2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఆ ప్రాంతీయ పార్టీ కనుమరుగు..! అది ఏ పార్టీ..?
2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కూమార్ రెడ్డి రాకతో.. మాజీ ప్రజాప్రతినిధులందరూ బీజేపీకి టచ్‌లోకి వస్తున్నారని తెలిపారు. మరోవైపు.. విశాఖ ఉక్కు కేంద్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కేసీఆర్ ట్రాప్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు విష్ణువర్దన్‌రెడ్డి..
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది.. ఈ నెల 22న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు… షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్ భవనంలో పీఎస్‌ఎల్‌వీ మొదటి, రెండు దశలు రాకెట్ అనుసంధానం ఇప్పటికే పూర్తి చేశారు శాస్త్రవేత్తలు.. సింగపూర్ దేశానికి చెందిన టెలియోస్-2, లూమి లైట్-4 ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇది పూర్తి విదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన కమర్షియల్ ఉపగ్రహం.. సింగపూర్ దేశానికి భూ పరిశీలనకు ఉపయోగపడనున్నాయి ఈ ఉపగ్రహాలు.. ఇక, ప్రయోగానికి 25 గంటల 30 నిమిషాల ముందు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలు కానుంది..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐపై ఉత్కంఠ..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. సింగరేణి కాలరీస్ భాగస్వామ్యంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కార్మిక సంఘాలు.. EOIకి సిద్ధమేనని ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి లేఖ సమర్పించింది సింగరేణి.. అయితే, ఆన్ లైన్ విధానంలో బిడ్ దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది.. దీంతో, సింగరేణి కాలరీస్ నిర్ణయం కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు.. EOIపై సింగరేణి వైఖరి ఆధారంగా మరిణామాలు మారిపోనున్నాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ EOIపై కార్మిక సంఘాల అసంతృప్తిగా ఉన్నారు.. ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు దొడ్డిదారిన కట్టబెట్టే ప్రయత్నంగా జేఏసీ మండిపడుతోంది.. సింగరేణి, NMDC, సెయిల్ ఆధ్వర్యంలో EOIకి అంగీకరించాలని నిర్ణయిచింది.. నేటి సాయంత్రంతో గడువు ముగియనుండడంతో.. రేపు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీకానుంది.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది పోరాట కమిటీ.. మరోవైపు.. ఈనెల 26వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర వామపక్ష పార్టీల బహిరంగ సభ నిర్వహించనున్నాయి.. ఈ సభను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరుకానున్నారు.. మే 3న ఏపీలో రాస్తారోకోలకు అఖిలపక్షం సన్నాహాలు చేస్తోంది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు కోర్టులో కూడా విచారణ సాగుతోంది.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె.. అయితే, ఈ కేసు రేపు విచారించనుంది సుప్రీంకోర్టు.. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత.. ఈ రోజు సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా.. విచారణకు స్వీకరించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పింది.. దీంతో, రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది.. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది.. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు.. దీంతో, తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు వైఎస్ వివేకా కూతురు సునీత.
జనసేన, టీడీపీ పొత్తుపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఎంత కాలం అడ్డుకుంటారు..?
తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ.. అయితే, పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే.. భారతీయ జనతా పార్టీ మాత్రం భయపెడుతుందని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. టీడీపీతో జనసేన కలవకుండా.. బీజేపీ ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తామన్నారు పితాని. మరోవైపు.. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెరవెనుక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రానికి, దేశానికి బీజేపీ అవసరమా? అని ప్రజలు ప్రశ్నించే రోజు రాబోతుందన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారయణ.
హైదరాబాదీలకు డబల్ ధమాకా… ఆ బస్సుల్లో జర్నీ ఫ్రీ ఫ్రీ.
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. నగరానికి వచ్చే ప్రజలు వాటిని ఆసక్తిగా చూడటమే కాకుండా వాటిలో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. కాలక్రమంలో ఆ బస్సులు మాయమయ్యాయి. అయితే ఆ బస్సులను వెనక్కి తెస్తే బాగుంటుందని కొన్నాళ్లుగా నెటిజన్లు మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో అడుగుతున్నారు. నెటిజన్ల వినతికి ఓకే చెప్పిన మంత్రి కేటీఆర్ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తెస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు. రూ. 12 కోట్లతో హెచ్‌ఎండీఏ సహకారంతో నగరంలో మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులు రెండు నెలల నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ లలో తిప్పుతున్నారు. ఈ బస్సులు మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9:30 వరకు నడుస్తాయి. ‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులు ఉచితంగా తిరుగుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ఈ బస్సులు ఏయే రూట్లలో నడుస్తున్నాయో తెలియక జనం ఎక్కలేకపోతున్నారు. సరైన రూట్ మ్యాప్ ఉంటే ప్రయాణికులు ఎక్కేందుకు ఆసక్తి చూపుతారని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అమ్మాయితో లవ్..! ఎగ్జామ్ హాల్‌లో 9వ తరగతి విద్యార్థిపై దాడి..
ఏ సమయానికి జరగాల్సింది ఆ సమయానికి జరగాలన్నారు పెద్దలు.. కానీ, కొన్ని కోయిలలు ముందే కూస్తున్నాయి.. సినిమాలు, టీవీలో కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. ఏ ఏజ్‌లో లవ్‌లో పడుతున్నారో కూడా తెలియని పరిస్థితి.. అంతేకాదు ఓ అమ్మాయితో ఇద్దరు, ముగ్గురు లవ్‌లు పడుతున్నారు.. అంతేకాదు.. ఫైటింగ్ చేస్తున్నారు.. దాడి చేయడానికి కూడా వెనుకాడడం లేదు.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజానగరం జిల్లా పరిషత్ హై స్కూల్ 9 తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారమై 9 తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య వివాదానికి కారణంగా చెబుతున్నారు.. మాటామాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది.. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పెరగడంతో రాజానగరం చెందిన లోడగాల ఉదయ్ శంకర్ అనే విద్యార్థి అదే తరగతిలో చదువుతున్న తూర్పు గానుగూడెంకు చెందిన పింక్ హరి సాయి అనే మరొక విద్యార్థిపై దాడి చేశాడు. కత్తితో పొడిచాడు.. ఉపాధ్యాయులు అంతా ఉండగానే ఎగ్జామ్ హాల్ లో ఈ ఘటన జరిగింది.. ఊహించని ఘటనతో హరి సాయి కుప్పకూలిపోయాడు.. రక్తపు మడుగులో పడిపోయాడు.. ఇక, హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు టీచర్లు… ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. హాస్పటల్ లో హరిసాయికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. కానీ, 9వ తరగతి విద్యార్థులు ఓ అమ్మాయి కోసం దాడికి దిగడం చర్చగా మారింది.
సజీవంగా దొరికిన మౌంటెనీర్ అనురాగ్ మాలూ.. పరిస్థితి విషమం
గత వారం నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా జారిపడిన భారత పర్వతారోహకుడు అనురాగ్ మాలూ సజీవంగా దొరికాడు. మౌంట్ అన్నపూర్ణ అధిరోహించిన అతను గత వారం మిస్సయ్యాడు. అయితే అతను సజీవంగా ఉన్నట్లు తేలింది. విషమ పరిస్థితుల్లో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించారని సోదరుడు సుధీర్ వెల్లడించాడు. గత వారం కొంత మంది పర్వతారోహకులతో కలిసి అనురాగ్ మౌంట్ అన్నపూర్ణ ఎక్కాడు. కానీ ఏప్రిల్ 17న దిగుతుండగా 6,000 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కింద జారిపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా 8,000 మీటర్ల పైన ఉన్న మొత్తం 14 శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో అనురాగ్ మాలూ అన్నారు. దాంతో పాటు యూఎన్గ్లోబల్ గోల్స్‌ను సాధించే లక్ష్యంతో ఆయన ఈ మిషన్ చేపట్టారు. దీనిని సాధించడం కోసం మొత్తం ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పాయింట్లను అధిరోహించే లక్ష్యంతో ఉన్నారు. రెక్స్ కారమ్ వీర్ చక్ర అవార్డును అతను గెలుచుకున్నాడు. 2041 అంటార్కిటికా యూత్ అంబాసిడర్‌గా ఇండియా నుంచి ఎంపికయ్యాడు.
యంగ్ సెన్సేషన్, కొరియన్ పాప్ సింగర్ మూన్‌బిన్ మృతి
తనదైన గాత్రం, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకున్న యంగ్ సెన్సేషన్, సౌత్ కొరియన్ పాప్ సింగర్ మూన్‌బిన్(25) కన్నుమూశారు. చాలా చిన్న వయసులోనే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ యువగాయకుడు బుధవారం తన అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని మూన్‌బిన్ సాంగ్స్‌ను రికార్డింగ్ చేసే కంపెనీ ‘ఫాంటియాగో’ ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించింది. పాప్ సింగ్ మూన్ బిన్ బుధవారం రాత్రి సియోల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు ఆయన మేనేజర్ గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పార్థివ దేహాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం మూన్‌బిన్ భౌతిక కాయాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మూన్‌బిన్ మరణంపై ‘ఫాంటియాగో’ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో ‘మూన్‌బిన్ హఠాత్తుగా మనల్ని వదిలివెళ్లిపోయారు. వినీలాకాశంలో ధృవతారలా మారిపోయారు’ అంటూ పేర్కొంది. దీంతో అతడి అభిమానులు, సన్నిహితులు దుఖ: సాగరంలో మునిగిపోయారు. మూన్‌బిన్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా అతడి కోట్ల మంది ఫాలోవర్లు పోస్టులు చేస్తున్నారు. అనతి కాలంలోనే గొప్ప పేరు సాధించిన మూన్ బిన్ దక్షిణ కొరియాలోని చియోంగ్జులో జనవరి 26, 1998న జన్మించాడు. అతడు చిన్న వయసు నుంచే పాటలు, నటన, డ్యాన్స్‌లో రాణిస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలోనే మరో ఐదుగురు గాయకులతో కలిసి ఫిబ్రవరి 23, 2016న K-పాప్ గ్రూప్ ASTROతో ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.
శుభవార్త చెప్పిన నెట్‌ఫ్లిక్స్.. ఛార్జీలు భారీగా తగ్గింపు.. !
ఇప్పుడంతా ఓటీటీ ప్లాట్‌ఫాంల హవా కొనసాగుతోంది.. ప్రజల నుంచి మంచి ఆధరణ కూడా ఉండడంతో.. అవి చార్జీలను కూడా పెంచుతూ పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఈ తరుణంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలలో సబ్‌స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.. అంటే, గతంలో నెలకు నెట్‌ఫ్లిక్స్ రూ.199 వసూలు చేస్తూ వస్తుంది.. ఇది నెట్‌ఫ్లిక్స్ మొబైల్-ఓన్లీ ప్లాన్ కాగా.. ఇప్పుడు అది రూ.149కే అందిస్తోంది.. మరోవైపు.. టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్ ఇలా ఎందులో అయినా యాక్సెస్ చేసుకోగలిగే బేస్ సబ్‌స్క్రిప్షన్ ధర గతంలో రూ.499గా ఉంటి దానిని భారీ తగ్గింపును ప్రకటించింది.. ఇప్పుడు రూ.199కే పరిమితం చేసింది.. నెట్‌ఫ్లిక్స్ 2021లో దేశంలో తక్కువ-ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించిన తర్వాత కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌లో 30 శాతం వృద్ధిని మరియు భారతదేశంలో సంవత్సరానికి 24 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. భారతదేశ మార్కెట్‌కు అనుగుణంగా మరియు దాని వ్యాప్తిని మరింతగా పెంచుకోవడానికి కంపెనీ మొదటిసారిగా సబ్‌స్క్రిప్షన్ ధరలను 20-60 శాతం పరిధిలో తగ్గించింది. అయితే 2022లో (ఫారెక్స్) తటస్థ ఆదాయ వృద్ధి 24 శాతానికి పెరిగింది.. ఈ విజయం నుండి నేర్చుకుని, మేము Q1లో అదనంగా 116 దేశాలలో ధరలను తగ్గించామని.. నెట్‌ఫ్లిక్స్ మార్చి 2023 త్రైమాసిక ఆదాయ నివేదికలో పేర్కొంది. తాజా పరిణామం దీర్ఘకాలికంగా మా ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.
సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2023 పై సర్వత్రా హర్షం!
సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952ను సవరిస్తూ, కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2023ను తీసుకు రాబోతోంది. దానికి సంబంధించిన బిల్లును బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో దీనిని ప్రవేశ పెట్టడమే తరువాయి. అయితే గతంలో ఈ చట్టం విషయంలో పలువురు సినీ ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా ఆన్ లైన్ ద్వారా జరుగుతున్న వీడియో పైరసీపై ఈ చట్టం ద్వారా కేంద్రం ఉక్కుపాదం మోపబోతోంది. దాంతో నిర్మాతలతో పాటు పలు నిర్మాణ సంస్థలు దీనికి మద్దతు ప్రకటించాయి. ఒకసారి సెన్సార్ అయిన సినిమాల వల్ల ఏదైనా వివాదాలు చెలరేగినా, ఏ వర్గమైన అభ్యంతరం వ్యక్తం చేసినా, కేంద్రం రీ-సెన్సారింగ్ కు ఆదేశించే ఆస్కారం ఈ సవరణ చట్టంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు దీన్ని బాహాటంగా గతంలో విమర్శించారు. ఇలా అయితే… సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు ఏం గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు. సి.బి.ఎఫ్.సి.ని స్వతంత్ర స్థంస్థగా ఉంచాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం తన కనుసన్నలలో మెలిగేలా చేస్తోందని ఆరోపించారు. అందులో సభ్యులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తోందని, ఆ రకంగా అధికార పార్టీ ఆలోచనలకు, భావాలకు తగ్గట్టుగానే వారు ప్రవర్తిస్తారని విమర్శించారు. అయితే… అందులో పూర్తి స్థాయి నిజం లేదనే విషయం ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో రుజువైంది. కేంద్రంలోని అధికార పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా తెరకెక్కిన అనేక చిత్రాలు గడిచిన కొన్నేళ్ళుగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, థియేటర్లలో ప్రదర్శితమౌతున్నాయి. నిజంగా సెన్సార్ సభ్యులు కేంద్రం కనుసన్నలలో పనిచేస్తూ ఉంటే… ఆ సినిమాలేవీ విడుదల అయ్యేవే కాదు. గతంలో పోల్చితే… ఇప్పుడు సి.బి.ఎఫ్.సి. చాలా ఉదారంగా ఉందని ప్రశంసిస్తున్న వాళ్ళూ లేకపోలేదు.