విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కీలక మలుపు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సమయంలో.. కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది.. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఫగ్గన్.. విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు.. దానికంటే ముందు ఆర్ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం అన్నారు.. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు.. వీటిపై ఆర్‌ఎన్‌ఐఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో ఈ పరిస్థితులపై చర్చిస్తాం అన్నారు.. మరోవైపు.. విశాఖ స్టీల్‌కు సంబంధించిన బిడ్డింగ్‌లో తెలంగాణలోని సింగరేణి కాలరీస్ పాల్గొనేందుకు సిద్ధం అవుతూ.. తన టీమ్‌ను కూడా స్టీల్‌కు ప్లాంట్ పంపింది.. ఇక, ఈ పరిణామాలపై స్పందించిన ఫగ్గన్ సింగ్.. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమే నని కొట్టిపారేశారు. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కార్మిక సంఘాలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి.. ప్రైవేటీకరణ అనేది సుదీర్ఘ ప్రక్రియ అయినప్పట్టికీ.. తాజాగా కేంద్ర ఉక్కశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా మారాయి.
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరిగిన తాజా పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తేల్చుకుంటానంటూ.. ఆయనకే ఫిర్యాదు చేస్తానంటూ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన.. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో సమావేశం అయ్యారు.. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన తరుణ్ చుగ్ దగ్గరకు వెళ్లారు.. ఈ సందర్భంగా మీడియా పలకరిస్తే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు.. బీజేపీ అధ్యక్షుడిని కలిసిన తర్వాత అన్ని వివరాలు చెబుతానన్నారు మహేశ్వర్‌రెడ్డి.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతూ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు మహేశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశాను.. ఎన్నో ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని పనిచేశాను.. ఎలాంటి ఆరోపణలు, మచ్చలేని చరిత్ర ఉన్న నేను.. ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు.. అయితే, కాంగ్రెస్‌లో గత కొన్ని నెలలుగా జరుగుతన్న రాజకీయ పరిణామాలను చూస్తే పార్టీలో ఇడమలేనని అర్థమైంది.. అందుకే కాంగ్రెస్‌లో ఇక ఎంత మాత్రం కొనసాగలేనని భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అంటూ.. ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి..
హరీష్‌రావు కామెంట్లకు ఏపీ మంత్రి కౌంటర్.. హాస్యాస్పదం..
తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతున్నాయి.. ఏపీ మంత్రులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్‌రావుకు కౌంటర్‌గా కామెంట్లు చేస్తున్నారు.. తాజాగా మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు.. ఏపీలో అభివృద్ధి లేదనడం ఆయన అజ్ఞానం.. ఇదే సమయంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందనడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులందరూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గానీ, చంద్రబాబు గానీ.. అందరూ రాజధానిగా భావించి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారన్న ఆయన.. ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధిలో వెనుకబడినా.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప ఇలా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.. మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు మంత్రి విశ్వరూప్.
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసు.. కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్లు..!
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని తెలిపారు. వర్చువల్ గా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు. 12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ రోజు మరో 71 వేల మందికి కేంద్ర ప్రభుత్వం లో సేవ చేసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మన యువత ప్రపంచంని శాసిస్తుందని తెలిపారు. 2047 వరకు మన దేశం విశ్వగురువుగా ఎదగాలని అన్నారు. అమెరికా లాంటి దేశాలకు సెల్ పోన్ లు ఎగుమతి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంలో మంజూరు అయిన పోస్ట్ లను భర్తీ చేయాలని నిర్ణయమన్నారు. ఆగస్ట్ లోపల అన్ని ఖాళీల భర్తీ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
బీపీపీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు.. అటు పార్కులు, రెస్టారెంట్లు బంద్..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్న సందర్భంగా అంబేద్కర్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్నారు. ఈనేపథ్యంలో.. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను శుక్రవారం మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జలవిహార్, సంజీవయ్య పార్క్, అమోఘం రెస్టారెంట్ తదితర సందర్శన స్థలాలను శుక్రవారం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కావున ప్రజలు సహకరించాలని కోరింది. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. గులాబీలు, తెల్లటి పువ్వులు మరియు తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందిస్తున్నారు. 125 అడుగుల విగ్రహానికి ఉన్న భారీ కర్టెన్‌ను తొలగించి నిలువుగా అలంకరించేందుకు భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ సన్యాసులను మాత్రమే ఆహ్వానించారు. ఈ కార్యక్రమం వారి సాంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, అధికారులు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది విగ్రహావిష్కరణ సభకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇక్కడకు తరలివచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్లు ,లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎండ వేడిమి నుంచి ప్రజలను రక్షించేందుకు షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. సభ జరిగే రోజు సామాన్య ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసు యంత్రాంగం సూచించనుంది. ఆటపాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
71 వేల మందికి ఉద్యోగాలు.. అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 10 లక్షల ఉద్యోగాలను అందజేస్తామని కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగా ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. దాదాపు 71 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. రోజ్‌గార్ మేళా 2023లో ప్రధాని ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన మొత్తం 71,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కిందకి వెళ్తుందన్నారు. దేశంలో వివిధ రంగాలు అభివృద్ది చెందుతున్నాయని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. స్టార్ట్ అప్స్, డ్రోన్ టెక్నాలజీ, క్రీడలు, స్టేడియంలు, అకాడమీలు పెరుగుతునన్నాయన్నారు. మన దేశ తయారీ దారులను ఒకప్పుడు విశ్వసించ లేదన్నారు. ఇప్పుడు విదేశాలకు ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. సెల్ ఫోన్ తయారీ ఇక్కడే జరుగుతుందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులు ఇక్కడే తయారు చేస్తున్నామని, దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని మోడీ వివరించారు.
ప్రియుడితో కలిసి ఎక్స్ లవర్‌ని కిడ్నాప్ చేసిన యువతి.. నగ్నంగా మార్చి చిత్ర హింసలు..!
కేరళలోని ఎర్నాకులంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వర్కాల సమీపంలోని అయిరూర్‌లోని తన నివాసం నుండి తన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. చెరున్నియూర్‌కు చెందిన బీసీఏ విద్యార్థిని, లక్ష్మీప్రియ(19)ని తిరువనంతపురంలోని ఆమె స్నేహితురాలి ఇంట్లో అరెస్టు చేశారు పోలీసులు.. ఏప్రిల్ 5న ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉంది. ఈ కేసులో 10 మంది నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎర్నాకులంకు చెందిన అమల్‌ను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. లక్ష్మి మరియు బాధిత యువకుడు ఇంతకుముందు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల, ఆమె చదువు కోసం ఎర్నాకులం వెళ్లింది, అక్కడ ఆమె మరొక యువకుడితో స్నేహం చేసింది. ఆ తర్వాత తన పాత బంధాన్ని తెంచుకోవాలని అనుకుంది. అయితే, అయిరూర్‌కు చెందిన వ్యక్తి లక్ష్మి డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో, ఆమె మరియు ఆమె మరో ఆరుగురు స్నేహితులు అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు అని పోలీసు అధికారి తెలిపారు. ఇంతలో, బాలిక తన కొడుకును మోసగించి కారులో తీసుకెళ్లిందని బాధితుడి తండ్రి చెప్పారు. అతను కారులోకి ప్రవేశించిన వెంటనే, ఆమె స్నేహితులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. మార్గమధ్యంలో అలప్పుజాలో ఆపి.. యువకుడి బంగారు గొలుసు, ఖరీదైన మొబైల్ ఫోన్, నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం ఎర్నాకులంలోని తమ్మనం సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. ఆ గుంపు అతడిని అక్కడే కట్టేసి కొట్టారు. అతడిని కూడా వివస్త్రను చేసి తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా విద్యుత్ షాక్ కూడా ఇచ్చారు అని బాధితుడి తండ్రి ఆరోపించారు. అనంతరం యువకుడిని వైటిళ్ల సమీపంలో వదిలి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.. కాగా, తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఆ నేరంలో తన పాత్ర లేదని లక్ష్మి తల్లి ప్రియ చెబుతున్నారు.. ఆ అబ్బాయి.. నా కూతురిని వేధించేవాడు.. అందుకే ఆమె ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. అయితే, ఆమె అతన్ని బాధపెట్టాలని అనుకోలేదు. స్నేహితులు అతన్ని కొట్టడం ప్రారంభించినప్పుడు, ఆమె వారిని ఆపమని వేడుకుంది. కానీ, వారు తన మాట వినలేదు అని ప్రియా చెప్పుకొచ్చారు.
ఆమె వయస్సు 40 ఏళ్లు.. సంతానం 44 మంది
ఆఫ్రికాకు చెందిన ఒక మహిళ 40 ఏళ్లలోపు 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆఫ్రికాకు చెందిన మరియం నబతాంజీ అనే మహిళ తన కవల పిల్లలకు జన్మనిచ్చినప్పుడు కేవలం 13 ఏళ్లు మాత్రమే. ఆమె ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన మహిళగా పరిగణించబడుతుంది. తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో నివాసం ఉంటున్న ఆ మహిళను మామా ఉగాండా అని పిలుస్తారు. ఆమెకు 12 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది.. తల్లిదండ్రులు ఆమెను విక్రయించారు మరియు ఆమె కేవలం ఒక సంవత్సరం తర్వాత తల్లి అయ్యింది. నబతాంజీ వైద్యులను సంప్రదించినప్పుడు ఆమెకు అసాధారణంగా పెద్ద అండాశయాలు ఉన్నాయని, దీని వల్ల హైపర్‌ఓవలేషన్ అనే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. గర్భనిరోధక మాత్రలు తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను కలిగిస్తాయి కాబట్టి ఆమె ఎప్పుడూ ఉపయోగించకూడదని వైద్యులు ఆమెకు సూచించారు.. ఇక, అదనంగా, నబతాంజీ యొక్క సంతానోత్పత్తి వంశపారంపర్యంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఆమె కేసు హైపర్-అండాశయానికి జన్యు సిద్ధత – ఒక చక్రంలో బహుళ అండాలను విడుదల చేయడం – ఇది బహుళ జననాల అవకాశాలను గణనీయంగా పెంచుతుంది అని కమలాలోని ములాగో హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్ డాక్టర్ చార్లెస్ కిగ్గుండు పేర్కొన్నారు. ఇంకా, స్త్రీ తన సంతానోత్పత్తిని తగ్గించడానికి ప్రసవిస్తూనే ఉండవలసిందని సమాచారం. ప్రస్తుతం ఆ మహిళ నాలుసార్లు కవలలకు. ఐదు సార్లు ముగ్గురు చొప్పున. ఐదు సార్లు నలుగురికి చొప్పున జన్మనిచ్చింది.. ఒక్కసారి మాత్రమే ఆమె ఒకే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మొత్తంగా 44 మందికి జన్మనిచ్చినప్పటికీ, అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. ఆమెకు 20 మంది అబ్బాయిలు మరియు 18 మంది అమ్మాయిలు ఉన్నారు. దురదృష్టవశాత్తు, నబతాంజీ ఒంటరి తల్లి, ఎందుకంటే ఆమె భర్త డబ్బు తీసుకున్న తర్వాత కుటుంబాన్ని విడిచివెళ్లిపోయాడు..
గూగుల్ సీఈవో సంచలన వ్యాఖ్యలు.. ఉద్యోగులకు కొత్త టెన్షన్…
టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ కొనసాగిస్తూ ఉన్నాయి.. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.. ఇక, టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరిలో ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ కు సిద్ధం అవుతుంది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.. కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అదనపు భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో మరికొంతమంది ఉద్యోగులకు ఊస్టింగ్ తప్పదనే టెన్షన్ మొదలైంది.. అయితే, టెక్నికల్ గా అనుభవం ఉన్న వారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.. కానీ, ప్రాథమిక దశలో ఉన్నవారిని భరించడం మాత్రం కష్టమని సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.. జనవరిలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆరు శాతం లేదా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, రెండవ రౌండ్ తొలగింపులు ఉండవచ్చని సూచనలు చేశారు.. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీలో త్వరలో మరిన్ని తొలగింపులు జరగవచ్చని పిచాయ్ సూచించాడు, అయితే అవకాశాలను నేరుగా ప్రస్తావించలేదు.
గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో కీలకమైన పోరుకు రెడీ అయ్యాయి.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు.. ఇవాళ ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ కు కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. రింకూ సింగ్ అద్భుతమై బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. గుజరాత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. గాయం కారణంగా దూరమైన హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. అయితే ఇవాళ జరిగే ఈ కీలక మ్యాచ్ కు పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదిక అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ మరింత ఆసక్తిరేపుతుంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ను 5 పరుగుల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో ఇరు జట్లు విజయం కోసం హోరా హోరీగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టాప్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కొనసాగుతుండగా.. మ్యాచ్ ను ఏ మాత్రమ చేజార్చుకునేందుకు ఇష్టపడని తత్వం గుజరాత్ టైటాన్స్ ది. శిఖర్ ధావన్ వర్సెస్ హార్థిక్ పాండ్యా మధ్య జరిగే ఈ ఉత్కంఠ భరిత పోరులో ఎవరినీ విజయం వరిస్తోందో చూడాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే..
అక్కడ మాత్రం ప్రభాస్, రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా…
ప్రస్తుతం ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చెయ్యాలి, ఆ మార్కెట్ ని టార్గెట్ చెయ్యాలి అనే ప్లానింగ్ తో మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు కానీ అసలు ఈ జనరేషన్ హీరోలకి, ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి 1 అండ్ 2 సినిమాలతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆరున్నర అడుగుల కటౌట్, టోన్డ్ ఫిజిక్, బ్యూటీఫుల్ చార్మ్ ప్రభాస్ సొంతం. బాహుబలి సినిమాలతో ప్రభాస్ క్రేజ్ ఇండియాలో ఏ హీరోకి లేనంత రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది, ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ప్రభాస్‌కు బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే సాహో లాంటి సినిమా తెలుగులో సోసోగానే ఆడినా హిందీలో మాత్రం వసూళ్ల వర్షం కురిపించింది. గత పదేళ్లలో మూడు వేల మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టిన ప్రభాస్, నార్త్ లో ఏకంగా ఖాన్ త్రయంతోనే పోటీ పడుతున్నాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు హిట్ అయి ఉంటే.. ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ వాల్యు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేది. బాహుబలి 2 తర్వాత రిలీజ్ చేసిన రెండు సినిమాలు ప్రభాస్ కి హిట్ ఇవ్వకపోయినా, ఈ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని మాత్రం డ్యామేజ్ చెయ్యలేకపోయాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు కదా ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’లాంటి అప్ కమింగ్ సినిమాలతో హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ తర్వాత ఆ రేంజులో గుర్తింపు తెచ్చుకున్న మరో రాజమౌళి హీరో రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ మెగా పవర్ స్టార్ ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు. ప్రభాస్-రామ్ చరణ్ లకి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. మెయిన్ గా జపాన్ లో ఈ ఇద్దరు హీరోలకి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా చరణ్… జపాన్ లో ప్రభాస్‌ను సైతం వెనక్కి నెట్టేశాడు. జపాన్‌లో ఇండియా నుంచి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోస్‌గా చరణ్, ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచారు.