ఆ పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించడంలేదు..!
పవన్ కల్యాణ్ ఆశయం ఎవరికీ తెలియదు.. బీజేపీతో పొత్తు అంటారు.. టీడీపీతో కలిసి తిరుగుతారు.. పవన్ పెట్టిన పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించడంలేదని ఫైర్ అయ్యారు మంత్రి వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని తీవ్రంగా హింసించిన చంద్రబాబుతోనే ఇప్పుడు పవన్ కలిసి వెళ్తున్నారు.. చంద్రబాబు ఏనాడు రాష్ట్రంలో సంపద సృష్టించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సుబ్బారావు చెప్పారని గుర్తుచేశారు. ఇక, పవన్ కల్యాణ్ ఆశతో పార్టీ పెట్టారో.. ఆశయం కోసం పెట్టారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.. ఆశయాలతో వచ్చిన పార్టీలనే ప్రజలు నమ్ముతారని హితవుపలికారు. స్వాతంత్రం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ అత్యాశకు పోయి కుప్పకూలిపోయిందని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ.. మంచి ఆశయాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారని ఫైర్ అయిన ఆయన.. కాపు సామాజిక వర్గాన్ని ఆదుకోవాలనే ఆశయంతో చిరంజీవి పార్టీ ప్రారంభించారు.. రాజ్యసభ దక్కించుకోవాలని ఆశతో పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని దుయ్యబట్టారు. ఇక, తండ్రి ఆశయాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రారంభించారు.. ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్, తండ్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విస్తృతం చేసి చూపించారు సీఎం జగన్ అని ప్రశంసలు కురిపించారు.. రాష్ట్రంలో పేదరికం 16 శాతం నుండి నాలుగు శాతానికి తగ్గింది.. పవన్ పెట్టిన పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ప్రజలతో ప్రశ్నించుకునే స్థాయికి వెళ్లిపోయారంటూ సెటైర్లు వేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ.
శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే..! టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి.. ఫలితాలు ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.. వైనాట్ 175 అంటూ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది.. ఇక, టీడీపీ-జనసేన కూటమి ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తోంది.. అయితే, ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత, సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్.. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేశాను అన్నారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ సీట్లు రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక, ఈ ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ మంత్రి ఆర్కే రోజాదే అని ప్రకటించారు పృథ్వీ… అంతేకాదు.. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజా అక్రమాలపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు.. పవన్ కల్యాణ్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలపై ఘాటుగా స్పందించారు పృథ్వీ.. పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా? అని ఎద్దేవా చేశారు. నా దగ్గర బ్రౌన్ కలర్‌తో డైరీ ఉంది.. ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పిసినారి.. జేబులో నుండి పైసా తీయరు అని విమర్శించారు. ఇక, జనసేన పార్టీ వెంటనే మెగా ఫాన్స్ అని స్పష్టం చేశాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్..
15 నుండి 20 మందికి నో టికెట్స్.. స్పష్టం చేసిన చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. పలువురు సిట్టింగ్‌ల స్థానాలను మారుస్తూ వస్తుండగా.. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లిన వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారట.. వచ్చే ఎన్నికల్లో సీట్లు, మార్పులపై అభ్యర్థులకు క్లారిటీ ఇస్తోన్నారట.. ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని స్పష్టంగా చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి లాంటి కుటుంబాలకు ఒకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ సాగుతోంది.. పెడనలో జాగ్రత్తగా పని చేసుకోమని కాగిత కృష్ణ ప్రసాద్ కే చెప్పారట టీడీపీ అధినేత.. అవనిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతుండగా.. మొత్తం 175 స్థానాలనూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. బీజేపీ పొత్తు తెర పైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు.. ఈ లోగా అనధికారికంగా కొందరికి టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నారట టీడీపీ సుప్రీం చంద్రబాబు నాయుడు..
మాట ఇస్తే నిలబడే వ్యక్తి జగన్.. కుటుంబంలో అందరికీ మంచి చేసే వ్యక్తి..
మాట ఇస్తే నిలబడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్.. మీకు మంచి చేశాను అనుకుంటేనే ఓటు వేయండి అని చెబుతున్నారు.. ఇలా చెప్పగలిగిన దమ్మున్న లీడర్ ఒక్క జగన్ మాత్రమే అన్నారు. ఇక, చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు రెండు లక్షల కోట్లకు ఆస్తిపరుడిని చేశారని వ్యాఖ్యానించారు.. కానీ, ప్రజలు మాత్రం పేదవాళ్లుగా మిగిలిపోయారు. మీ సొమ్ము దోచుకుని మీ నెత్తిన చెయ్యిపెట్టాడు.. లేదంటే రాష్ట్రంలో మహిళలు మరింత ధనవంతులుగా ఉండేవాళ్లు అని పేర్కొన్నారు.. మరోవైపు.. 18 కేసుల్లో నిందితుడిగా చంద్రబాబు ఉన్నారని విమర్శలు గుప్పించారు. ఇక, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలా కుటుంబంలో అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి ఎక్కడాలేరని స్పష్టం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
అసెంబ్లీలో ఓటాన్ ఎకౌంట్.. రూ2.75 లక్షల కోట్లతో బడ్జెట్..!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుందని అన్నారు. అందరి కోసం మనందరం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరడం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలన్నారు. మాది ప్రజల ప్రభుత్వం..తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ.. విధివిధానాలు ఖరారు చేయబోతున్నాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అనంతరం రూ.2,75,891 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు.కాంగ్రెస్ ఆరు హామీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపు జరిగిందని చెబుతున్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతోందని, ఇది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులను కేటాయిస్తామని విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను చదువుతున్నారు.
మేడారం జాతరకు ఫ్రీ జర్నీ.. గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మేడారం జాతరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాణికుల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అదే సమయంలో మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, మేడారం జాతరకు టిఎస్‌ఆర్‌టిసి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతుందని సజ్జనార్ తెలిపారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. అలాగే మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని అన్నారు.
తెలంగాణలో ఫిబ్రవరి 15న సెలవు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి రాజధాని హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలోని అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ట్యాంక్ బండ్ పై సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరగా కోమటిరెడ్డి స్పందించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్‌లో జన్మించాడని బంజారాల విశ్వాసం. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు. జగదాంబకు అత్యంత ప్రియమైన భక్తురాలు. బ్రహ్మచారి అయిన సేవాలాల్ తన అద్వితీయ బోధనలతో విజయం సాధించాడు. దీంతో ఆయన వెంట చాలా మంది భక్తులు వచ్చారు. 18వ శతాబ్దంలో బంజారాలు, నిజాం, మైసూర్ పాలకుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్, ముస్లిం పాలకుల ప్రభావంతో పాటు బంజారాలు ఇతర సంప్రదాయాల్లోకి మారకుండా ఉండేందుకు సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. అలా బంజారాల ఆరాధ్యదైవం అయ్యాడు. లిపి లేని బంజర్ భాషకు సేవాలాల్ మహారాజా ఒక రూపాన్ని కూడా అందించారు. లక్షలాది బంజారాలు… స్థిర నివాసం లేకపోయినా, బంజారాలు తమ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, విలక్షణమైన వస్త్రాలు, ఆభరణాలతో తమ ప్రత్యేకతను నిలుపుకోవడం… సంత్ సేవాలాల్ కృషి ఫలితమే. ఈ కారణంగా, బంజర్లు అతనిని విగ్రహంగా భావిస్తారు.. ప్రతి సంవత్సరం అతని జయంతిని జరుపుకుంటారు.
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేటు పెరగనుందోచ్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ పై కొత్త వడ్డీ రేటును ఖరారు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వారి ఫీఎఫ్ డబ్బుపై 8.25 శాతం వడ్డీని పొందబోతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలో ఉంచిన డబ్బుపై అధిక రాబడిని పొందబోతున్నారు. ఇంతకుముందు పీఎఫ్ ఖాతాదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం, 2021-22లో 8.10 శాతం చొప్పున వడ్డీని పొందారు. అంటే 2023-24కి పీఎఫ్ ఖాతాదారులు అంతకు ముందు సంవత్సరం కంటే 0.10 శాతం ఎక్కువ వడ్డీని పొందబోతున్నారు. అయితే తాజాగా పీఎఫ్ వడ్డీ రేటును అధికారికంగా ప్రకటించలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాదారులు ఏ వడ్డీ రేటుతో పొందాలో ఈపీఎఫ్ఓసెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు నిర్ణయిస్తారు. ఈపీఎఫ్ఓ సీబీటీ ముఖ్యమైన సమావేశం ఈ రోజు జరుగుతోంది,. దీనిలో పీఎఫ్ పై వడ్డీకి సంబంధించి నిర్ణయం తీసుకోబడుతుంది. పీఎఫ్ పై వడ్డీ రేటు గురించి అధికారిక సమాచారం కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా తర్వాత ఇవ్వబడుతుంది.
చివరి మూడు టెస్టులకు భారత్ జట్టు ప్రకటన.. కోహ్లీ ఔట్, ఆకాష్ ఇన్!
ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ఉదయం ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన టెస్ట్ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండడని, విరాట్ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని బీసీసీఐ పేర్కొంది. గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయిన లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజాలు జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చింది. దేశవాళీ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్‌లను చివరి మూడు టెస్టులకు కూడా బీసీసీఐ కొనసాగించింది. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడిన ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో.. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది. బాలీవుడ్‌లో 80, 90వ దశకాల్లో మిథున్ చక్రవర్తి హవా కొనసాగింది. ‘అయాం ఏ డిస్కో డ్యాన్సర్’ అంటూ ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్, బెంగాలీ సినిమాల్లో హీరోగా చేశారు. 100కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన చివరిసారిగా బెంగాలీ చిత్రం ‘కాబూలీవాలా’లో నటించారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలోనూ నటుడిగా ఆయన తన సత్తా చాటారు. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో ‘గోపాల గోపాల’ చిత్రంలోనూ నటించారు.
రవితేజ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్స్.. యుద్ధకాండపై పెరిగిపోతున్న అంచనాలు!
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఈగల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించిన ఈగల్ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈగల్ చిత్రం ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈగల్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.11.90 కోట్లు వసూళ్లు చేసింది. మొదటి రోజు భారత దేశవ్యాప్తంగా రూ.6 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 37.48 శాతం ఆక్యుపెన్సీని, హిందీలో 7.46 ఆక్యుపెన్సీ శాతం నమోదు అయ్యింది. రవితేజ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ వీకెండ్ (శని, ఆది) రెండు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మాస్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఫైట్స్, క్లైమాక్స్ హైలెట్‌గా నిలిచాయి.