నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజ్ నీటిమట్టం..
నాగార్జున సాగర్ లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది.. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా.. సాగర్‌లోకి నీరు రావడం లేదు.. కృష్ణా బేసిన్‌లో ఇన్‌ప్లో అంతంత మాత్రంగానే ఉండడంతో.. ఇప్పటి వరకు నాగార్జున సాగర్‌కు నీరు వచ్చింది లేదు.. నాగార్జున సాగర్ నీటిసామర్థ్యం 319 టీఎంసీలకు గాను, ప్రస్తుతం కేవలం 122 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది.. సాగర్ లో 590 అడుగులకు గాను ,504 అడుగుల నీటి మట్టం పడిపోయింది.. దీనిని అధికారులు డెడ్ స్టోరేజ్‌గా పరిగణిస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీటికి అత్యవసర పరిస్థితులు వస్తే, 490 అడుగుల నీటిమట్టంలోనూ రైట్ కెనాల్ కు నీరు వదిలే అవకాశం ఉంది.. కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకుంటే తప్ప కిందకి నీరు వదల్లేమని అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున సాగర్ కు నీటి వనరులు వచ్చే అవకాశం లేదని, సాగునీటి విడుదలకు అవకాశాలు లేవంటున్నారు అధికారులు.. ఎగువ ప్రాంతం నుండి చుక్క నీరు రాకపోవడంతో నాగార్జున సాగర్ వెలవెలబోతోంది. దీంతో, సాగర్ పరివాహ ప్రాంతంలో నీటి కటకట తప్పడంలేదు.
జగన్ ట్వీట్.. టీడీపీ కౌంటర్ ఎటాక్
ఈవీఎంలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఎక్స్ పోస్ట్ (ట్వీట్)కు కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ నేతలు.. జగన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.. ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు.. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? అని నిలదీశారు.. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. పరనింద.. ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఇక, జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా..? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతావా..? అంటూ ట్విట్టర్‌లోనే నిలదీశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. జగన్ పులివెందులకు రాజీనామా చేస్తే.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని అందరం ఈసీని కోరదాం… ఆ ఉప ఎన్నికల్లో అసలు గెలుస్తావో లేదో..? మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, చూద్దాం..! అంటూ సవాల్ చేశారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలి అంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న..
పవన్ కల్యాణ్‌కు భద్రత పెంపు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భద్రతపు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.. పవన్ కల్యాణ్‌కు వై ప్లస్ సెక్యూరిటీ కేటాయించారు.. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు.. ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది సర్కార్.. కాగా, ఈ రోజు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత.. తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.. అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు జనసేనాని.. మరోవైపు.. ఈ రోజు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు పవన్.. అక్కడ తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు.. కాగా, రేపు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే. బుధవారం రోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు పవన్ కల్యాణ్.. ఇక, విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత.. మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మధ్యాహ్నం సెకండ్ బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించేందుకు సచివాలయానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ తరుణంలో ఆయన భద్రతకు భరోసానిస్తూ, ముందస్తు చర్యగా.. ఆయనకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌కు బెదిరింపు కాల్స్.. రాజీనామా చేయాలని వార్నింగ్..!
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ఉన్న వీవీజీ ప్రసాద్ రెడ్డి , రిజిస్ట్రార్‌గా ఉన్న జేమ్స్ స్టీఫెన్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.. వెంటనే తమ పదవికి రాజీనామా చేసి.. తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చారట ఆగంతకులు.. దీంతో.. విశాఖ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏయూ అధికారులు.. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాల్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.. ఇక, బెదిరింపుల నేపథ్యంలో.. యూనివర్సిటీకి పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలని మూడో పట్టణ పోలీసులకు కోరారు ఏయూ అధికారులు. కాగా, ఏయూలో గోల్‌మాల్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి.. యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలను కూడా వీసీ వ్యాపారం చేశారని కొందరు ఆరోపించారు.. లక్షలాది రూపాయలు తీసుకుని పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారంటూ.. స్వయంగా వర్సిటీలో పనిచేసే ఓ సీనియర్ ప్రొఫెసర్ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం విదితమే.
చంద్రబాబు విజన్, పవన్ కల్యాణ్ ఆలోచన, మోడీ అండతో.. రాష్ట్ర అభివృద్ధి
సీఎం చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన, ప్రధాని నరేంద్ర మోడీ అండతో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం అన్నారు ఏపీ రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. బాపట్ల జిల్లా రేపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014-2019 మధ్యకాలంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మిన్నగా 2024 నుంచి ఏర్పడిన కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేస్తాం అన్నారు.. ప్రధాని మోడీ అండతో రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేస్తాం.. ఇప్పుడున్న కలయికతో పోలవరం, అమరావతిలో త్వరగా పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు మంత్రి అనగాని.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అండతో తీర ప్రాంతమైన రేపల్లెను కూడా అభివృద్ధి చేస్తా అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాకతో రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఆయన.. జగన్‌కు విలాసవంతమైన భవనాల పిచ్చి ఉంది .. భీమిలి ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలను కొల్లగొట్టి ఋషికొండను అభివృద్ధి చేశామని చెబుతున్నారు.. ఋషికొండపై ఆ పార్టీ నాయకులకే సరైన అభిప్రాయం లేదన్నారు.. ఋషికొండను ధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ భవనం కట్టాలంటే నియమ నిబంధనలు ఉంటాయని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉంది..
మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు బయటకీ వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు డైవర్ట్ చేసే పనిలో పడ్డారన్నారు. పైసా పెట్టుబడి లేకుండా విద్యుత్ అందించే ప్రక్రియ కేంద్రం చేస్తే.. దాన్ని కాదని… కేసీఆర్ యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టారన్నారు. మూడు రూపాయలకు యూనిట్ వచ్చే కరెంట్ వదిలి.. 6 రూపాయలకు కొంటారా..? అని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తి కోసమే పవర్ ప్లాంట్ అని మండిపడ్డారు. నామినేషన్ మీద యాదాద్రి పనులు ఎందుకు అప్పగించారు? అని అడిగారు. టెండర్ ప్రక్రియ ఎందుకు పిలవలేదన్నారు. హరీష్ రావు.. అవినీతి చర్చ పక్కదారి పట్టించే పనిలో ఉన్నారన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతి… కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందన్నారు. హరీష్ విజ్ఞతతో మాట్లాడని మండిపడ్డారు. పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారు మీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు వల్లనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అని మండిపడ్డారు. ఆర్థిక శాఖ లూటీ చేసింది నువ్వే కదా? అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు. నువ్వు లూటీ చేసి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారో చేయండి అన్నట్టు ఉంది హరీష్ వ్యవహారం అని నిప్పులు చెరిగారు. ఆర్థిక స్థితి గతులు చక్కబెట్టే పనిలో ఉన్నారు సీఎం అన్నారు. మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉందని క్లారిటీ ఇచ్చారు.
నీట్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
NEET-UG 2024లో పేపర్ లీక్‌లు, అవకతవకలకు సంబంధించిన పిటిషన్‌లను విచారించిన సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. ఎవరైనా చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నీట్ కేసులో అమూల్య విజయ్ పినపాటి, నితిన్ విజయ్ తరపున పిటిషన్ దాఖలైంది. నీట్ పేపర్ల లీకేజీపై విచారణ జరిపించాలని పిటిషన్‌లు కోరాయి. ఈ కేసును జులై 8న సుప్రీంకోర్టు విచారించనుంది. లక్షలాది మంది చిన్నారులకు సంబంధించిన అంశం కాబట్టి అక్రమాలు జరిగాయా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్టీఏ సకాలంలో తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఈ పొరపాటు వల్ల ఎవరైనా వైద్యులైతే.. సమాజానికి ఎంత హానికరమో ఆలోచించమని కోర్టు పేర్కొంది.
రూ.లక్ష కోసం మళ్లీ పెళ్లికి రెడీ అయిన పెళ్లయిన 20జంటలు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు. అంతేకాదు వారిలో కొందరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ ఈ సామూహిక వివాహాన్ని నిర్వహించింది. అలాంటి జంటలు పట్టుబడిన వెంటనే వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దుర్గ్‌లోని ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ 300 మంది వికలాంగ జంటలకు సామూహిక వివాహాన్ని నిర్వహించింది. ఈ సంస్థ ఇప్పటికే వందలాది మంది యువతీ యువకులకు వివాహాలు జరిపించింది. ఈసారి ఒక్కో జంటకు ఇన్‌స్టిట్యూట్ నుంచి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా, అంబికాపూర్, సూరజ్‌పూర్, బిలాస్‌పూర్, బస్తర్‌లకు చెందిన పలువురు దంపతులు దుర్గ్‌కు చేరుకున్నారు.
27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్‌టైమ్’ రికార్డు బ్రేక్!
టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. ఎస్తోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆరు టీ20 సిరీస్‌లో భాగంగా సోమవారం ఎపిస్కోపి వేదికగా సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహిల్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ. అంతేకాదు పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ (33 బంతుల్లో) రికార్డును సాహిల్ చౌహాన్ అధిగమించాడు. 2024 ఫిబ్రవరి 27న నేపాల్‌పై జాన్ నికోల్ 33 బంతుల్లో శతకం బాదాడు. 27 బంతుల్లోనే సెంచరీ చేసిన సాహిల్.. జాన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్ చరిత్రలోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (30 బంతుల్లో) రికార్డును సాహిల్ బ్రేక్ చేశాడు. 2013 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ.. పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో గేల్ సెంచరీ చేశాడు.
సూపర్-8లో భారత్ వ్యూహం ఇదే: జడేజా
టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఎస్‌ఏలోని డ్రాప్-ఇన్ పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడిన టీమిండియా.. ఇక నుంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే విండీస్‌లో ఆడనుంది. విండీస్ పిచ్‌లు బ్యాటర్లకు మాత్రమే కాదు స్పిన్నర్లకూ మంచి సహకారం అందిస్తాయి. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అంగీకరించారు. మిడిల్, డెత్ ఓవర్లలో స్పిన్ ఎటాక్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తాం అని వారు వెల్లడించారు. సూపర్-8కు ముందు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో రవీంద్ర జడేజా మాట్లాడుతూ… ‘విండీస్‌లో పిచ్‌లు చాలా నెమ్మదిగా, మందకొడిగా ఉంటాయి. మ్యాచ్‌లు అన్ని ఉదయం కావడంతో స్పిన్నర్లకు అక్కడ మంచి సహకారం లభిస్తుంది. భారత్‌లో మాదిరిగానే విండీస్ పిచ్‌లు స్పిన్ ఫ్రెండ్లీ. మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. స్పిన్నర్లతో డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయించే అవకాశం లేకపోలేదు’ అని తెలిపాడు. భారత్ నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పెసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఈ సారి దేవరలో రొమాంటిక్ యాంగిల్ ను చూపించబోతున్న కొరటాల..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర” ..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ”జనతా గ్యారేజ్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీనితో దేవర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సీఎంఎంలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.తాజాగా ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి త్వరలోనే మరో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయిన “ఫియర్ సాంగ్ ” ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.మొదటి సాంగ్ లో దేవర ఊచ కోత చూపించిన కొరటాల ,సెకండ్ సాంగ్ లో దేవర లో రొమాంటిక్ యాంగిల్ ను చూపించనున్నారు.ఎన్టీఆర్ ,జాన్వీ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.
డిసెంబర్ లో మంచు విష్ణు కన్నప్ప రిలీజ్..?
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా “కన్నప్ప”.ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడం విశేషం.ఈ సినిమాను మహాభారతం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అవా ఎంటర్టైన్మెంట్స్ ,24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివ రాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరియు స్టీఫెన్ దేవసి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ టీజర్ 7 మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.ఇదిలా ఉంటే ఈ సినిమాను మంచు విష్ణు డిసెంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ చిత్రం వీఎఫెక్స్ పూర్తయితేనే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.లేకపోతే వచ్చే ఏడాదిలోనే విడుదల సాధ్యం కానుంది.అయితే ఈ సినిమా టీజర్ బాగున్న కూడా విఎఫ్ఎక్స్ వర్క్ పై ట్రోల్స్ రావడంతో దానిపై విష్ణు పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.