Mirai VFX : టీజీ విశ్వప్రసాద్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్‌ఆర్‌ఐగా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా 50 సినిమాలు దాదాపు పూర్తి చేశారు. అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే, చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, మరోపక్క ఇతర బిజినెస్‌లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో తనకు గట్టి ప్లానింగ్ ఉందని, సినీ పరిశ్రమలో తాను చేసే ప్రతి సినిమా విషయంలో తనకు సరైన అవగాహన ఉందని చెబుతూ వచ్చారు. అయితే, పూర్తిగా ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌తో రూపొందించిన మిరాయ్ సినిమా మిరాకిల్స్ సృష్టిస్తోంది. సినిమాకి మంచి రివ్యూస్ రావడమే కాదు, కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలోని విఎఫ్‌ఎక్స్ వర్క్ గురించి ప్రేక్షకులు గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే, 60 కోట్ల బడ్జెట్‌లో ఇంత మంచి టెక్నికల్లీ సౌండ్, విజువల్లీ బ్రిలియంట్ ఫిల్మ్ ఎలా తీసుకొచ్చారనే విషయం మీద చర్చ జరుగుతోంది.
READ MORE: India vs Pakistan: మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. బ్యాట్‌లతో టీవీలు ధ్వంసం..
అయితే, చాలామందికి తెలిసే ఉంటుంది, విశ్వప్రసాద్ ఈ సినిమా కోసమే ఒక సీజీఐ కంపెనీ ప్రారంభించారు. దానికి డెక్కన్ డ్రీమ్స్ అనే పేరు కూడా పెట్టారు. సురేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఈ సంస్థ కోసం చాలామంది యంగ్‌స్టర్స్‌ని, ఈ క్రాఫ్ట్‌లో అనుభవం ఉన్నవారిని హైర్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్‌ఎక్స్ వర్క్ అంతా హైదరాబాదులోనే, డెక్కన్ డ్రీమ్స్ ఆఫీస్‌లోనే జరిగింది. మిరాయ్ టీమ్‌కి, సీజీ టీమ్‌కి సరైన రిసోర్సెస్ ఇవ్వడంతో సినిమాకి మంచి అవుట్‌పుట్ లభించింది. దీంతో, ఈ సినిమాకి చేసిన సీజీ టీమ్ ప్రభాస్ *రాజా సాబ్*కి కూడా పనిచేస్తుందనే విషయం తెలిసి, ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది నిర్మాతలు ఫారెన్ టెక్నీషియన్లు, ఇతర ఫారెన్ విఎఫ్‌ఎక్స్ కంపెనీల మీద ఆధారపడుతున్న సమయంలో, విశ్వప్రసాద్, సురేష్ బాబు కలిసి లోకల్ టాలెంట్‌ని బయటకు తీసుకొస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి అవుట్‌పుట్ ఇచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయం అని చెప్పాలి.