Today Business Headlines 03-05-23:
భోగాపురానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రారంభ దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా, భవిష్యత్తులో ఏడాదికి కోటీ 80 లక్షల మంది రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
గిగ్ వర్కర్లను ఆదుకుంటాం
గిగ్ వర్కర్లకు సరికొత్త విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఇ కామర్స్ సంస్థలు మరియు వారి సప్లయర్లతో సర్కారు త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవటం ద్వారా గిగ్ వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. తాము రూపొందించబోయే విధానం దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని అన్నారు. తెలంగాణ అమలుచేస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనేది దీంతో మరోసారి రుజువు కావాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు.
రికార్డ్ లెవల్ టోల్ కలెక్షన్
నేషనల్ హైవేలు మరియు స్టేట్ హైవేలపై ప్రయాణించే వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్‌కి సంబంధించి సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ 29వ తేదీన ఒకే రోజు 193 పాయింట్ ఒకటీ ఐదు కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ తెలిపింది. ఆ రోజు జరిగిన లావాదేవీల సంఖ్య ఒకటీ పాయింట్ ఒకటీ ఆరు కోట్లు అని వెల్లడించింది. టోల్ ప్లాజాల సంఖ్య 770 నుంచి 12 వందల 28కి పెరిగాయని పేర్కొంది. ఇందులో 339 టోల్ ప్లాజాలు తెలంగాణ రాష్ట్ర రహదారుల్లో ఏర్పాటుచేసినవేనని స్పష్టం చేసింది.
హెచ్ఐవీ బాధిత పిల్లలకు
హెచ్ఐవీతో బాధపడే పిల్లలకు ట్రీట్మెంట్‌లో ఉపయోగించే డోలుటెగ్రావిర్ అనే మెడిసిన్‌కి తాత్కాలిక ఆమోదం లభించింది. అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఈ పర్మిషన్ ఇచ్చినట్లు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 5 మిల్లీగ్రాములు, 10 మిల్లీగ్రాముల డోసులో ఈ మందు అందిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలియజేసింది. ఈ ఔషధం వల్ల హెచ్ఐవీ బాధిత పిల్లలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.
‘యూకో’ లాభం అదుర్స్
యూకో బ్యాంక్ గతంలో ఎన్నడూలేనివిధంగా రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 వందల 62 కోట్ల రూపాయల ప్రాఫిట్ నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం 930 కోట్లు మాత్రమే లాభం పొందింది. బ్యాంక్‌కు వచ్చిన నికర వడ్డీ 6 వేల 473 కోట్ల నుంచి 7 వేల 343 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు ఒక ఏడాదిలో ఆర్జించిన అత్యధిక నికర వడ్డీ ఆదాయం కూడా ఇదే కావటం గమనించాల్సిన అంశం.
దివాలా తీసిన ‘గోఫస్ట్’
గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ దివాలా తీసింది. పరిష్కారం చూపాలంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. ఈ కంపెనీ కష్టాలు ఇక్కడితో అయిపోలేదు. రేపటి నుంచి మూడు రోజుల పాటు విమాన సర్వీసులను రద్దు చేసింది. అందుబాటులో నిధులు లేకపోవటం వల్ల చేసేదేమీ లేక ఈ నిర్ణయం తీసుకుంది. అకస్మాత్తుగా సర్వీసులను రద్దు చేయటం పట్ల ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. ఈ నెల మూడు, నాలుగు, ఐదు తేదీలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్నవారికి పూర్తిగా రిఫండ్ చేయనున్నట్లు వెల్లడించింది.