అత్యుత్తమ నగరంగా హైదరాబాద్.. దేశంలోనే అగ్రస్థానం
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ “భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం”గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్ టాప్ స్పాట్‌లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్‌తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్‌తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్‌తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్‌తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్‌తో కోల్‌కతా ఆరో స్థానం, 172 ర్యాంక్‌తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.. 2023 సూచిక ప్రకారం వియన్నా (ఆస్ట్రియా), జూరిచ్ (స్విట్జర్లాండ్) మరియు వాంకోవర్ (కెనడా) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సూచిక విదేశాలలో పనిచేసే ఉద్యోగుల జీవన నాణ్యతను అంచనా వేస్తుంది, ముఖ్యంగా కుటుంబాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల నుండి డేటాపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, పాఠశాలలు మరియు విద్య, వ్యాధి మరియు పారిశుద్ధ్య ప్రమాణాలు, హింస మరియు నేరాలు, భౌతిక దూరం మరియు కమ్యూనికేషన్‌ల సౌలభ్యం, సామాజిక-రాజకీయ వాతావరణం వంటి అంశాలపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది.
రేపు పలాసకు సీఎం జగన్.. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. గురువారం రోజు పలాస పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, పలాస పర్యటన కోసం గురువారం ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.. ముందుగా కంచిలి మండలం మకరాంపురంలో డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.. ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఆ బహిరంగ సభతో సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగియనుండగా.. సాయంత్రం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున.. ఏమన్నారంటే..?
తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎమ్మేల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు.. అందరూ మా వాళ్లే.. అందరూ సీఎం వైఎస్ జగన్ కోసం పనిచేస్తారని ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున. కాగా, తొలి దశలో 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.. వేమూరు సిట్టింగ్‌ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. గ్రూపు తగాదాలున్న కొండేపి విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించారు. కొండెపి ఇన్‌చార్జ్‌గా ఉన్న వరికుటి అశోక్ బాబును.. పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు హెచ్చరించడంతో.. వరికూటి అశోక్‌బాబుకు వేమూరు బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్.
జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారు.. జనసేన ఘాటు వ్యాఖ్యలు
సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గత నెల నవంబర్‌మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారు. దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మేం కట్టలేమని అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. 2600 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పేస్తామని అనిల్ అంబానీ సంస్థ చెప్పేసింది. కానీ, సడెన్‌గా అదే అనిల్ అంబానీ సంస్థకు ఆ భూములని కట్టబెట్టారు. ఏం క్విడ్ ప్రో కో జరిగిందని ఈ భూములను తిరిగి అనిల్ అంబానీకి కట్టబెట్టారు..? అని ప్రశ్నించారు. ఇక, నియోజన్ ప్రాపర్టీ సంస్థ అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తామంటే సుమారు 300 ఎకరాల్లో వైఎస్ భూములు కేటాయించారు అని గుర్తుచేశారు నాదెండ్ల.. ఈ భూములు తిరిగి ఇచ్చేయమని వైఎస్ జగన్ వెంటపడ్డారు.. వాళ్లు కోర్టుకెళ్లారు. అపెరల్ పార్క్‌గా కాకుండా ఇతర జనరల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం కేటాయించాలని అదే సంస్థ కోరింది. అపెరల్ పార్క్ అయితే చాలా మంది మహిళలకు ఉపాధి లభించేది. జనరల్ ఇంజనీరింగ్ అనే పేరుతో భూములు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో మార్గంలో మెట్రో ప్రాజెక్టు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడు పెంచారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఓఆర్‌ఆర్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరం చుట్టూ మెట్రోను విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రూ.69 వేల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు గత ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. పటాన్ చెరు నుంచి నార్సింగి వరకు 22 కిలోమీటర్లు, తుక్కుగూడ, బెంగళూరు, పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్ల మేర నిర్మిస్తామని పేర్కొన్నారు. మెట్రో కారిడార్‌ను తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు, మేడ్చల్ నుంచి పటాన్చెరు వరకు 29 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి పెద్దార్ అంబర్‌పేట వరకు పొడిగించాలని నిర్ణయించారు. అలాగే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ప్రాజెక్టు టెండర్ల దశలో ఉంది. అయితే తాజాగా మెట్రో విస్తరణ పనులకు సీఎం రేవంత్ బ్రేకులు వేయనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ యాదవ్
నేటి నుంచి మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ వేడుక భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కొద్ది రోజులుగా తలెత్తిన ఊహాగానాలకు ముగింపు పలికి, బిజెపి సోమవారం మోహన్ యాదవ్‌ను రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. పార్టీ అనుభవజ్ఞుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదవసారి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడం ద్వారా రికార్డు సృష్టించలేకపోయారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మోహన్ యాదవ్ సోమవారం జరిగిన సమావేశంలో బిజెపి శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లో రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా ఉప ముఖ్యమంత్రులు. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో బిజెపి సీనియర్ నాయకుడు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ తోమర్ కొత్త అసెంబ్లీ స్పీకర్‌గా మారనున్నారు. మోహన్ యాదవ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు సన్నిహితుడు. అతను ఇతర వెనుకబడిన తరగతి (OBC) కమ్యూనిటీకి చెందినవాడు. ఓబీసీ కమ్యూనిటీ రాష్ట్ర జనాభాలో 48 శాతానికి పైగా ఉంది. సోమవారం ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మోహన్ యాదవ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్‌ను కలిశారు. మోహన్ యాదవ్ 2013లో తొలిసారి ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో మళ్లీ 2023లో అసెంబ్లీ సీటును నిలబెట్టుకున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 163 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి 66 సీట్లతో కాంగ్రెస్‌ను రెండో స్థానానికి నెట్టింది.
డిసెంబర్ 25 న ప్రారంభం కానున్న అయోధ్య శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. జనవరి 2024లో ప్రతిపాదించబడిన శ్రీరామ దేవాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు అయోధ్యలో విమాన ట్రాఫిక్ సేవలు ప్రారంభమవుతాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి వీకే సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న అయోధ్య విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలించారు. శ్రీరాం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని కోరారు. విమానాశ్రయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబరు 2023 నాటికి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి విమానాల నిర్వహణను ప్రారంభిస్తారు. విమానాశ్రయం పనులన్నీ మూడు దశల్లో జరగాలి. ఇందుకోసం ప్రాజెక్టులో ఉన్న మొత్తం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించారు. విమానాశ్రయం మొదటి దశలో 2200 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే పనులు 100 శాతం పూర్తయ్యాయి. భవిష్యత్తులో రన్‌వేను 3750 మీటర్లకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం భూమిని కూడా సేకరించారు.
పీరియడ్స్ సమయంలో మహిళలు వీటి జోలికి అస్సలు వెళ్లకండి..!
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం కామన్.. ఆ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.. నీరసంగా, బాడి పెయిన్స్, అలా వాంతులు అవ్వడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.. అయితే ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొన్ని ఆహారాలను అసలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం.. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. కొవ్వు ఉండే పదార్థాలు తింటే పొత్తి కడుపులో నొప్పి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. స్త్రీ జననేంద్రియాలలో కూడా సమస్యలు వస్తాయి. చక్కర ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినకూడదు. వాటిని తినడం వలన మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీనివల్ల మనకు స్వీట్ గా ఉండే పదార్థాలను తినాలని అనిపిస్తుంది. ఇలా చేయడం వలన మనకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.. అందుకే తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.. పీరియడ్స్ సమయంలో కొంతమంది నొప్పుల కోసం లేదా కావాలనే ఆల్కహాల్ ను సేవిస్తారు.. ఇది చాలా తప్పు.. ఎందుకంటే కొన్ని రకాల హార్మోనలను విడుదల చేస్తాయి.. అది చాలా ప్రమాదం.. అసలు మందు తాగకూడదు.. ఇక పాలు తాగకూడదు ఎందుకంటే పాలల్లో ఉండే లాక్టోజ్, అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. అది మన పొట్ట ఉబ్బరాన్ని పెంచి పొట్టలో నొప్పి వచ్చేలా చేస్తుంది.. చూసారుగా అందుకే పెద్దలు పాలు, పెరుగు తినొద్దని చెబుతారు.. మొదటి మూడు రోజులు వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
వారికి శుభవార్త.. లిమిట్ పెంచిన ఆర్బీఐ..
మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది.. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచింది ఆర్బీఐ.. ఎన్పీసీఐ చెల్లింపుల కోసం యూపీఐ ఆటోపే సౌకర్యాన్ని అందించింది. ఈ కొత్త ఫీచర్‌తో, కస్టమర్‌లు ఇప్పుడు మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా, మ్యూచువల్ ఫండ్‌లు ఇలా మొదలైన నెలవారి చెల్లింపుల కోసం ఏదైనా యూపీఐ అప్లికేషన్‌ని ఉపయోగించి చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.
విరాట్ కోహ్లీ వెజిటేరియన్ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి?
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ‘వెజిటేరియన్’ అన్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే విరాట్.. దాని కోసమే గతంలో వెజిటేరియన్‌గా మారాడు. వెన్నెముక సమస్య కూడా నాన్‌వెజ్ తినే కోహ్లీని వెజిటేరియన్‌గా మారేలా చేసింది. విదేశీ టూర్స్ వెళ్లినా కూడా కోహ్లీ ముక్క మాత్రం ముట్టుకోడు. అయితే తాజాగా ‘మాక్ చికెన్ టిక్కా’ తింటున్న ఫొటోను విరాట్ షేర్ చేయడంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేశాడు. ‘ఈ మాక్ చికెన్ టిక్కాను మీరు తప్పక ఇష్టపడతారు’ అంటూ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అభిమానులు తమ కామెంట్లకు పని చెప్పారు. కోహ్లీ వెజిటేరియన్ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి? అని కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఓ అభిమాని క్లారిటీ ఇచ్చాడు. ‘కొంతమందికి చికెన్ టిక్కాకు, మాక్ చికెన్ టిక్కాకు తేడా తెలియదు. మాక్ చికెన్ టిక్కా వెజిటేరియన్ ఫుడ్. ఇది ఓ మొక్క నుంచి తయారు చేసిన ఆహారం. అది తెలియని వారు కోహ్లీ నాన్‌వెజ్ తిన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు’ అని సమాధానం ఇచ్చాడు.
వాళ్లు అడిగారనే షూతో సంబరాలు చేసుకున్నా: తంబ్రిజ్ షంసి
గబేహా వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాదించింది. ప్రొటీస్ విజయంలో రిజా హెండ్రిక్స్ (49; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఐడెన్ మార్‌క్రమ్ (30; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు స్పిన్నర్ తంబ్రిజ్ షంసి కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన షంసి.. 18 పరుగులు ఇచ్చి కీలక సూర్యకుమార్ యాదవ్‌ను ఔట్ చేశాడు. దీంతో అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం షంసి మాట్లాడుతూ షూతో ఫోన్ చేస్తున్నట్లు సంబరాలు చేసుకోవడానికి గల కారణంను వెల్లడించాడు. ‘వికెట్ తీసినప్పుడల్లా షూతో ఫోన్ చేస్తున్నట్లు సంబరాలు చేసుకోవడానికి దూరంగా ఉండానుకున్నా. అయితే నా పిల్లలు మాత్రం షూతో సంబరాలు చేయాలని అడుగుతూనే ఉన్నారు. వారిని నిరుత్సాహపరచకూడదని ఈ మ్యాచ్‌లో షూతో ఫోన్ చేస్తున్నట్లు సంబరాలు చేశా. వారు చాలా ఆనందంగా ఉంటారు’ అని దక్షిణాఫ్రికా స్పిన్నర్ తంబ్రిజ్ షంసి తెలిపాడు. వికెట్ పడినప్పుడల్లా కాలి షూ తీసేసి సంబరాలు చేసుకోవడం షంసికి అలవాటు. ఇటీవల ఆ సంబరాలకు షంసి దూరంగా ఉండగా.. తన పిల్లల కోరిక మేరకు మళ్లీ చేశాడు.
ఆ హీరోతో ఫోటోషూట్? మరి అనౌన్స్మెంట్ ఎప్పుడు
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తర్వాత తెలుగులో హీరో క్యారెక్టరైజేషన్ పైన కథని, పవర్ ఫుల్ వన్ లైనర్ డైలాగ్స్ ని రాయగల ఏకైక దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేసాడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ సినారియోని దృష్టిలో పెట్టుకోని ఇప్పట్లో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లేలా కనిపించట్లేదు. దీంతో ట్రాక్ మార్చిన హరీష్ శంకర్… నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అయిపోయాడు. షాక్, మిరపకాయ్ సినిమాలతో ఇప్పటికే రవితేజతో రెండు సినిమాలు చేసిన హరీష్ శంకర్… హ్యాట్రిక్ సినిమా కోసం రవితేజతో చేతులు కలిపాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన హీరో లుక్ ఫోటోషూట్ చేసే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత మేకర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రానుంది. హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని మాస్ మహారాజ రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి హరీష్ శంకర్ కలిస్తే ఎలా ఉంటుందో మిరపకాయ్ సినిమాలో చూసేసారు కాకపోతే మిరపకాయ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ రైడ్ సినిమా సీరియస్ డ్రామా. ఒక ఇన్కమ్ టాక్స్ రైడ్ గురించి జరిగే కథలో హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ని ఎలా ప్లేస్ చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ సెటప్ అనే చెప్పాలి. అయితే రైడ్ కోర్ సబ్జెక్ట్ సీరియస్ టోన్ లో ఉంటుంది కాబట్టి… సీరియస్ ఎమోషన్ ని రవితేజతో హరీష్ శంకర్ ఎంత వరకూ ఫుల్ ఆఫ్ చేస్తాడు అనేది చూడాలి.
లోకీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
క్రైమ్ సెంట్రిక్ కథలతో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి… తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తలైవర్ 171 కథని సిద్ధం చేసే పనిలో ఉన్న లోకేష్ కనగరాజ్… కథని రాసే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని నెలల పాటు దూరంగా ఉంటాడు. తన ప్రతి సినిమాకి ఇదే రూల్ ఫాలో అయ్యే లోకేష్ కనగరాజ్, మొదటిసారి తన రూల్ ని బ్రేక్ చేసి సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యాల్సి వచ్చింది. లోకేష్ కనగరాజ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. కోలీవుడ్ మీడియా కూడా ఇదే మాటని స్ప్రెడ్ చెయ్యడంతో లోకేష్ బయటకి వచ్చాడు. ఈ విషయంలో లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇస్తూ “నేను X అండ్ ఇన్స్టాగ్రామ్ లో తప్ప ఇంక వేరే ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో అకౌంట్ లేదు కాబట్టి బయట వినిపిస్తున్న వార్తలని పట్టించుకోకండి” అంటూ ట్వీట్ చేసాడు. దీంతో లోకేష్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే లోకేష్ నుంచి డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజున తలైవర్ 171 ప్రాజెక్ట్ ని సంబందించిన అప్డేట్ బయటకి వస్తుందేమో అని ఈగర్ గా వెయిట్ చేసారు తలైవర్ ఫ్యాన్స్. అయితే లోకీ మాత్రం “హ్యాపీ బర్త్ డే టు అవర్ తలైవర్ రజినీకాంత్ సర్…” అంటూ విష్ చేస్తూ ట్వీట్ చేసాడు. లోకేష్ తన ట్వీట్ లో కనీసం తలైవర్ 171 ట్యాగ్ ని కూడా పెట్టక పోవడంతో ఒక వర్గం రజినీ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. మరి ఈ విషయంలో లోకేష్ కనగరాజ్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.