ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి మహోగ్ర రూపాన్ని తలపిస్తుంది. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి వరద ప్రవహిస్తుండగా.. ధవళేశ్వరం వద్ద మూడోవ ప్రమాద హెచ్చరికకు చేరువగా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ధవళేశ్వరం బ్యారేజి వైపు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి భారీ వరదతో నీటిమట్టం 16 అడుగులకు చేరింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. 17.75 అడుగులకు నీటిమట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు బ్యారేజి నుంచి 16 లక్షల 20 వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో విషాదం..నిముషాల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు,5 మంది మృతి..
ఇప్పటికే రాజమహేంద్రవరం సమీప బ్రిడ్జిలంక, పాత బ్రిడ్జిలంక, కేతావానిలంక, ఎదుర్లమ్మలంకల నుంచి 121 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరి వరద ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని సుమారు 2,500 కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. గోదావరి వరదలు తీవ్రరూపం దాల్చడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని నదీ పరీవాహక లంక గ్రామాలు జలదిగ్భందానికి గురయ్యాయి. అనేకప్రాంతాలకు రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. అంతేకాకుండా పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాల్లో, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం గ్రామంలోని పల్లిపాలెం ప్రాంతాల్లో ఇళ్లచుట్టూ వరదనీరు చేరింది.