TG Venkatesh: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక టీజీ వెంకటేష్.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చేయలేక పోయారని దుయ్యబట్టారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత హైకోర్టు కోసం పోరాడవచ్చన్న ఆయన.. చంద్రబాబు రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముందుగానే అడుగుతున్నాం అన్నారు. ఏ పార్టీ అయినా సరే రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. లేకపోతే తెలంగాణలో మాదిరిగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Kedarnath Temple: నేటి నుంచి కేదార్‌నాథ్ దర్శనం.. తొలి పూజలో పాల్గొన్న ‘పుష్కర్ సింగ్ ధామీ’..
ఇక, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలి.. మరికొన్ని రిజర్వాయర్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ లు అవసరం.. లేకపోతే రాయలసీమలో మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు టీజీ వెంకటేష్.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీటిని అక్కడ ఇవ్వండి.. శ్రీశైలం జలాలు రాయలసీమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక.. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక నేత టీజీ వెంకటేష్.