రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేశాడు.. కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి..
రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బీజేపీ నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు.. జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను.. అని ఢిల్లీలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారని దుయ్యబట్టారు.. హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఆరోపించిన ఆయన.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.. అలాంటి వ్యక్తి నేడు బీజేపీ నుండి రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు.. కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు.. ఈ సారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.. అయితే, ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణి జిల్లా తొలి స్థానంలో ఉండగా.. సెకండియర్ ఫలితాల్లోనూ 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది.. ఇక, ఏపీ ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్ ఫలితాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేసి.. ఫలితాలు తెలుసుకోండి..
తొందరపాటు చర్యలొద్దు.. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు.. సెకండియర్ ఫలితాలను ఇంటర్‌బోర్డు కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఈ సారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.. మొత్తం ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు 4,99,756 మంది కగా.. మొత్తం సెకెండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు 5,02,394మంది.. అయితే, ఫస్టియర్‌లో 3,10,875 మంది విద్యార్థులే అంటే 78 శాతం మంది.. సెకండియర్‌లో 3,06,528 మంది అంటే 67 శాతం ఉత్తీర్ణత సాధించారు.. ఇక, ఒకేషనల్ ఫస్టియర్‌లో 23,181 మంది విద్యార్థులు అంటే 60 శాతం ఉత్తీర్ణత.. సెకెండ్ ఇయర్‌లో 23,000 మంది పాస్ కావడంతో 71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.. ఫస్ట్ ఇయర్‌లో 84 శాతం, సెకెండియర్‌లో 90 శాతం ఉత్తీర్ణ సాధించారు ఇంటర్ విద్యార్థులు.. సెకెండ్ ప్లేస్ గుంటూరు జిల్లా.. ఫస్టియర్‌లో 81 శాతం, సెకండియర్‌లో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ జిల్లా ఉండగా.. ఫస్టియర్‌లో 79 శాతం, సెకండియర్‌లో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, సెకండియర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. ఇక, ఇంటర్ ఫలితాలను ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్.. ఫెయిల్ అయ్యామని విద్యార్థుల బాధ పడొద్దు.. తొందరపాటు చర్యలకు పూనుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఈ సారి కూడా బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందన్న ఆయన.. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందర పాటు చర్యలు వద్దు.. అంతేకాదు.. తల్లి తండ్రులు.. ఈ విషయంలో పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు.. ఫెయిల్ అయ్యారంటూ పిల్లలను అవమానించేవిధంగా మాట్లాడొద్దన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి.. ఈ సారి బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.. ఇక, మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్.
కొనసాగుతోన్న వలసలు.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేతలు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూ.. ముఖాముఖి కార్యక్రమాలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో ముందుకు సాగుతోన్న ఏపీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మరోవైపు వలసలపై దృష్టిసారించారు.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ఉన్న అసంతృప్త నేతలను పిలిచి కండువా కప్పేస్తున్నారు.. ప్రతీరోజు ఏదో ఒక పార్టీ నుంచి నేతల వలసలు సాగుతూనే ఉండగా.. ఈ రోజు పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో సీఎం జగన్ స్టేట్ పాయింట్ దగ్గర మరికొందరు కీలక నేతలు చేరారు. తెలుగుదేశం, బీజేపీ నుంచి వచ్చిన నేతలకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, బీజేపీ నేతలు ఈరోజు వైయస్సార్సీపీలో చేరారు.. వారికి కండువాలు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. వారిలో ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ.. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి.. కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి.. బీజేపీ నుంచి మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరలు ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఆలూరు టీడీపీ నుంచి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, చిప్పగిరి మాజీ ఎంపీపీ భీమలింగప్ప చౌదరి, నియోజకవర్గ నేత షీలాధరణ్, వాల్మీకి సంఘం సీనియర్ నేత, మాజీ జెడ్పీటీసీ దేవేంద్రప్ప, వలిగొంద మాజీ ఎంపీపీ సిద్ధప్ప తదితరలు వైసీపీలో చేరారు. వారితో పాటు.. వారి అనుచరులకు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో కర్నూలు వైయస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి బీవై రామయ్య, ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
వాలంటీర్లపై చంద్రబాబుది యూటర్న్.. పొరపాటును ఆయన అధికారంలోకి వస్తే అంతే..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. వాలంటీర్లపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించిన ఆయన.. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించారు. భీమిలి రాజధాని కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ది జరుగుతుంది. కానీ, చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే రాజధానిని విశాఖపట్నం నుంచి అమరావతికి తరలించుకుపోతారని హెచ్చరించారు. ఇక, ఎన్నికల్లో రావడం.. గెలిచిన తర్వాత ముఖం చాటేయడం గంటా శ్రీనివాసరావుకు అలవాటేనంటూ సెటైర్లు వేశారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చి మాయ మాటలతో ఓట్లు చేయించుకోవడానికి గంటా వస్తున్నారు.. విశాఖపట్నం నార్త్ లో పోటీ చేస్తే డిపాజిట్లు రావని తెలిసి.. ఇప్పుడు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి మారాడు అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. కాగా, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణల్లో వరుసగా దాడులు పెంచుతోన్న విషయం విదితమే.
కూటమికి సమాజ శ్రేయస్సు కంటే.. సామాజిక ఇంట్రెస్ట్ ఎక్కువ.. !
కూటమికి సమాజ శ్రేయస్సు కంటే సామాజిక ఇంట్రెస్ట్ ఎక్కువ అంటూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై ఆరోపణలు చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.. చంద్రబాబు అంటే స్వార్థం, సొంతం తప్ప మరొకటి వుండదు.. మిగిలిన ది అంతా సొల్లే అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు మేం వ్యతిరేకం.. తమ వైఖరి ఏంటో చెప్పకుండా కూటమి అభ్యర్థులు ఎవరూ నియోజకవర్గాల్లో తిరగడానికి ఆస్కారం వుండ కూడదన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన గంటా పదవిని నిలబెట్టుకోవడానికి కోర్టుకు ఎందుకు వెళ్లారు..? త్యాగం చేసినట్టు గొప్పలు చెప్పుకుని ఎవరిని మోసం చేయాలని మీ ఉద్దేశం..? అని ప్రశ్నించారు. సివిల్ సర్వీసు అధికారులను విధుల నుంచి తప్పించాలని లేఖలు రాస్తున్నారు.. వాళ్లంతా మీ ప్రభుత్వంలో పనిచేయలేదా..? IAS, IPS లను తొలగించి ఆ స్థానంలో హెరిటేజ్ మేనేజర్లను నియమించండి అంటూ ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు తడబడుతున్నారని.. వందరోజుల మా పాలనను రెఫరెండంగా భావించి మాకు ఓటు వేయాలని అన్నారని.. ఇప్పుడు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలపై వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్ మాట మారుస్తోందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని గ్యారెంటీలు నెరవేరుతాయని చెబుతున్నారని.. ఈ మాటలు వింటుంటే బోడగుండుకు మోకాలుకు ముడి పెట్టినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు తనపై కుట్ర జరుగుతోందని మాట్లాడుతున్నాడని.. సానుభూతి పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కూడా ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేనందున ఒవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ సిద్ధం అయిందని ఆయన ఆరోపించారు.ఇది స్వయంగా ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాటల్లోనే చెప్పారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తరుపున తాను మాట్లాడుతుంటే తమ పార్టీకి నచ్చడం లేదని అంటున్నారని.. కానీ ఆ మాటలపై రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో మెసలడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. ప్రత్యర్థులకు తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ కౌంటర్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అవినీతి బయట పెడతానన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతిని బయటపెడతానని మంత్రి పొన్నం అంటున్నారు కదా, వెంటనే విచారణ చేపట్టాలి, లేకపోతే పొన్నం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము కొట్లాడేది ప్రజాసమస్యలపై అని, లాఠీ దెబ్బలు కూడా తిన్నామని, మాపై కేసులు కూడా ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్ మెడలు వంచింది తామేనని అన్నారు. కానీ ఎలాంటి ఉద్యమాలు చేయని కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయిస్తోందని.. కానీ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంత మంది మహిళల అకౌంట్‌లో డబ్బులు వేశారు, ఎంత మంది అకౌంట్స్‌లో ఆసరా పెన్షన్లు ఇచ్చారు.. ఎంత మంది రైతుల అకౌంట్‌లలో రైతు భరోసా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు లేకుండా కొనుగులు కేంద్రాలు ప్రారంభం చేశారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. వీటి మీద మాట్లాడితే ప్రజలు సంతోషిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్, కేటీఆర్‌కు లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వాళ్లకు కేవలం బండి సంజయ్‌ను ఓడించాలనే ఒప్పందం ఉందని ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రిని తిట్టినా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. .బండి సంజయ్‌ను మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి వాళ్ళకి కనబడదు, వినబడదని ఎద్దేవా చేశారు.
రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఐదు రోజులు కస్టడీకి సీబీఐ కోరింది. మరోవైపు ఎటువంటి నోటీసులు లేకుండానే తనను అరెస్ట్ చేయడం అన్యాయమని కవిత పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా సీబీఐ తెలిపింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిగాయని, కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని పేర్కొంది. ఇక ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు (రూ.15 కోట్లు ఒకసారి, రూ10 కోట్లు ఒకసారి) అందజేశారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది.
దర్యాప్తు సంస్థలపై మోడీ కీలక వ్యాఖ్యలు
గత పదేళ్ల అధికారాన్ని దేశాభివృద్ధి కోసమే ఉపయోగించామని ప్రధాని మోడీ తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకముందు కాంగ్రెస్ మాత్రం దశాబ్దాల మెజార్టీని కుటుంబాన్ని బలోపేతం చేసేందుకే ఉపయోగించిందని దుయ్యబట్టారు. ఇక జరగబోయే ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు అని మోడీ వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలకు ప్రధాని మోడీ గట్టిగా బదులిచ్చారు. అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు బీజేపీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి చర్యలే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని కొందరు కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని.. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3 శాతమే వాటికే రాజకీయాలతో సంబంధముందని తెలిపారు. మిగతా 97 శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవేనని మోడీ వెల్లడించారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన! ఆప్ సర్కార్ ఏమంటుందంటే..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 1 నుంచి జైల్లోనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో గతంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్లి ఏడాది గడుస్తున్న బెయిల్ లభించలేదు. దీంతో కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ రాకపోవచ్చని ఆప్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆప్ మంత్రి అతిష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది . అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని మంత్రి అతిషి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు హాజరు కావడం లేదని అతిష్ పేర్కొన్నారు. ప్రస్తుతం నియామకాల్లో, బదిలీల్లో స్తబ్దత నెలకొందని ఆమె ఎత్తిచూపారు. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీని తొలగించడం కూడా కుట్రలో ఇదొక భాగమేనని అతిషి అభిప్రాయపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు.
ప్రపంచకప్ కోసమే ఆడుతున్నావ్ కదా.. కార్తీక్‌ను టీజ్ చేసిన రోహిత్!
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అభిమానులు హార్దిక్ పాండ్యాను గేలి చేస్తుంటే విరాట్ కోహ్లీ అడ్డు చెప్పడం.. రోహిత్ శర్మను విరాట్ గిల్లడం.. జస్ప్రీత్ బుమ్రాకు మహమ్మద్ సిరాజ్ శిరస్సు వంచి సలాం కొట్టడం లాంటి సన్నివేశాలు జరిగాయి. అయితే అన్నింటిలోకెల్లా.. దినేశ్ కార్తీక్‌ను రోహిత్ శర్మ టీజ్ చేయడం హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చెలరేగాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్‌లో.. నాలుగు బౌండరీలతో అలరించాడు. ఈ నాలుగు బౌండరీలు కూడా థర్డ్ మ్యాన్ వైపు వెళ్లడం విశేషం. ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 2 వికెట్లు కోల్పోగా.. చివరి బంతిని డీకే సిక్సర్‌గా మలిచాడు. వెంటనే కార్తీక్ దగ్గరకు వచ్చిన రోహిత్ శర్మ.. సరదాగా టీజ్ చేశాడు. ‘ప్రపంచకప్ సెలక్షన్ కోసం ఆడుతున్నావా?.. శభాష్ కార్తీక్. ప్రపంచకప్ ఉందని మెదడులో ఆలోచనలు ఉంచుకో. త్వరలో ప్రపంచకప్ ఉంది, ప్రపంచకప్ ఉంది. ప్రపంచకప్ ఆడుతావ్’ అని నవ్వుతూ అన్నాడు.
ఐపీఎల్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 5 వికెట్ హాల్ సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ఐదు వికెట్స్ తీసిన అనంతరం ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. బెంగళూరుపై తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్ ఇచ్చి.. ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా కంటే ముందు ఎవరూ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఫైవ్ వికెట్ హాల్ సాధించలేదు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆశిష్ నెహ్రా బెంగళూరుపై 4 వికెట్స్ పడగొట్టాడు. బుమ్రాకు ఇది ఐపీఎల్‌లో రెండో ఫైవ్ వికెట్ హాల్. జేమ్స్ ఫాల్క్‌నర్, జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్‌లు ఐపీఎల్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నారు. ఇక బెంగళూరుపై అత్యధిక వికెట్లు (29) తీసిన బౌలర్‌గా మరో రికార్డు కూడా నెలకొల్పాడు. రవీంద్ర జడేజా (26), సందీప్ శర్మ (26)ల రికార్డును బుమ్రా అధిగమించాడు.
ఓటీటీలోకి రాబోతున్న రజకార్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలంగాణా చరిత్రను తెలిపే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇటీవల తెలంగాణ చరిత్ర గురించి వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యాయి.. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ రజకార్.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్ నటుడు విజయ్ తదితరులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ మొదట విమర్శలు అందుకున్నా కూడా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. తెలంగాణ విముక్తి పోరాటంలో ఎవరికీ తెలియని పరకాల జెండా ఉద్యమం, భైరాన్ పల్లి నరమేథం లాంటి సంఘటలను ఈ సినిమాలో చూపించారు. తెలంగాణకు స్వేచ్ఛ కల్పించడం కోసం నారాయణరెడ్డి, ఐలమ్మ, రాజన్న వంటి వారు చేసిన అసమాన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు.. కొందరికి నచ్చక పోయిన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమా భారీ ధరకు ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.. త్వరలోనే ఓటీటిలోకి రాబోతుందని తెలుస్తుంది.. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26 లేదా మే 3న రజాకార్ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఈ సినిమా ఓటీటీ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది…
గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘శబరి’ ట్రైలర్.. భయపెడుతున్న సన్నివేశాలు..
యంగ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల చేయబోతున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచిఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. వరలక్ష్మి శరత్ కుమార్ కు గత కొంతకాలంగా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు.. ఆ తర్వాత కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. సర్కార్ వంటి పెద్ద సినిమాల్లో సూపర్ విలనిజం చూపించింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ ను వదిలి టాలీవుడ్ పై ఫోకస్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ అయింది. యశోద, వీర సింహారెడ్డి,రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అదే జోష్ లో ఇప్పుడు లీడ్ లో నటిస్తుంది.. శబరి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటుంది.. హీరో వరుణ్ సందేశ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ఆ ట్రైలర్ లోని సీన్స్ భయపెడుతున్నాయి.. సరికొత్త సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ ఓ రేంజులో ఉంది.. చనిపోయిన వ్యక్తి బ్రతికి ఎలా వస్తుంది అనే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.. చివర్లో వరలక్ష్మి శరత్ కుమార్ డ్యూయల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.. ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం ఆసక్తిగా ఉన్నాయి.. ఇక సినిమా ఏ విధంగా భయపెడుతుందో తెలియాలంటే మే 3 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమానికి నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..