓటర్లు ఉన్నారు.. అందులో 80 ఏళ్లు పైబడిన వారు దాదాపు 26 లక్షల మందికి పైగా ఉండగా.. 56,800 మంది 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఇక, 80 ఏళ్లలోపు 24.2 లక్షలు మంది ఉండగా అందులో ఉత్తరప్రదేశ్ లో 32,800 మందికి పైగా వందేళ్ల లోపు వృద్ధులు ఉన్నారు.. ఇక, బీహార్, రాజస్థాన్ రెండింటిలోనూ 20,000 మంది శతాధిక వృద్ధ ఓటర్లు ఉన్నారు. అలాగే, వికలాంగ ఓటర్ల విషయంలో ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో 12.2 లక్షల మంది వ్యక్తులతో తొలి స్థానంలో నిలిచింది.
పెద్ద కంపెనీలను వదిలి చిన్న ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు
డబ్బులు ఉండాలే గానీ ప్రస్తుతం మార్కెట్లో వివిధ పెట్టుబడి పెట్టేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు పెద్ద కంపెనీలను వదిలి స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. 2023 సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్‌కు గొప్ప సంవత్సరంగా నిరూపించబడింది. మ్యూచువల్ ఫండ్స్ కోణంలో చూస్తే, ఈ మాధ్యమం ద్వారా పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు భారీ లాభాలను ఆర్జించారు. కానీ ప్రజలు ఎందుకు పెద్ద కంపెనీలు లేదా పెద్ద క్యాప్‌లను వదిలి చిన్న కంపెనీలు లేదా ఫండ్స్‌లో డబ్బును పెట్టుబడి పెడుతున్నారో తెలుసుకుందాం. వాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ ప్రకారం.. స్మాల్‌క్యాప్ స్టాక్‌లు వాటి లార్జ్‌క్యాప్ కౌంటర్‌పార్ట్‌ల కంటే ఎక్కువ అస్థిరతను కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ విషయంలో దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండటం ముఖ్యం. మిడ్ క్యాప్-స్మాల్ క్యాప్ ఫండ్స్ 2023లో 40-45 శాతం రాబడిని ఇచ్చాయి. ఈ బలమైన పనితీరు తర్వాత డబ్బు వస్తున్న వేగం ఆందోళన కలిగిస్తుంది. స్మాల్‌క్యాప్ స్టాక్స్, ఫండ్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడంపై రెగ్యులేటర్ సెబీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అస్థిరత వస్తే, భారీ ఉపసంహరణలు సంభవించవచ్చు. మిడ్-స్మాల్ క్యాప్ స్టాక్‌లు ఎక్స్ఛేంజ్‌లో ఆరోగ్యకరమైన ట్రేడింగ్ వాల్యూమ్‌లను ఆస్వాదించవు. కోవిడ్ సమయంలో వారి ట్రేడింగ్ పరిమాణం బాగా పడిపోయింది.
టీమిండియా కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్?
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో వందో టెస్టు ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మార్చి 7 నుంచి ధర్శశాల వేదికగా ఆరంభం కానున్న చివరి టెస్టుతో యాష్ ఈ మైలురాయిని అందుకుంటాడు. భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ 200 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్షణ్, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, చటేశ్వర్ పుజారా లాంటి వారు 100కు పైగా టెస్టులు ఆడారు. ఐదో టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న నేపథ్యంలో వరుసగా క్రికెట్ ఆడుతున్న హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగో టెస్టుకు దూరమైన భారత వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. ఐదో టెస్టుకూ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ చివరి టెస్టుకు రోహిత్, బుమ్రా దూరమైతే.. ఆర్ అశ్విన్‌కు భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించే అవకాశం ఉంది. కెరీర్‌లో 100 టెస్టు ఆడనున్న ఆర్ అశ్విన్‌కు గౌరవార్థం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా 100 టెస్టు ఆడుతున్న అశ్విన్‌కు జట్టు పగ్గాలను అప్పజెప్పాలని కోరాడు. చూడాలి మరి ఏం జరుగుగుతుందో. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన అశ్విన్.. 507 వికెట్స్ పడగొట్టాడు. అంతేకాదు 3309 పరుగులు కూడా చేశాడు. యాష్ టెస్టుల్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు.
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై రూ.20 లక్షలు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు పెంచాలని బీసీసీఐ భావిస్తోందట. రెడ్ బాల్ క్రికెట్‌పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను టీమిండియా యువ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు ధిక్కరించిన సంగతి తెలిసిందే. వారి వ్యవహరంపై బీసీసీఐ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఏ ఆటగాడైనా క్యాలెండర్ ఈయర్‌లోని అన్ని టెస్ట్ సిరీస్‌లను ఆడితే.. అతనికి వార్షిక రిటైన్ కాంట్రాక్ట్‌తో పాటు అదనంగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్ ఫీజులు కూడే పెరిగే అవకాశం ఉంది. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఇది అదనపు ప్రోత్సాహకం అవుతుంది. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపుతారని భావిస్తున్నాము’ అని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో తెలిపారు. కొత్త రెమ్యునరేషన్ మోడల్ ఐపీఎల్ 2024 అనంతరం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
నా కాబోయే భర్త ‘VD’ అయ్యి ఉండాలి..
నేషనల్ క్రిష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి హీరో విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. ఇక వారిద్దరూ మాత్రం మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ ఎన్నోసార్లు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ జంటను సోషల్ మీడియా వదలడం లేదు. ముఖ్యం బాలీవుడ్ మీడియా వీరిద్దరూ పెళ్లి చేసుకొనేవరకు వదిలేలా లేదని తెలుస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో రష్మిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు, చిన్న చిన్న కోరికలను తీరుస్తూ ఉంటుంది. తాజాగా ఒక అభిమాని రష్మికకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని చెప్పుకురాగా.. దానికి రష్మిక అవును నిజం అలాగే ఉండాలి అని రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ” రష్మికమందన్న భర్తగా మారాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆమె నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా.. ఆమె భర్త ప్రత్యేకంగా ఉండాలి. ఆమె భర్త వీడిలా ఉండాలి. నా ఉద్దేశ్యం వెరీ డేరింగ్. ఆమెను ఎవరు రక్షించగలరు. మేము ఆమెను రాణి అని పిలుస్తాము.. అప్పుడు ఆమె భర్త కూడా రాజులా ఉండాలి” అంటూ రాసుకొచ్చాడు. దానికి రష్మిక.. ఇది నిజం అని చెప్పుకొచ్చింది. అంటే.. తనకు కాబోయే భర్త వెరీ డేరింగ్ గా ఉండాలి అని చెప్పుకొచ్చింది. ఇక VD అన్న పదాన్ని పట్టుకొని మరోసారి VD అంటే విజయ్ దేవరకొండ అని చెప్పుకొచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
మంగళవారం.. టీవీ లోనూ దుమ్మురేపింది
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో అదే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మంగళవారం. ఎన్నో అంచనాల మధ్య గతేడాది నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యి భారీ కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ థ్రిల్లర్‌గా అజయ్ భూపతి ఈ సినిమా కథను రాసుకున్నారు. ఈ మూవీలో ఓ సెక్సువల్ డిజార్డర్ పాయింట్‌ను టచ్ చేశారు. ఇక పాయల్ నటనకు మార్కులు గట్టిగానే పడ్డాయి. ఇక థియేటర్ లోనే కాదు ఓటిటీలో కూడా రచ్చ చేసింది. అక్కడ కూడా మంచి పోటీనిచ్చి రికార్డు సృష్టించింది. ఇక్కడితో ఆగకుండా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ లో కూడా మంగళవారం తన సత్తా చాటింది. ఇటీవల స్టార్‌మాలో ఈ మూవీ ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.మంగళవారం మూవీకి అర్బన్, రూరల్ కలిపి 8.3 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. స్టార్ హీరో లేని సినిమాకి రేటింగ్ రావడం రికార్డు అనే చెప్పాలి. సినిమా కథ మరియు పాత్రలు, అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అజయ్ భూపతి టేకింగ్ ఈ విజయానికి కారణమని చెప్పాలి. ఇక ఈ విజయంపై చిత్ర బృందం ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.
నాని నెక్స్ట్ సినిమాల లైనప్ మాములుగాలేదుగా.. లైన్లో అరడజను సినిమాలు..
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయిన స్టార్ హీరోగా అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సెకండ్ హీరోగా మారి ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్ లు కొట్టి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. మామూలు హీరో నుంచి 100 కోట్ల కలెక్షన్స్ అందుకొనే స్థాయికి నాని ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.. ఇటీవల నాని పుట్టినరోజు సందర్బంగా ఆయన నెక్స్ట్ సినిమాల నుంచి అప్డేట్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా టాలీవుడ్ లో నాని సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాని మొదటి నుంచి కూడా సినిమా సినిమాకి కథల్లో వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నాడు.. గత ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన దసరా లాంటి మాస్ సినిమాలో నటించిన నాని.. అదే ఏడాది హాయ్ నాన్నతో ఎమోషనల్ క్లాసిక్ హిట్ కొట్టాడు.. నాని చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఎవరితో ఏ సినిమా చేస్తున్నాడంటే.. సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమా రజినీకాంత్ భాష స్టయిల్లో ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని కూడా DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించడం విశేషం.. ఆ తర్వాత బలగం వేణు తో ఓ సినిమా చేయబోతున్నాడు..దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు నాని. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంకో సినిమా ఉంటుందని గతంలో ప్రకటించాడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని సినిమా ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. అలాగే ఓ తమిళ్ డైరెక్టర్ తో కూడా నాని సినిమా ఉండబోతుందని సమాచారం.. ఆ సినిమాలన్ని హిట్ అయితే తిరుగుండదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..