రౌడీ మూకలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్.
బరితెగిస్తే జైలుకే అంటూ రౌడీమూకలకు సీరియన్ వార్నింగ్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్.. బ్లేడ్ బ్యాచ్ పై ఉక్కు పాదం మోపుతాం అన్నారు.. రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు జిల్లా ఎస్పీ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బరితెగిస్తే జైలుకు పంపుతాం అంటూ హెచ్చరించారు. ఇక, రౌడీషీటర్లు, అల్లరి మూకలు, అలవాటుపడిన నేరస్తుల గుండెల్లో దడలు పుట్టిస్తోంది జిల్లా పోలీసు యంత్రాంగం. కయ్యానికి కాలు దువ్వినా, సెటిల్మెంట్లకు రంగంలోకి దిగినా, చట్ట వ్యతిరేకమైన నేరాలలో తరుచూ పాల్గొన్నా.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్. ప్రజా శాంతికి భంగం కలిగిస్తూ, అయితే, చట్టాలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్నవారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ హడలెస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్.
ఘర్ వాపసీపై కాంగ్రెస్ ఫోకస్..!
తెలంగాణ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది.. అది ఆంధ్రప్రదేశ్‌లోనూ పనిచేస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో తెలంగాణపై ప్రభావం చూపినట్టే.. తెలంగాణలో విజయం కూడా ఏపీపై పనిచేస్తుంది అంటున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతల మధ్య చర్చ సాగింది.. ఘర్ వాపసీ పిలుపివ్వాలని భావిస్తు్న్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. వైసీపీలో బలమున్న ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళ్లాలని చర్చించారు. చేరికల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని అభిప్రాయపడ్డారట నేతలు.. వీలైనంత మేర ఓట్ల శాతం పెంచుకునేలా కసరత్తు చేయనున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం సునీల్ కనుగోలు సేవలు తీసుకునేలా ఏఐసీసీని కోరనున్నారట.. ఆంధ్రప్రదేశ్‌లో ‘జగన్ పోవాలి.. హస్తం రావాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. ఇక, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అమరావతి, విశాఖపట్నంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాధీలతో భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.. మొత్తం ఆరు బహిరంగ సభలకు పార్టీ అగ్ర నేతలను రప్పించాలనే భావనలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు నేతలు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో.. 85,350 మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం..!
ప్రభుత్వ నిర్ణయాల వల్ల 85,350 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందంటూ ఫైర్ అయ్యారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఎస్ఈ విద్యార్థుల భవితవ్యంపై నాదెండ్ల సీరియస్ కామెంట్లు చేశారు.. ప్రభుత్వ తప్పిదాల వల్ల 85 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారని మండిపడ్డారు.. సీబీఎస్ఈ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిమిత్తం ప్రభుత్వం కట్టాల్సిన ఎగ్జామినేషన్ ఫీజు ఇప్పటి వరకు కట్టలేదన్న ఆయన.. ఈ మొత్తం సుమారుగా రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. ఈ 85 వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాయలేకపోతే.. వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మారుస్తున్నామంటూ వారిని జీవితాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. అయితే, ఈ పాపంలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్పేం లేదు.. కానీ, జగన్ మామ చేసిన పాపం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్‌లో ఉన్నారు..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. విజయవాడలో జరుగుతోన్న కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పొలిటికల్ వేక్యూమ్ ఉందన్నారు. 2014 నుంచి రెండు ప్రభుత్వాలు ఏపీ హక్కులు, విభజన హామీల కోసం పని చేయలేదన్న ఆయన.. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి… ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా స్ధానం ఉందన్నారు. ఇప్పటికే, పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడంతో ఏపీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నాం అన్నారు. ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై స్ట్రాటజీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది.. మేనిఫెస్టో, ఏపీసీసీ ఆశించే అంశాలు, ఏపీకి ఏం చేయాలనే అంశాలు స్ట్రాటజీ సమావేశంలో నిర్ణయిస్తారు.. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్ట్రాటజీ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.
రేపు ఆసుపత్రి నుండి కేసీఆర్ డిశ్చార్జ్.. నంది నగర్ ఇంటికి మాజీ సీఎం
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నంది నగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. సుమారు 6 రోజులుగా యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఆసుపత్రి వర్గాలు ఇంటికి వెల్లడానికి పరిమిషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేపు కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్.. స్వయంగా ఛైర్ లో కూర్చోబెట్టిన సీఎం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. గురువారం శాసనసభ ప్రారంభమైన అనంతరం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌గా నియమితులైన గడ్డం ప్రసాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రొటెం స్పీకర్ ప్రసాద్‌తో ప్రమాణం చేయించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనే స్వయం వెళ్లి గడ్డం ప్రసాద్ ను స్పీకర్ ఛైర్ లో కూర్చోబెట్టారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం సహా ఇతర సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ మంచి సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు.
మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ ఇవ్వకూడదు : స్మృతి ఇరానీ
మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ అంటే బహిష్టు సమయంలో సెలవులు తీసుకోవాలా వద్దా అని గురువారం పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగారు. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించి ఈ ఆలోచనను తిరస్కరించారు. అలాంటి వేతనంతో కూడిన సెలవుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. బహిష్టు మహిళల జీవితంలో ఓ భాగమని, దీన్ని వైకల్యంగా చూడకూడదని ఇరానీ అన్నారు. రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా పార్లమెంట్‌లో పెయిడ్ పీరియడ్ లీవ్‌కు సంబంధించి ఈ ప్రశ్న అడిగారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే.. మహిళల పట్ల వివక్ష చూపినట్లు అవుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు. అయితే, స్మృతి ఇరానీ ఋతుస్రావం గురించి పరిశుభ్రత.. చర్చ ప్రాముఖ్యతను అంగీకరించారు. జాతీయ స్థాయిలో రూపొందించిన ముసాయిదాను కూడా ఆయన ప్రస్తావించారు. చాలా మంది వాటాదారులతో మాట్లాడి ఈ ముసాయిదాను రూపొందించినట్లు ఇరానీ తెలిపారు. దేశవ్యాప్తంగా రుతుక్రమం గురించి అవగాహన కల్పించడం… పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులకు ప్రాప్యతను పెంచడం దీని లక్ష్యం.
ప్రధాని పరామర్శ తర్వాతే.. ఒకరితో మరొకరం మాట్లాడుకున్నాం!
సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంతో యావత్ భారతావని నిరుత్సాహానికి గురైన సంగతి తెలిసిందే. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి తుది మెట్టుపై బోల్తా పడడంతో భారత్ ఫాన్స్ సహా ఆటగాళ్లు కూడా ఏడ్చేశారు. మైదానంలోనే ప్లేయర్స్ ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. ఓటమి బాధలో డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లాక కూడా భారత ప్లేయర్స్ ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని తాజాగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి పరామర్శించి, ధైర్యం చెప్పారని షమీ చెప్పాడు. ప్రధాని మాటలు తమకు ఎంతో ప్రేరణగా నిలిచాయని మహమ్మద్ షమీ వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ.. ఫైనల్ నాటి క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘ఫైనల్ ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్‌లో అందరం అలా కూర్చుండిపోయాం. దాదాపు రెండు నెలల పాటు పడిన శ్రమ ఒక్క మ్యాచ్‌తో నిరుపయోగంగా మారింది. ఆ రోజు మాకు అస్సలు కలిసిరాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రావడంతో.. మేమంతా ఆశ్చర్యపోయాం. అసలు ప్రధాని మా వద్దకు వస్తారన్న సమాచారం మాకు లేదు. అందుకే ప్లేయర్స్ అందరూ ఆశ్చర్యపోయారు’ అని షమీ తెలిపాడు.
టెస్టులో టీ20 ఇన్నింగ్స్.. డేవిడ్ వార్నర్ సెంచరీ!
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడేస్తుంటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలు, సిక్సులు బాదుతూ.. బౌలర్లపై ఒత్తిడి తెస్తాడు. టెస్ట్ మ్యాచ్ అయినా సరే ఒక్కోసారి టీ20 ఇన్నింగ్స్ ఆడేస్తాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొదటి సెషన్ మొత్తం వార్నర్ దూకుడుగా ఆడాడు. 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే లంచ్ అనంతరం డేవిడ్ వార్నర్ దూకుడు తగ్గించాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తున్నాడు. రెండో సెషన్‌లో ఎక్కువగా సింగిల్స్ తీస్తున్నాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. పాక్ అరంగేట్ర పేసర్ ఆమిర్ జమాల్ వేసిన 43వ ఓవర్ ఐదవ బంతికి ఫోర్ బాది మూడంకెల స్కోర్ అందుకున్నాడు. టెస్టులో అతడికి ఇది 26వ శతకం. డేవిడ్ వార్నర్ కొట్టిన సిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. షాహిన్ ఆఫ్రిది వేసిన బంతిని వార్నర్ వెనకాలకు కొట్టి కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా 48 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్ (109), స్టీవ్ స్మిత్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా (41), మార్నస్ లాబుషేన్ (16) రన్స్ చేశారు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉంది. 1995లో కంగారూ గడ్డపై చివరిసారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్.. ఇంతవరకు కూడా సిరీస్ గెలవలేదు.
శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. లీకైన ఫీచర్స్, ధర?
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో గేలాక్సీ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయబోతుంది.. ఈ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వక ముందే ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఇక్కడ గేలాక్సి A15 4G డిజైన్, రంగు ఎంపికలు, కొన్ని స్పెషిఫికేషన్లు వెల్లడయ్యాయి. గేలాక్సి A15 4Gలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ కొత్త మొబైల్స్ గతంలో వచ్చిన A14 ను పోలి ఉన్నట్లు తెలుస్తుంది.. మూడు వెనుక కెమెరాలు, LED ఫ్లాగ్ వెనుక భాగంలో కనిపిస్తాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది. లీకైన ఫోటోలో, ఫోన్ మూడు రంగులలో (నలుపు, తెలుపు మరియు పసుపు) చూడవచ్చు.. ఇక ఈ ఫోన్ లోపల మీడియా టెక్ హీలియో G99 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఫోన్ ర్యామ్ , స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రావొచ్చు. ఇందులో ఒక ఎంపిక 4 జిబి,128 జిబీ స్టోరేజ్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే గురించి మాట్లాడితే, దాని పరిమాణం 6.5-అంగుళాలు కావొచ్చు. కానీ రిజల్యూషన్ ఇంకా ఇవ్వలేదు..
ఇండియన్ సినిమాని చూడబోతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్
కార్తీక్ సుబ్బరాజ్… కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. సినిమాని విజువల్ ఎక్స్పీరియన్స్ మార్చడంలో దిట్ట. సిల్లౌట్ షాట్స్, రెడ్ అండ్ బ్లాక్స్ ఎక్కువగా వాడుతూ ఇంటెన్సిటీని పెంచే ఏకైక తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, జిగర్తాండ, పేట సినిమాలతో కార్తీక్ సుబ్బరాజ్ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగానే పరిచయం అయ్యాడు. ఇతని మేకింగ్ లో ట్రూ ఎసెన్స్ ఆఫ్ సినిమా ఉంటుంది అందుకే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు చూడడానికి ప్యూర్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. టెక్నికల్లి బ్రిలియంట్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, ఈ విషయంలో లాస్ట్ సీన్ వరకు కథ చెప్తూనే ఉండే కార్తీక్ సుబ్బరాజ్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఇటీవలే ఈ జీనియస్ నుంచి జిగర్తాండ డబుల్ X సినిమా రిలీజ్ అయ్యింది. లారెన్స్, ఎస్ జే సూర్య హీరోలుగా నటించిన ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఒక గొప్ప సినిమా అంటూ క్రిటిక్స్ నుంచి కూడా కాంప్లిమెంట్స్ అందుకుంది జిగర్తాండ డబుల్ X. కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, లీడ్ యాక్టర్స్ టెర్రఫిక్ పెర్ఫార్మెన్స్, సంతోష్ నారాయణ్ మ్యూజిక్, తిరు సినిమాటోగ్రఫీ జిగర్తాండ డబుల్ X సినిమాని అవుట్ స్టాండింగ్ గా నిలబెట్టాయి.
‘కలశ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. మీడియాపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ‘కలశ’ డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రానుంది. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించగా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ‘‘ఓ చిట్టీ తల్లి’’ సాంగ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నటులు మురళీ మోహన్ ఆవిష్కరించగా కలశ టైటిల్సాంగ్ ను దర్శకులు వీర శంకర్ విడుదల చేశారు. ఈ క్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ దర్శకుడు రాంబాబు దర్శకత్వంలో నేను కొన్ని సీరియల్స్ చేశా, మంచి పర్‌ఫెక్షనిస్ట్. దాసరి నారాయణరావు అసిస్టెంట్ డైరెక్టర్‌లకు సీన్‌లకు సంబంధించిన వివరాలు డైలాగ్‌లు చెపుతుంటే టేపు రికార్డర్‌లో రికార్డు చేసుకునేవారు, ఆ తర్వాత వాటిని నీట్ చేసి రాసుకొస్తే.. చిత్రీకరణ సమయంలో వాటిలో కొన్ని డైలాగ్‌లు కొట్టేసేవారు. ఎందుకంటే అవి ఈ సీన్‌కు అంత అవసరం లేదు అనేవారు, అలాగే ఈ రాంబాబు కూడా మంచి రచయిత, ఏది కావాలో అదే తీస్తాడు. తద్వారా నిర్మాతకు లాభం అని అన్నారు. ఈ సినిమా గురించి విన్నాను. మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్, థ్రిల్లర్ అంటే రాతకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తీత అంటే కెమెరా వర్క్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది, అలాగే సంగీతానికి కూడా. వీటి విషయంలో దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. నిర్మాత రాజేశ్వరి గారు ఈ చిత్రం పట్ల చూపించిన శ్రద్ధ ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. నేను ఓ చిన్న సినిమాకు సంబంధించి బెంగుళూరులో ప్రెస్‌మీట్‌కు అటెండ్ అయ్యా, అక్కడ కేవలం రెండో, మూడో కెమెరాలు, ఓ నలుగురు జర్నలిస్ట్‌లు మాత్రమే హాజరయ్యారు. వారు కూడా కాలుమీద కాలు వేసుకుని మనం చెప్పేది రాసుకోవడం కూడా లేదు. కానీ మన తెలుగు సినీ మీడియా అలా కాదు. సినిమా చిన్నదైనా.. పెద్దదైనా దానికి మంచి ప్రమోషన్ ఇస్తారు. అందుకు ఉదాహరణగా ఇక్కడున్న ఇన్ని కెమెరాలను, ఇంతమంది జర్నలిస్ట్‌లను చూస్తుంటే తెలుస్తుంది, తెలుగు సినీ మీడియాకు నా ధన్యవాదాలన్నారు.