*అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం.. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం!
నేడు ‘శ్రీరామ నవమి’. ఈ సందర్భంగా యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు ప్రత్యేకమైనది. ఎందుకంటే.. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి నవమి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు బాల రాముడికి తిలకం దిద్దాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడ్డాయి. కొన్ని నిమిషాల పాటు సూర్య కిరణాలు అలానే ఉన్నాయి. ఆధునిక సాంకేతికత సాయంతో సూర్య కిరణాలు గర్భ గుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. బాల రాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకంతో భక్తులు పరవశించిపోయారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయోధ్య ఆలయంలోని మూడో అంతస్తు నుంచి గర్భ గుడిలోని బాల రాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి.. రాముడి నుదుటిపై తిలకంగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో సీబీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు.
*కేసీఆర్ కాంగ్రెస్ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తాం..
సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాధ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామన్నారు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది.. రేవంత్ రెడ్డి ముఖం చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అంటూ మండిపడ్డారు. మేము గేట్లు తెరిస్తే.. ఎమ్మెల్యేలుగా ఉన్న సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు అని ఆయన చెప్పుకొచ్చారు. మరో 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన రేవంత్ రెడ్డి.. రాష్టానికి సీఎం అయ్యారు.. మెదక్ లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా కూడా బీఆర్ఎస్ గెలవదు.. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తుంటే జాలీ వేస్తుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సొంత బిడ్డ జైలుకు వెళ్తే.. కేసీఆర్ తాను చేసిన పాపాలకు ప్రయశ్చితం చేసుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారు.. రావులు అందరూ జైలుకు వెళ్తే చర్లపల్లి జైల్ సరిపోదు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్ను పోటు పొడిచిన వ్యవహారంలో కేసీఆర్ కూడా అన్నారు అని ఆరోపించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది అని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
*అమేథీ నుంచి పోటీ చేసేదెవరు.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
లోక్‌సభ ఎన్నికలు 2024లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేదెవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కంచుకోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అమేథీ స్థానంపై రాహుల్ గాంధీ స్పందించారు. నేడు ఘజియాబాద్‌లో సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయడంపై రాహుల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘సీఈసీ, కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను ఏం చేయమని కోరితే అది చేస్తాను. అన్ని నిర్ణయాలు సీఈసీలో తీసుకుంటారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని రాహుల్ గాంధీ అన్నారు. త్వరలోనే అమేథీ స్థానంపై క్లారిటీ ఇస్తామని రాహుల్ చెప్పకనే చెప్పారు. కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి గెలుపొందారు. అయితే 2019లో స్మృతి ఇరానీ 55,000 ఓట్లతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిపై గెలుపొందారు. అమేథీ నుంచి స్మృతి మళ్లీ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. యూపీలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుండగా.. మే 20న అమేథీలో పోలింగ్ జరగనుంది.
*మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే.. 200 ఏళ్లు దేశం వెనక్కి పోతుంది..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు సపోర్టుగా శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా సైన్స్ కూడా వెనక్కి పోతుంది.. అప్పుడు మూఢనమ్మకాలతో కూడిన కథలకు ప్రాధాన్యత వస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆర్‌ఎస్‌ఎస్ నియమాలతో పూర్తిగా నిండిపోతుందన్నారు. అలా జరగకూడదంటే.. దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒక్కటే ఆయుధం అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువుకు వేసినట్లే అని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దుయ్యబట్టారు. అన్నాడీఎంకేకు వేసిన ఓటు రాష్ట్ర ద్రోహులకు వేసినట్లేనన్నారు. ఏఐఏడీఎంకే, బీజేపీ పార్టీలు సహజ మిత్రపక్షాలని పిలిచే వారు.. కానీ ఇప్పుడు అవి విడిపోయినట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ అవసరమైతే బీజేపీకి మద్దతు ఇస్తారా అని మీడియా ఏఐఏడీఎంకేను క్వశ్చన్ చేసినప్పుడు.. ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నాడీఎంకే మద్దతు ఇవ్వదని చెప్పలేదు.. ‘వెయిట్ అండ్ సీ’ అని ఆన్సర్ చెప్పినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీకి ఎప్పటికీ వ్యతిరేకం కాదు.. ఆ పార్టీకి ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి వేసినట్లే అని తమిళనాడు ముఖ్యమంత్రి మండిపడ్డారు.
*ఇండియా కూటమి బలంగా ఉంది.. బీజేపీని 150 సీట్లకు తగ్గిస్తాం : రాహుల్ గాంధీ
రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలం కేవలం 150సీట్లకు తగ్గుతుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం ఘజియాబాద్‌లో మీడియా సమావేశంలో అన్నారు. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెత్, బాగ్‌పట్ నుంచి ఇండియా అలయన్స్ అభ్యర్థి పండిట్ అమర్‌పాల్ శర్మ, ఎస్పీ మాజీ మంత్రి షాహిద్ మంజూర్ కూడా ఉన్నారు. అసలు సమస్యలపై ప్రధాని మాట్లాడరని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ కేవలం 150 సీట్లకు తగ్గుతుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. అదే సమయంలో అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘రామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేమిద్దరం కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉంది. యూపీలోని ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది. బీజేపీ చెప్పేవన్నీ అబద్ధమని తేలింది. రైతు ఆదాయం రెట్టింపు కాలేదు, యువతకు ఉపాధి లేదు, అభివృద్ధి హామీలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ వాటిని బట్టబయలు చేసింది. బీజేపీ అవినీతిపరుల గిడ్డంగిలా మారిందన్నారు. దోపిడి, అబద్ధాలు బీజేపీకి గుర్తింపుగా మారాయి. ఎలక్టోరల్ బాండ్‌లు తమ బ్యాండ్‌ను వాయించాయి. బీజేపీ అవినీతిపరులందరికీ గిడ్డంగిలా మారింది. అవినీతిపరులను (తన పార్టీలోకి) తీసుకోవడమే కాకుండా, వారు సంపాదించిన సొమ్మును కూడా తన వద్దే ఉంచుకుంటున్నాడు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికలు భావజాలానికి సంబంధించిన ఎన్నికలు. ఒకవైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు భారత కూటమి, కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల్లో 2-3 పెద్ద సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం అతిపెద్దది.. ద్రవ్యోల్బణం రెండవది, కానీ బిజెపి దృష్టిని మళ్లించడంలో బిజీగా ఉంది. సమస్యలపై ప్రధాని కానీ, బీజేపీ కానీ మాట్లాడడం లేదు. కొన్ని రోజుల క్రితం ప్రధాని ANIకి చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది స్క్రిప్ట్ చేయబడింది, కానీ అది ఫ్లాప్ షో. ఇందులో ఎలక్టోరల్ బాండ్లను వివరించేందుకు ప్రధాని ప్రయత్నించారు. పారదర్శకత కోసం, స్వచ్ఛ రాజకీయాల కోసమే ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు. ఇదే నిజమైతే ఆ వ్యవస్థను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందని, రెండోది పారదర్శకత తీసుకురావాలనుకుంటే బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. వారు మీకు డబ్బు ఇచ్చిన తేదీలను ఎందుకు దాచారు? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం. భారతదేశంలోని వ్యాపారవేత్తలందరికీ ఈ విషయం అర్థం అవుతుంది. ప్రధాని ఎంత క్లారిటీ ఇచ్చినా దాని వల్ల ఎటువంటి మార్పు ఉండదు, ఎందుకంటే ప్రధాని అవినీతికి ఛాంపియన్ అని దేశం మొత్తానికి తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ‘ఇది బీజేపీ వ్యక్తి నుంచి వచ్చిన ప్రశ్న, చాలా బాగుంది.. నేను ఏ ఆదేశాన్ని ఇచ్చినా పాటిస్తాను’ అని అన్నారు. మా పార్టీలో ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ సీఈసీ తీసుకుంటాయని అన్నారు.
*ఇరాన్ అదుపులో 17 మంది భారతీయులు.. ఆయన ఫోన్ కాల్ తో సమసిన వివాదం
ఇరాన్ బలగాలు ఒమన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధి దగ్గర ఏప్రిల్ 13న ఓడను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన ఈ కార్గో షిప్ ‘ఎంఎస్‌సి ఏరీస్’లో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకున్న తరువాత, సైన్యం ఈ నావికులలో ఒకరిని అతని సోదరుడితో మాట్లాడటానికి అనుమతించింది. నావికులలో ఒకరి సోదరుడు మాట్లాడుతూ, “భారత అధికారులు ఓడకు కాపలాగా ఉన్న ఇరాన్ అధికారులను కలిశారని నివేదించారు. దీని తర్వాత నా సోదరుడు నిన్న (సోమవారం) సాయంత్రం సుమారు 30 నిమిషాలు మాట్లాడాడు. సిబ్బందిని ప్రతిరోజూ ఒక గంట పాటు ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడానికి అనుమతించాలని (భారత అధికారులు) అభ్యర్థించినట్లు మేము భావిస్తున్నాము. భారతీయ నావికులు నిర్బంధంలో ఉన్నారు. ఈ సమయంలో ఎటువంటి కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతి లేదు. ఇరాన్ అధికారులు తనకు ఎటువంటి హాని చేయలేదని అతని సోదరుడు ఫోన్‌లో చెప్పాడు. వారికి తగినంత ఆహారం ఉన్నాయని మైఖేల్ చెప్పాడు. బందర్ అబ్బాస్ ఓడరేవు తీరంలో ఓడ లంగరు వేయబడింది. తాను ఎప్పటిలాగే బోర్డులో కార్యాచరణ విధులను అనుసరిస్తున్నానని చెప్పాడు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నందున వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నాం. భారత అధికారులు వారిని రక్షించి భారతదేశానికి తిరిగి రావడానికి తక్షణమే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. హార్ముజ్ జలసంధి సమీపంలో శనివారం స్వాధీనం చేసుకున్న ఓడలోని 17 మంది భారతీయ సిబ్బందిని కలవడానికి తమ దేశం త్వరలో భారత అధికారులను అనుమతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లాహియాన్.. ఇండియా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు తెలియజేశారు. జైశంకర్ పోర్చుగీస్ జెండాతో కూడిన కార్గో షిప్ ఎంఎస్ఈ ఏరీస్‌లోని 17 మంది భారతీయ సిబ్బందిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, జైశంకర్ 17 మంది భారతీయ సిబ్బంది పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరాన్ నుండి సహాయం అభ్యర్థించారు. ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన పోర్చుగీస్ జెండాతో కూడిన ఓడలో 25 మంది సిబ్బంది ఉన్నారు. దీనిని స్విస్ కంపెనీ ఆపరేషన్ కోసం లీజుకు తీసుకున్నట్లు సమాచారం. 17 మంది భారతీయుల్లో నలుగురు తమిళనాడుకు చెందిన వారు. ఓడలో ఉన్న ఇద్దరు తమిళులు తూత్తుకుడి, ఒకరు కడలూరు… ఒకరు మన్నార్గుడి నుండి వచ్చినట్లు తమిళ కమిషనరేట్ అధికారి తెలిపారు. ఓడలో ఉన్న సిబ్బందికి సమాచారం, సహాయం కోరుతూ తమిళనాడు ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఓడ పట్టుబడింది.
*బుల్లెట్ రైలులో ప్రత్యక్షమైన పాము.. 17 నిమిషాలు జర్నీ ఆలస్యం..
తాజాగా ఓ రైలులో పాము దూరడంతో 17 నిమిషాల పాటు రైలును ఆపేశారు. అయితే ఇది భారతదేశంలో కాదండి.. జపాన్ దేశంలోని శంఖం షింకన్‌సెన్ బుల్లెట్ రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిజానికి ఈ బుల్లెట్ రైలు చాలా తక్కువగా డిలే అవుతుంది. కాకపోతే., తాజాగా ఓ పాము రైలులో కనిపించడంతో షింకన్‌సెన్ సర్వీస్ ను 17 నిమిషాల పాటు ఆపేశారు. మంగళవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణ సమయంలో సుమారు 16 ఇంచులు పొడవున్న ఓ పాముని బుల్లెట్ రైల్లో ప్రజలు గుర్తించారు. టోక్యో, నగోయ మార్గమధ్యంలో ఈ పాముని కనుగొన్నారు. అయితే పామును చూసిన వారు ఆ పాము విషపూరితమైనదా లేక సాధారణ పాము అన్న విషయం తెలియక.. ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలకు ఎటువంటి ప్రాణహాని జరగలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. షింకన్‌సెన్ రైలు లోకి ప్రయాణికులు చిన్నపాటి పిల్లులు, కుక్కలు, అలాగే ఇతర జంతువులను కూడా తీసుకువెళ్లడానికి పర్మిషన్ ఉంది. కాకపోతే ఆ రైల్లో పాములను తీసుకోవడానికి ఎటువంటి అనుమతులు లేవు. ఇకపోతే అసలు పాము రైలు లోకి ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే జపాన్ రైల్వే అధికారులు ప్యాసింజర్ బ్యాగ్స్ ను చెక్ చేయమని వారు తెలిపారు. ఇకపోతే పాము కనిపించిన తర్వాత దాన్ని పట్టుకున్న తర్వాత అదే రైలును పంపిద్దామని అనుకున్నారు. కాకపోతే కంపెనీ మాత్రం మరో రైలును అక్కడికి తీసుకువచ్చి ప్రయాణికులు అందరిని అందులో తరలించింది. దీంతో మొత్తం 17 నిమిషాల పాటు బుల్లెట్ ట్రైన్ ఆలస్యంగా నడిచింది.
*ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఆయనే.. హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
తాజాగా తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన హీరో విశాల్ తమిళనాడులో 2026న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను కూడా పోటీ చేయడానికి సిద్ధమని., అలాగే కొత్త పార్టీని కూడా స్థాపించబోతున్నట్లు తెలిపిన సంగతి విధితమే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని హీరో విశాల్ తెలిపారు. రెండు రోజుల క్రితం సీఎం జగన్ పై జరిగిన రాయి ఘటనపై విశాల్ స్పందిస్తూ.. ఇది వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి పై ఇలాంటి దాడులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి దాడులను సీఎం జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని.. ఆ పరిస్థితులను తనదైన శైలిలో దాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇకపోతే తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా ఉండడం లేదని., కాకపోతే సీఎం జగన్ అంటేనే తనకి ఓ రకమైన అభిమానమని హీరో విశాల్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో విషయాలు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక విశాల్ ‘రత్నం’ అనే సినిమాతో ప్రేక్షకులకు రాబోతున్నాడు. ఇదివరకే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆయన ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యం లోనే విశాల్ హైదరాబాదులో పర్యటించిన సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన తెలిపాడు.
*గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
పసిడి ప్రియులకు శ్రీరామనవమి వేళ శుభవార్త.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. అలాగే వెండి ధర కిలో పై 500 లకు రూపాయలకు పైగా తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,130 ఉంది.. వెండి ధరలు కిలో రూ.90,000 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,130 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.74,130 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,950. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..68,110 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,280 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,950, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,130 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 90,000, ముంబైలో 86,500, ఢిల్లీలో 85,500, బెంగుళూరు లో 85,150,అదే విధంగా హైదరాబాద్ లో 90,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..