గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళిక
ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది.. ఇప్పటి వరకు గ్రూప్-1 కింద 140 పోస్టులు, గ్రూప్-2 కింద 1082 పోస్టులున్నట్టు గుర్తించారు సంబంధిత అధికారులు.. 12 శాఖల పరిధిలో గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. హెచ్‌వోడీలతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు.. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. కాగా, అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1, 2 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతించింది. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం విదితమే.. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.
బీజేపీలోకి పట్నం మహేందర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ
మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , నాగర్ కర్నూల్ జిల్లాకు ఇన్‌చార్జి వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. ఆయన ఎట్టకేలకు స్పందించారు. అయితే తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తరపున మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు పీ.మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏప్రిల్ 23న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో డాక్టర్ మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారని గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి, మరికొంత మంది నేతలు కూడా హోంమంత్రి సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలంటున్నాయి. డాక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అదంతా తప్పుడు సమాచారం జరుగుతుందని అన్నారు. నేను బీజేపీలో ఎందుకు వెళ్తాను? అసలు ఆలోచనే నాకు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొన్ని లోకల్ గ్రూప్ లల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్ద తెలిపారు. కొందరు దద్దమ్మలు తప్పుడు ప్రచారం చేస్తున్నరని మండిపడ్డారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్’కి సీఎం జగన్ శంకుస్థాపన
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చేందుకు ముందడుగు పడినట్టు అయ్యింది.. ఇక, నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం.. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.. మూలపేటలో పర్యటిస్న్న సీఎం.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేశారు.. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.. మరోవైపు.. విష్ణుచక్రం, మూలపేటకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని నిర్మించబోతోంది.. ఇక, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనావేస్తున్నారు.
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా.. జగన్ కీలక ప్రకటన
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాజధానిపై కీలక ప్రకటన చేశారు.. సంతబొమ్మాళి మండలం నౌపాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా.. కాపురం కూడా విశాఖకు మారుతున్నాను.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అంటూ వ్యాఖ్యానించారు.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తాను.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. ఇక, ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారంగా 700 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం చేపట్టాం.. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను జూన్ నెలలోపు పూర్తి చేస్తాం.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా ట్రైబల్ ఇంజనీరింగ్ కడుతున్నాం. నాలుగు మెడికల్ కళాశాలలు నడుపుతున్నాం అని ప్రకటించారు. మే 3 వ తేదీన భోగాపురం విమానాశ్రయంకు శంకుస్థాపన చేస్తాం.. మే 3వ తేదీన అదానీ డేటా సెంటర్ ప్రారంభిస్తున్నాం.. గతంలో ఎప్పుడైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఇంతలా దృష్టిపెట్టింది లేదన్నారు సీఎం వైఎస్ జగన్.
మూలపేట.. మూలనఉన్న పేట కాదు.. అభివృద్ధికి మూలస్తంభం…
తోడేళ్లన్నీ ఏకమైనా నాకేమీ భయం లేదు.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. నౌనాడలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మూలపేట మూలన ఉన్న పేట కాదు.. అభివృద్ధికి మూలస్తంభం కానుందంటూ అభివర్ణించారు సీఎం జగన్.. 24 మిలియన్ టన్నులు సామర్థ్యంతో నాలుగు బెర్త్ లు కేటాయిస్తున్నాం.. పోర్ట్ కోసం 2954 కోట్లు ఖర్చుచేసి 24 నెలల్లో పుర్తి చేస్తాం అన్నారు.. 14 కిలోమీటర్ల రహాదారులు , 11 కిలోమీటర్ల రైల్వే కనెక్టవిటీ అందిస్తున్నాం.. మౌళిక వసతులన్నింటితో కలిపి 4362 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నారు. 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పోర్ట్ ఆదారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు.. ఉపాధి లేఖ వేరేప్రాంతాలకు , వేరే రాష్ర్టాలకు మత్స్యారులు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. గంగపుత్రుల కళ్లలో ఆనందం నింపేందుకు చర్యలు చేపడుతున్నాం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరో రెండు పిస్సింగ్ హార్బర్ నిర్మిస్తాం.. బుడగట్లపాలెం , మంచినీళ్లపేటలో హార్బర్ లు నిర్మిస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గిడిచినా నాలుగు పోర్టులే ఉన్నాయి.. నాలుగు పోర్టులు.. 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పిస్ ల్యాండిగ్ సెంటర్ నిర్మిస్తున్నా. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా.. అని నిలదీశారు.. డీప్ సీలో ఫిషింగ్ అవకాశాలు ఇస్తే వలసలు నివారించవచ్చన్న ఆయన.. దివంగత నేత వైఎస్ మరణం తరువాత సాగునీటి ప్రొజెక్టులు పూర్తి కాలేదన్నారు.. వంశధారలో 19 టిఎంసి ల నీటి నిల్వచేసే అవకాశం ఉంది. నేరడి బ్యారేజి కోసం ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడానన్న ఆయన.. 176 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. తద్వారా రెండు పంటలకు నీరు అందిస్తామని ప్రకటించారు..
ఆగిన మరో చిన్ని గుండె.. అమెరికాలో ఖమ్మం వైద్య విద్యార్థి మృతి
చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి. డ్యాన్స్ చేస్తూ ఒకరు, జిమ్ చేస్తూ ఒకరు, ప్రయాణిస్తూ ఒకరు ఇలా.. ఒకేసారి కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ఏ కారణం చేతనైనా కొందరు నవ్వుతూ.. నడుస్తూ.. ఆడుతూ.. పాడుతూ హఠాత్తుగా కుప్పకూలి.. ఇటీవల అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం సాయిప్రభాతనగర్‌లో నివసించే టి.రవికుమార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు హేమంత్ శివరామకృష్ణ (20) 2021లో మెడిసిన్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. హేమంత్ ప్రస్తుతం బార్బడోస్‌లోని ఓ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం సరదాగా స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన హేమంత్ కాసేపు ఈత కొట్టాడు. ఆ తర్వాత గుండెపోటు వచ్చి బీచ్‌లో కుప్పకూలిపోయాడు. స్నేహితులు హేమంత్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే హేమంత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. హేమంత్ మృతితో రవికుమార్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలో చదివి డాక్టర్ కావాలంటే చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు రోదించారు. తమ బిడ్డలపైనే ఆశలన్నీ పెట్టుకున్నామని, తమ కుమారుడిని దేవుళ్లు అర్ధాంతరంగా తీసుకెళ్లారని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. హేమంత్ మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెగ తాగేస్తున్నారు.. బీర్ల అమ్మకాల్లో తెలంగాణ టాప్
తెలంగాణలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. హైదరాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి 17 వరకు దాదాపు 1.01 కోట్ల బీర్లు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో మొత్తం 8,46,175 బీర్లు అమ్ముడయ్యాయి. ఒక కేసులో 12 బీర్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బీర్లు భారీ మొత్తంలో అమ్ముడుపోయాయి. ఈ నెలలో ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఎండలతో మార్చి నుంచి బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో ఈ నెల 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో 1,94,351 కేసుల బీర్లు, రంగారెడ్డి జిల్లాలో 5,59,5746, మేడ్చల్ జిల్లాలో 92,078 కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. మార్చిలో హైదరాబాద్ జిల్లాలో 3,68,569 కేస్‌లు, రంగారెడ్డి జిల్లాలో 10,77,240 కేస్‌లు, మేడ్చల్ జిల్లాలో 1,63,358 కేస్‌ల బీరు విక్రయాలు జరిగాయి. అలాగే ఫిబ్రవరి నాటికి హైదరాబాద్‌లో 3,31,784, రంగారెడ్డిలో 9,34,452, మేడ్చల్‌లో 1,46,763 కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. జనవరిలో హైదరాబాద్ జిల్లాలో 2,96,619 కేస్‌లు, రంగారెడ్డి జిల్లాలో 8,36,907 కేస్‌లు, మేడ్చల్ జిల్లాలో 1,34,468 కేస్‌లు అమ్ముడుపోయాయి. మద్యం విక్రయాలు పెరగడంతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. దీంతో బీర్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా మద్యం దుకాణాలకు నిత్యం బీరు సరఫరా అవుతోంది. ఈ నెల, వచ్చే నెలలో బీర్ల విక్రయాలు రికార్డు సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కర్ణాటక ఎన్నికలు.. నామినేషన్లలో ఆసక్తికర ఘటనలు
కర్ణాటక విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యాద్గిర్ నియోజకవర్గం నుంచి యంకప్ప అనే యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో సమర్పించిన డిపాజిట్ కింద అన్నీ రూపాయి నాణేలను సమర్పించాడు యంకప్ప. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి రూపాయి నాణేలను సేకరించిన ఆయన… వాటిని తన నామినేషన్‌తోపాటు డిపాజిట్ సొమ్ము కింద జమ చేశాడు. అయితే ఆ నాణేలను ఎన్నికల అధికారులు రెండు గంటల పాటు లెక్కించాల్సి వచ్చింది. ఇక హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మంత్రి MTB నాగరాజు దాఖలు చేసిన అఫిడవిట్‌లో… తనకు 16 వందల 9 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. MTB నాగరాజు కేవలం తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తన అఫిడవిట్‌లో కనబర్చిన 16 వందల 9 కోట్ల ఆస్తుల్లో తన భార్య పేరు మీద 536 కోట్ల చరాస్తులు, వెయ్యి 73 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా 2018 ఎన్నికల్లో తన ఆస్తిని వెయ్యి 120 కోట్లుగా ప్రకటించారు MTC నాగరాజు. అప్పటితే పోలిస్తే ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తులు 500 కోట్లు పెరిగాయి.
చిన్నారులకు శునకాలతో పెళ్లి.. బాలుడికి ఆడకుక్కతో.. బాలికకు మగ కుక్కతో..!
చిన్నారులకు వీధి కుక్కలతో వివాహం జరిపించారు.. అదేంటి? కుక్కలతో పెళ్లి ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. నిజమే ఒడిశాలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ వీధి కుక్కలతో పెళ్లి చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే.. అదో నమ్మకం.. మూఢనమ్మకం.. ఎందుకంటే.. ఓ వైపు ఆధునిక పరిజ్ఞానంలో దూసుకెళ్తుంటే.. మరోవైపు.. ఇలాంటి నమ్మకాలు కూడా అదేస్థాయిలో పెంచిపోషిస్తున్నవారు లేకపోలేదు.. మొత్తంగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఇద్దరు మైనర్ పిల్లలకు ‘దుష్టశక్తులను దూరం చేసేందుకు’ వీధికుక్కలతో పెళ్లి చేశారు. 11 ఏళ్ల బాలుడు తపన్ సింగ్ (దారీ సింగ్ కుమారుడు) ఆడ కుక్కను వివాహం చేసుకోగా, ఏడేళ్ల లక్ష్మి (బుటు కుమార్తె) ఒక మగ కుక్కతో వివాహం చేసుకుంది. ఇది స్థానికుల నమ్మకం ప్రకారం. దుష్టశక్తులను దూరం చేస్తుందన్నమాట.
అబ్దుల్.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోపో.. నెట్టింట్లో ట్రోలింగ్
ఉప్పల్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి పాలైన విషయం తెలిసిందే! నిజానికి.. సన్‌రైజర్స్ మొదట్లో నిదానంగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టిన, ఆ తర్వాత ఊపందుకోవడంతో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా క్లాసెన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఆడటం, అదే సమయంలో మయాంక్ కూడా రెచ్చిపోవడంతో.. ఈ మ్యాచ్ ‘వన్ సైడ్ నుంచి ఉత్కంఠభరితంగా’ మారింది. హైదరాబాద్ జట్టు లక్ష్యానికి చేరువ అవుతుండటంతో.. బహుశా వీళ్లు ఛేజ్ చేస్తారేమోనన్న ఆశలు సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో రేకెత్తాయి. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ.. వచ్చిన బ్యాటర్లు తమవంతు ఎంతో కొంత సహకారం అందిస్తూ, జట్టుని లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. ఆఖరి 5 ఓవర్లలో 60 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. సన్‌రైజర్స్ విజయం తథ్యమని అంతా భావించారు. కానీ.. ఆ సమయంలో సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చి, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతగాడు.. ముంబై జట్టుకి సమాధి కడతానుకుంటే, సన్‌రైజర్స్‌నే ముంచేత్తాడు. 13 బంతులు ఎదుర్కొన్న అతగాడు.. కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక బౌండరీ ఉంది. ఓవైపు చివర్లో వచ్చిన బౌలర్లు సైతం జట్టును గెలిపించాలన్న కసితో షాట్లు కొడుతుంటే.. సమద్ మాత్రం కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అతడు క్రీజులో ఉన్నప్పుడు వచ్చిన జాన్‌సెన్(13), సుందర్(10) మంచి ప్రదర్శన కనబర్చారు. తమ వంతు న్యాయం చేసి వెళ్లారు. కానీ.. ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న సమద్ మాత్రం, అవసరం లేని పరుగుకి ప్రయత్నించి ఔటయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే.. సన్‌రైజర్స్ ఓటమికి సమద్ ఒక కారుకుడిగా నిలిచాడు. ఒకవేళ ఇతర ప్లేయర్ల మాదిరి ఇతడు కూడా షాట్లు కొట్టి ఉంటే.. బహుశా హైదరాబాద్ జట్టు గెలిచి ఉండేదేమో!
ప్రియాంకా!… ఏమిటిది?
వెబ్ సిరీస్ అనగానే అశ్లీల, అసభ్య సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయని అందరికీ తెలుసు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే తాము ఇలాంటి సీన్స్ పెడుతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి సిరీస్ లో నటించిన కొందరు స్టార్స్ వీటిని ఏకాంతంలో చూడండనీ సెలవిస్తున్నారు. ఇలా వెబ్ సిరీస్ లో నటించేవారికి సైతం అందులోని కంటెంట్ గురించి తెలుసు. కానీ, తప్పదు యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్ రూపొందుతున్నాయి. ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ సిరీస్ లోనూ ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయిట. అందునా పెళ్ళయి ఒక బిడ్డకు తల్లయిన ప్రియాంక చోప్రా నగ్నంగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రేక్షకులకు విశేషమే మరి. ‘సిటాడెల్’ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా, ఆమె సరసన హీరోగా నటించిన రిచర్డ్ మ్యాడెన్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా సైతం మిగతా ప్రశ్నలు గాలికి వదిలేసి, శృంగార సన్నివేశాల్లో ఎలా నటించారు? అంటూ ప్రశ్నలు కురిపించారు. అందుకు ప్రియాంక సిగ్గుల మొగ్గయింది. ఆమె పరిస్థితి చూసిన రిచర్డ్ సైతం ఇబ్బంది పడ్డాడు. స్క్రిప్ట్ దశ నుండి ఒకరితో ఒకరం స్నేహంగా ఉండడం వల్ల, యాక్షన్ సీన్స్ కోసం రోజూ ప్రాక్టీస్ చేసిన కారణంగా తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, అందువల్ల శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడూ ప్రొఫెషనల్స్ గానే వ్యవహరించామని ప్రియాంక, రిచర్డ్ చెప్పారు. ఈ సీన్స్ లో లిప్ లాక్స్ ఉన్నాయా? అన్నది మరో జర్నలిస్ట్ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, త్వరలోనే రానున్న ‘సిటాడెల్’ చూస్తే మీకే అర్థమవుతుంది కదా అంటూ రిచర్డ్ దాటవేశాడు. ఏది ఏమైనా ఈ ప్రశ్నలు అడిగించుకోవడం కూడా ‘సిటాడెల్’కు క్రేజ్ తీసుకు రావడానికే అనీ కొందరు అంటున్నారు.