*ఇందిరా పార్క్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ధర్నా
పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేయడంతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించనున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు జరుగనున్నాయి. అలాగే పార్లమెంట్‌లో సెక్యూరిటీ లోపాలపై కూడా ఇండియా కూటమి నిరసన తెలిపింది. తాజాగా పార్లమెంట్ లో జరిగిన దాడి పైనా ప్రధాని, హోం మంత్రి స్పందించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది. అయితే, ఈ నిరసనకు దిగిన ఎంపీలు సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ ధర్నాకు ఇండియా కూటమి నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఈ ధర్నా కొనసాగనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న కార్యక్రమం.. కాబటటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నాడు సీఎం హోదాలో కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర సీఎం హోదాలో రేవంత్ ధర్నా చేస్తుండటం.. పొలిటికల్ గా ఆసక్తికరంగా మారుతోంది.
*తిరుమలకు క్యూ కడుతున్న వీఐపీలు.. టీటీడీపై పెరుగుతున్న ఒత్తిడి
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రింకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలకు మరో 12 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ రానున్నారు. ఐదు మంది టీటీడీ పాలక మండలి సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. రాత్రికి మరో 18 మంది సభ్యులు చేరుకోనున్నారు. వారే కాకుండా తిరుమలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. చాలా మంది వీఐపీలు తిరుమలకు వస్తుండటంతో వారికి వీఐపీ వసతి గదులు కేటాయించలేకు రిసెప్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వసతి గదుల కోసం టీటీడీపై ఒత్తిడిగా పెరుగుతున్నట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల వరకు క్యూలెన్ పెరిగిపోయింది. సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులకు అనుమతిని నిలిపివేశారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి దర్శనానికి నేటి అర్ధరాత్రి పట్టే అవకాశం ఉంది. రేపటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో టోకెన్ కలిగిన భక్తులకే ద్వారదర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది. మరోవైపు.. సర్వదర్శనం భక్తులుకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లు టీటీడీ కేటాయిస్తోంది.
*ఏపీలో ఎన్నికలకు కసరత్తు.. నేడు, రేపు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష
ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ జాబితా సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు, రేపు సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఈ సమీక్షకు హాజరుకానున్నారు. విజయవాడలోని నోవాటెల్‌లో నేడు, రేపు ఈ సమావేశం జరగనుంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చ జరపనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం.. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం చర్చించనుంది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార-ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.
*3 వేల మార్క్‌కు దగ్గరగా యాక్టివ్ కేసులు.. అప్రమత్రంగా ఉండాలని కేంద్రం సూచన
భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి. కేరళకు చెందిన ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరుకుంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. 10 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. కొవిడ్ -19 నుంచి ఇప్పటివరకు 4,44,70,887 మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు, 220.67 కోట్ల (220,67,79,081) డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు. JN.1 మొదటిసారిగా గుర్తించబడిన కేరళలో, గత 24 గంటల్లో మరో 265 కేసులు నమోదైన తర్వాత క్రియాశీల కేసులు 2,606కి పెరిగాయి. దేశవ్యాప్తంగా బుధవారం వరకు JN.1 వేరియంట్‌కు సంబంధించిన 21 కేసులు కనుగొనబడ్డాయి. గురువారం, భారతదేశంలో 594 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య అంతకుముందు రోజు 2,311 నుండి 2,669కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఆరుగురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, పంజాబ్‌కు చెందిన ఒకరు కరోనా కారణంగా మరణించారు.
*రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్!
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇండియా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఆయన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానం పంపింది. అనుకున్న ప్రకారం జరిగితే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జనవరి 26న భారత్‌కు రానున్నారు. ఇప్పటివరకు ఐదుగురు ఫ్రెంచ్ నేతలు రిపబ్లిక్ వేడుకలకు హాజరు కాగా.. మాక్రాన్ వస్తే ఈ వేడుకలకు హాజరైన ఆరో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా నిలవనున్నారు. ప్రధాని మోదీ జులైలో ఫ్రాన్స్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. పారిస్‌లో జరిగిన బాస్టిల్ డే (ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం) వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన తర్వాత ఈ పరిణామం జరిగింది. బాస్టిల్ డే 1789లో ఫ్రెంచ్ విప్లవం సమయంలో బాస్టిల్ జైలుపై దాడి చేసిన జ్ఞాపకార్థం. సెప్టెంబరులో మాక్రాన్ భారతదేశం నిర్వహించిన G20 సమ్మిట్ కోసం ఢిల్లీని సందర్శించి, ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. సమావేశం తరువాత ప్రధాని మోడీ మాక్రాన్‌తో.. భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాల పురోగతి కొత్త శిఖరాలను తాకేలా తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్-సిసి భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం భారతదేశం తన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని విదేశీ నాయకులను ఆహ్వానిస్తుంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022 రెండేళ్ల పాటు రిపబ్లిక్ డే ముఖ్య అతిథిని ఆహ్వానించలేదు. కేవలం ఈ రెండు సందర్భాల్లో మాత్రమే అతిథిని ఆహ్వానించలేదు.
*చార్లెస్ యూనివర్సిటీలో కాల్పులు.. 15 మంది మృతి
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జన్ పలాచ్ స్క్వేర్‌లోని చార్లెస్ యూనివర్సిటీలో చొరబడిన ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్ భవనంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో 15 మంది అక్కడిక్కడే మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుపెట్టారు. ఇక, ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే, యూనివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే వర్సిటీకి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కాగా, కాల్పుల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం లేదని చెక్ రిపబ్లిక్ ఇంటీరియర్ మినిస్టర్ విట్ రాకుసన్ వెల్లడించారు. పోలీసుల విచాణరకు సహకరించాలని స్థానికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
*లారీ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా టీ పంపిణీ!
హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఉచితంగా టీ అందించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి తుకుని సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేస్తామని, ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునేలా ట్రక్ టెర్మినల్స్ మరియు వేసైడ్ ఎమినిటీ సెంటర్‌లను ఏర్పాట్లు చేస్తున్నామని తుకుని సాహు పేర్కొన్నారు. గురువారం రవాణా శాఖ మంత్రి తుకుని సాహు విలేకరులతో మాట్లాడుతూ… ‘హైవేలపై తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని ఇప్పటికే జనచైతన్యం కల్పిస్తున్నాం. సరకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటుంటారు. ఆ సమయంలో రెప్పపాటుతో దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది’ అని తెలిపారు. ‘భారీ వాహనాల డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రక్ టెర్మినల్స్ మరియు వేసైడ్ ఎమినిటీ సెంటర్‌లను ఏర్పాట్లు చేస్తాం. 30 జిల్లాల్లో ట్రక్ టెర్మినళ్లు నిర్మిస్తాం. వాటిలో నిద్రించడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలుంటాయి. చాయ్, కాఫీలు అందుబాటులో ఉంటాయి. కొన్ని జిల్లాల్లో ట్రక్ టెర్మినల్స్ ఏర్పాటు చేశాం. మిగిలిన జిల్లాల కలెక్టర్లు టెర్మినల్స్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కోరాం’ అని మంత్రి తుకుని సాహు చెప్పారు. గత ఐదేళ్లలో (2018 నుండి 2022 వరకు) రాష్ట్రంలో మొత్తం 54,790 ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 25,934 మంది మరణించగా.. 51,873 మంది గాయపడ్డారు.
*తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. వారికి పండగే ఇక..
క్రిస్మస్, నూతన సంవత్సరానికి ముందు వ్యాపార వినియోగదారులకు గుడ్ న్యూ్స్.. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39.50 తగ్గించాయి. అయితే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. కానీ వ్యాపారవేత్తలు ఈ మినహాయింపు యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, కొత్త ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1757 నుంచి రూ.1796.50కి చేరింది. అదేవిధంగా ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1749 నుంచి రూ.1710కి తగ్గింది. కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1908 నుంచి రూ.1868.50కి తగ్గింది. చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1968 నుంచి రూ.1929కి తగ్గింది. ఇక, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గినప్పటికీ డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.903గా ఉంది. కోల్‌కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.929. దేశీయ గ్యాస్ ధర చెన్నైలో రూ.918.50 కాగా, ముంబైలో రూ.902.50గా ఉంది. చివరిసారిగా ఆగస్టు 30న దేశీయ సిలిండర్ ధరలను తగ్గించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 200 రూపాయల మేర డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. కమర్షియల్ సిలిండర్ల ధరల్లో ప్రతి రోజూ నిరంతర మార్పులు కనిపిస్తున్నాయి.
*బొగ్గు గనిలో పెను ప్రమాదం.. 12 మంది మృతి!
భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఆ దేశంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన పెను ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలోని ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం… హెంగ్షాన్ జిల్లా జిక్సీ నగరంలోని కున్యువాన్ బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో సంభవించిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంకు కారణం ఇంకా తెలియరాలేదు. చైనా బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమే. గత కొన్ని సంవత్సరాలుగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. చైనా అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి దేశం మాత్రమే కాదు.. అతి పెద్ద వినియోగ దేశం కూడా. ప్రకృతి వైపరీత్యాలు డ్రాగన్ కంట్రీ చైనాను తరచుగా అతలాకుతలం చేస్తున్నాయి. ముందుగా కరోనా వైరస్ మహమ్మారి చైనాను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఆ తర్వాత కరువు, వరదలు, భూకంపంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వివిధ ప్రమాదాలు ప్రజల మరణాలకు కారణం అవుతున్నాయి.
*సీజ్ ఫైర్ అయిపొయింది… ఇక “శౌర్యాంగ పర్వం”
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి చేసిన సినిమా సలార్. ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సీజ్ ఫైర్ కోసం సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ ని ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ని ఇప్పటివరకూ ఏ దర్శకుడు ఈ రేంజులో ప్రెజెంట్ చేయలేదు. ఇది పూర్తిగా ప్రభాస్ వన్ మ్యాన్ షో చేసిన సినిమా. ఈ సినిమాతో ప్రభాస్ తాను ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అని ప్రూవ్ చేసాడు. ప్రభాస్ కనపడితే చాలు ఫ్యాన్స్ చేత థియేటర్స్ టాప్ లేచిపోయే రేంజులో అరిపించాడు ప్రశాంత్ నీల్. సలార్ సీజ్ ఫైర్ ఎండింగ్ మిస్ అవ్వకండి అని చెప్పిన ప్రశాంత్ నీల్… అందుకు తగ్గట్లుగానే క్లైమాక్స్ కంప్లీట్ అయ్యాకా, ఎండ్ క్రెడిట్స్ పడే ముందు అదిరిపోయే సీక్వెన్స్ ని పెట్టాడు. ప్రభాస్ తో చొక్కా విప్పించి అభిమానుల చొక్కాలు చింపుకునేలా చేసిన ప్రశాంత్ నీల్… సలార్ పార్ట్ 2 టైటిల్ “శౌర్యాంగ పర్వం” అని రివీల్ చేసాడు. ప్రభాస్-పృథ్వీల మధ్య ఉన్న స్నేహం వైరంగా ఎలా మారింది అనే పాయింట్ తో పాటు ప్రభాస్ ప్లే చేసిన దేవరథ క్యారెక్టర్ కి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చి… ఆ ట్విస్ట్ తో శౌర్యాంగ పర్వం సినిమాని రన్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రశాంత్ నీల్ చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా వస్తే మాత్రం బాహుబలి 2 రికార్డులు కూడా చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.