తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈరోజటితో ముగియనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.82 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో హుండీ కానుకలు భారీగా వస్తున్నాయి. భక్తుల రద్దీ కూడా భారీగానే ఉంది. శనివారం సాయంత్రానికి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ 2లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు.
ఈ ఏడాది 6.82 లక్షల మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్నారు. 2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022లో 3 లక్షల 78 వేల మంది భక్తులు.. 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.