ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు.. అరెస్ట్ భయంతో పరార్..!
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు.. భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తుండగా.. అయితే, మొదట నోటీసు ఇవ్వాలని కోరారట శివానందరెడ్డి.. ఇక, తెలంగాణ పోలీసులు నోటీసు తయారు చేస్తుండగానే.. వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయారు శివానంద రెడ్డి.. అడ్డుకునే ప్రయత్నం హైదరాబాద్ పోలీసులు చేయగా.. దొరకకుండా తప్పించుకొని వెళ్లిపోయారట శివానంద రెడ్డి.. ఇదే సమయంలో.. తెలంగాణ పోలీసులు.. శివానందెడ్డి వాహనాలు వెంబడించకుండా ఆయన అనుచరులు గేట్లు వేసినట్టుగా తెలుస్తోంది. కాగా, హైదరాబాద్‌లో ఓ భూవివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు అల్లూరు వెళ్లారట సీసీఎస్ పోలీసులు.. ఈ విషయం బయటకు పొక్కడంతో పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు టీడీపీ శ్రేణులు.. కాగా, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు మాండ్ర శివానందరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు.. ఈ తరుణంలో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధం కావడం.. ఆయన తప్పించుకుని పారీపోవడం చర్చగా మారింది. మరి ఈ కేసులో పోలీసులు తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది చర్చగా మారింది. అయితే, హైదరాబాద్ లో భువివాదంలో క్రైమ్ నెంబర్ 194/2022లో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీఎస్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్టుగా సమాచారం.
మండలి బుద్ధ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు.. అయితే, జనసేన పార్టీలో చేరికకు ముందే మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో నన్ను తప్పకుండా గెలిపిస్తారని నమ్ముతున్నాను అన్నారు.. మీ సహకారంతో ఎమ్మెల్యేగా గెలిస్తే మీ కోసం పనిచేస్తాను.. ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు.. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక, అవనిగడ్డ అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మండలి బుద్ధ ప్రసాద్.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యం అన్నారు.. పిల్లను కూడా ఇక్కడి వారికి ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు.. అసలు ఇవ్వడంలేదని విమర్శించారు.. అయితే, జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్టు, జనసేన పార్టీలో చేరుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. కాగా, టీడీపీలో అవనిగడ్డ టికెట్ బుద్ధప్రసాద్‌కు దక్కకపోవడం ఒకటైతే.. పొత్తుల్లో భాగంగా.. జనసేనకు ఆ సీటును కేటాయించింది టీడీపీ.. ఈ నేపథ్యంలో.. మండలి బుద్ధ ప్రసాద్.. జనసేనలో చేరి.. అదే స్థానం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.
సీఎం సమక్షంలో వైసీపీ గూటికి టీడీపీ, జనసేన నేతలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎన్నికల సమయంలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.. ఐదో రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.. వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్న సీఎం జగన్.. వారి సమస్యలను అడిగితెలుసుకుంటున్నారు.. ఇదే సమయంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.. మరోవైపు.. ఇతర పార్టీలకు చెందిన నేతలకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. మేమంతాసిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పలువురు టీడీపీ, జనసేన పార్టీ నుంచి ఈ రోజు వైసీపీలో చేరారు.. సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ నేత వేణుగోపాల్, జనసేన నియోజకవర్గ నేత తిరుపతేంద్ర, పుట్టపర్తి టీడీపీ మండల నేత కె పెద్దన్న, వెంకటస్వామి సహా పలువురు నేతలను సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వచ్చారు.. ఇక, పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి సహా మరికొందరు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉష శ్రీ చరణ్.. వైసీపీ అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్ వార్నింగ్
ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా కలెక్టర్, గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల రెడ్డి.. ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉంది.. ఈ క్రమంలో ఓటర్ల జాబితా మార్పులు కుదరవు అన్నారు.. కానీ, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. ఫామ్ 6 ఉపయోగించి ఓటరు గా నమోదు చేసుకోవచ్చు అని వెల్లడించారు. ఇక, గుంటూరు పార్లమెంట్ పరిధిలో 17 లక్షల ఎనభై వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపిన ఆయన.. ఎన్నికల కమిషన్ ఆదేశాల ఖచ్చితంగా అమలు చేస్తున్నాం… 63 ఫ్లయింగ్ స్క్వాడ్ లు పని చేస్తున్నాయి.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. ఇక, ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. ఇప్పటికే ఎన్నికల కోడ్ అతిక్రమించిన 124 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నాం అన్నారు వేణుగోపాల రెడ్డి.. జిల్లా సరిహద్దులో 13 నిఘా కేంద్రాలను పెట్టాం.. సింగిల్ విండో విధానం ద్వారా రాజకీయ పార్టీలకు అవసరం అయిన పర్మిషన్ లు ఇస్తున్నాం అన్నారు. నిబంధనలకు లోబడి ఉన్న అన్ని అనుమతులు 48 గంటల లోపు ఇస్తున్నామని వెల్లడించారు. మరోవైపు.. సీ విసిల్ యాప్ ద్వారా 94 శాతం ఫిర్యాదులను రికార్డుస్థాయి సమయంలో పరిష్కరించి చర్యలు తీసుకున్నామని తెలిపారు గుంటూరు జిల్లా కలెక్టర్, గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల రెడ్డి.
జగన్ అంటే నిజం.. నిజాన్ని జనం నమ్ముతారు..
జగన్ అంటే నిజం.. ఆ నిజాన్ని జనం నమ్ముతారు అంటూ ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏపీ మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని రాయుడుపాకల గ్రామంలో విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ అంటే నిజం… నిజాన్ని జనం నమ్ముతారు అని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయననే సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ చేశారన్న ఆయన.. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్షగా అభివర్ణించారు. వైఎస్ జగన్ గెలుపును కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాం.. ప్రతి అభ్యర్థిలోనూ ప్రజలు జగన్నే చూస్తారని పేర్కొన్నారు. ఇక, పవన్ కల్యాణ్‌కు సహనం తక్కువ అంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ.. ప్రచారం ప్రారంభించిన రెండో రోజే పవన్ వెళ్లిపోయారన్న ఆయన.. పవన్ కల్యాణ్‌ను పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం చేయటం ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రదర్శించాడని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వారు చరిత్రలో లేరంటూ హాట్ కమెంట్లు చేశారు ఏపీ మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
కేసీఆర్ ప్రెస్ మీట్ లో పవర్ కట్ లేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
కేసీఆర్ ప్రెస్ మీట్ జనరేటర్ మీద పెట్టారని, కరెంట్ పోయింది అని తప్పుడు మాటలు చెబుతున్నారని నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరేటర్ ఆగిపోతే కూడ మాదేన తప్పు అని మండిపడ్డారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. Ntpc 4000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తున్నారని, 1600 మెగావాట్లే చేస్తుందన్నారు. టీఆర్ఎస్, ఎన్టీపీసీకి కోఆపరేట్ చెసి ఉంటే.. 4 వేళా మెగావాట్ల పవర్ ఉండేది మన చేతిలో అని క్లారిటీ ఇచ్చారు. యాదాద్రికి ఎక్కడ నష్టం అవుతుందో అని ఎన్టీపీసీకి కేసీఆర్ సహకరించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రతి మాట అబద్ధమే అన్నారు. వాస్తవాలు వక్రీకరీంచండం ఆయనకే దక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెస్టేషన్ లో కేసీఆర్ వున్నాడని, ప్రభుత్వం పోయింది..పార్టీ కూడా పోతుంది అనే భయం ఆయనకు ఉందని అన్నారు. పొంకణాలకు పోయి… ఉనికి లేకుండా మారింది పార్టీ అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్, వీఆర్ఎస్ అవుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరవత బీఆర్ఎస్ మిగలదన్నారు. బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు తప్పా ఎవరు ఉండరన్నారు.
తీహార్ జైలుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు కోర్టులో హాజరుపరిచింది. అక్కడ నుంచి ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే, కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో అతని ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నాం.. వాటి పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదని ఈడీ కోర్టుకు చెప్పింది. ఉద్దేశపూర్వకంగా మమల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని ఈడీ అధికారులు అన్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి.. మళ్లీ అవసరమైనప్పుడు అతని రిమాండ్‌ను కోరుతామని ఈడీ తెలిపింది. ఇక, అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. అతడ్ని ప్రతి రోజూ 5 గంటలకు పైగా 50 గంటల పాటు విచారించినట్లు ఈడీ తెలిపింది. ఇక, ఈడీ తరఫు న్యాయవాది ఏఎస్‌జీ రాజు మాట్లాడుతూ.. విజయ్ నాయర్ కేజ్రీవాల్‌తో సన్నిహితంగా ఉండేవారన్నారు. విజయ్ నాయర్ తనకు రిపోర్టు చేయలేదని కేజ్రీవాల్ విచారణ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అతీషి పేరు తొలిసారిగా కోర్టుకు వినిపించింది. కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన కేజ్రీవాల్ మీడియా ప్రతినిధుల ముందు మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ప్రధాని చేస్తున్నది దేశానికి మంచిది కాదన్నారు. రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్ష కూటమి చేపట్టిన ర్యాలీపై స్పందించాలని కేజ్రీవాల్‌ను కోరారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సత్యేందర్ జైన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం తీహార్ జైల్లో ఉన్నారు.
సుప్రీంకోర్టులో కాంగ్రెస్కు బిగ్ రిలీఫ్..
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీప్ ఇచ్చింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది. ఇప్పటికే పన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ శాఖ 135 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ ముందుగా హైకోర్టు ఆశ్రయించగా అక్కడ ఊరట దొరకకపోవడంతో.. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది. ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీని ఆదాయపన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని తెలియజేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది. ఇక, 2017- 2018 నుంచి 2020- 2021 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి 1,823 కోట్ల రూపాయలను చెల్లించాలని శుక్రవారం నాడు ఐటీ శాఖ నోటీసులు పంపింది. నిన్న(ఆదివారం) 1744 కోట్ల రూపాయలు కట్టాలని మరో నోటీసులు ఇచ్చింది.
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డును పొందండి ఇలా..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ సెషన్ 2 – 2024 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసారు. విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యర్థులు డౌన్ లోడ్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డులో బార్ కోడ్ అందుబాటులో ఉందొ లేదు కచ్చితంగా నిర్ధరించుకోవాలి. అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని పాటించి వారి అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా jeemain.nta.ac.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆపై హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సెషన్ 2 కోసం జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024 పై క్లిక్ చేయాలి. దాంతో మనకి ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థుల వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆపై అక్కడిసబ్మీట్ బటన్ క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇక తర్వాతి అవసరాల కోసం అడ్మిట్ కార్డు హార్డ్ కాపీని తీసి పెట్టుకోవాలి.
హాయ్ మహీ.. మ్యాచ్ ఓడిపోయామని గ్రహించలేదు!
ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరించాడు. వింటేజ్ తలాను గుర్తుచేస్తూ.. విశాఖ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో ధోనీ తొలిసారి బ్యాటింగ్ చేయడం, భారీ షాట్లు ఆడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎంఎస్ ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చూసి అతడి సతీమణి సాక్షి మైదానంలో కేరింతలు కొట్టారు. ఇక ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును మహీ అందుకున్నపుడు విశాఖ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టే గెలిచిందేమో అన్న అనుమానం కలిగింది. ధోనీ బ్యాటింగ్ చూసి అందరూ చెన్నై మ్యాచ్ ఓడిందనే విషయాన్ని మర్చిపోయారు. ఇదే భావన తనకు కలిగిందని సాక్షి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘హాయ్ మహీ.. ఉన్నావా?. నీ బ్యాటింగ్ చూసి.. గేమ్‌లో ఓడిపోయామని గ్రహించలేదు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఎంఎస్ ధోనీ అవార్డు స్వీకరిస్తున్న ఫొటోను జత చేసిన సాక్షి.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగులతో ఢిల్లీపై ఓడింది. ముందుగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడిపోయింది.
విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ మామూలుగా లేవుగా..
విజయ్ దేవరకొండ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. అర్జున్ రెడ్డి తో సాలిడ్ హిట్ ను అందుకున్న హీరో, ఆ తర్వాత వచ్చిన సినిమాలల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గీతాగోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ నిన్న విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అలరించడం తో సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో విజయ్ దేవరకొండ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన లవ్, బ్రేకప్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకువచ్చారు.. ఆ విషయాలను విన్న చాలా మంది నమ్మలేకపోయారు కూడా.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. విజయ్ లవ్ స్టోరీ గురించి చెప్పడం విశేషం.. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించనని తెలిపాడు. ప్రేమించిన అమ్మాయినే అన్ని తానే భావిస్తానని చెప్పుకువచ్చాడు.. గతంలో తన జీవితంలో రెండు బ్రేకప్ లు అయ్యాయని చెప్పాడు.. విజయ్ బ్రేకప్ గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారని సమాచారం..
100 కోట్ల లక్ష్యంతో దూసుకుపోతున్న టిల్లు.. 3 రోజులకు ఏకంగా..?!
రెండు సంవత్సరాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ‘డీజే టిల్లు’ అంటూ ఓ చిన్న సినిమా విడుదలైంది. అయితే అందులో ఉన్న కామెడీ టైమింగ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ ను చూసి ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు అఖండ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమా చేసిన ఇంపాక్ట్ తో రెండో సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయకుండా వారు ఊహించదానికి కంటే ఎక్కువ కంటెంట్ తో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మల్లి క్ రామ్ దర్శకత్వం వహించగా.. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్, సీతారాం ఎంటర్ప్రైజెస్ పతకలపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశి లు సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది సినిమా. రెండు గంటల పాటు నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైన్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక ఈ సినిమా వసుళ్లపరంగా సంచలనాలను సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 23.7 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు మొత్తం 45.3 కోట్లను గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక నేడు మూడు రోజులు ముగిసే సమయానికి టిల్లు స్క్వేర్ 68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. దీంతో అతి త్వరలో 100 కోట్ల క్లబ్బులో చేరిబోతున్నాడు సిద్దు జొన్నలగడ్డ.