Telangana Assembly Elections 2023: ఓటును నోటుతో కొనే పర్వం పతాకస్థాయిలో చేరుతోంది. నడి బజారులో ఓటనే వజ్రాయుధాన్ని చిల్లర పైసలకు కొనే సామదాన దండోపాయం భీకరంగా సాగుతోంది. నోట్ల కట్టలతో ఐదేళ్ల ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టే బేరం రంజుగా జరుగుతోంది. ఏ ఒక్క ఓటునూ వదులుకోవడానికి సిద్దంగాలేని అభ్యర్థులు ధనాన్ని వెదజల్లేందుకు వెనకాడ్డం లేదు. పోటాపోటీ రాజకీయంలో ప్రతీ ఓటు కీలకమైనదని భావిస్తున్న అభ్యర్థులు.. ఏ చిన్న అవకాశాన్నీ మిస్ చేసుకోవడానికి రెడీగా లేరు. వచ్చే ఐదేళ్ల కాలానికి కీలకమైన ఈ రెండు రోజుల్లో ప్రతీ క్షణాన్ని ఎంతో విలువైనదిగా లెక్కకడుతూ ఓటుకు నోటు చొప్పునా కొనేస్తున్నారు. అలా ప్రచారపర్వం ముగిసిందో లేదో నోట్ల సంచులు, ఓటర్ల జాబితాను వెంటబెట్టుకుని ఇల్లిళ్లు తిరగడం మొదలుపెట్టారు.
కులసంఘాలు, మహిళా సంఘాలను ఆకట్టుకునేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. డబ్బు, మద్యం, మాంసం, బంగారం ఇలా వారు ఏది కోరితే వాటిని ఇచ్చేందుకు డబ్బులు వెదజల్లుతున్నారు. గంపగుత్తగా ఓట్లు వేయించుకునేలా కుల సంఘాలపై కాసుల వల కురిపిస్తున్నారు. ఓటర్ల సంఖ్యను బట్టి సింగిల్ పేమెంట్ తో సెటిల్మెంట్ చేసుకునేందుకు సై అంటే సై అంటున్నారు. పంపకాల సమయంలో పోలీసులు, ఇతర ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు చిక్కకుండా ఉండేందకు పకబ్బందీ ఏర్పాట్లు సెట్ చేసుకుంటున్నాయి.
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల క్రాస్ రోడ్ దగ్గర ఓ కారులో పెద్ద ఎత్తున డబ్బు సంచులు లభ్యమయ్యాయి. బీఆర్‌ఎస్ నేతలు.. కారులో డబ్బులు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. కాంగ్రెస్ నాయకులు కారును అడ్డగించారు. కారులో 5 వందలు, 2 వందల నోట్ల కట్టలు ఉన్న బ్యాగులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీయగా.. సీఐ అంజిత్ రావు పేరుతో ఉన్న ఐడీ కార్డు లభ్యమైంది. పోలీసు అయ్యి ఉండి బీఆర్‌ఎస్ తరఫున డబ్బులు పంచుతున్నారన్న కోపంతో.. సీఐ అంజిత్‌రావుపై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. వెంటనే సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు.. డబ్బును, కారును స్వాధీనం చేసుకున్నారు. అంజిత్‌రావు వరంగల్ అర్బన్ సీఐగా చెబుతున్నారు. దొరికిన డబ్బు మంత్రి మల్లారెడ్డికి చెందినదిగా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
అన్ని చోట్లా 144 సెక్షన్ అమల్లో ఉన్నా.. నేతలు, పార్టీల కార్యకర్తలు క్యాష్ కొట్టు.. ఓటు పట్టు అన్నట్టుగా పావులు కదుపుతున్నారు. ఇక ఓటర్లను మద్యం మత్తులో నింపేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాపులు బంద్ అయ్యాయి. సీ విజిల్ ద్వారా ఎవరు ఫిర్యాదు చేసినా, వెంటనే యాక్షన్ తీసుకుంటున్నామని ఈసీ చెబుతోంది! ప్రలోభాలకు గురిచేసినా, డబ్బు, మద్యం, ఇతరాత్ర ఏమైనా ఉంటే నిర్భయంగా కంప్లయింట్ చేయవచ్చని ఎన్నికల కమిషన్ కోరుతోంది! డబ్బు, మద్యం పంపిణిపై ఈసీ గట్టి నిఘా పెట్టింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల తనిఖీ ముమ్మరంగా సాగుతోంది. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. ఫోర్ వీలర్, టూ వీలర్ తేడా లేకుండా తనిఖీ చేస్తున్నారు. ఈసీ నిబంధనల మేరకు నాన్ లోకల్స్, నియోజకవర్గానికి చెందని నేతలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో డబ్బులు పంచుతున్నారంటూ ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేశారు బండి సంజయ్. అటు గోషామహల్ లోనూ రాజాసింగ్ ఇలాంటి ఆరోపణలే చేశారు.
అన్ని పార్టీలకూ సైలెంట్ డే రోజు కీలకంగా మారనుంది. ఓటర్ మూడ్‌ను బట్టి అన్ని పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే చాలా మంది నేతలు పంపకాలపై దృష్టిపెట్టారు. దీంతో నోట్ల కట్టలు దొడ్డిదారి పట్టాయి. ఇప్పటికే పోలీస్, ఐటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 720 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఎక్కడికక్కడ నగదు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయినా… సోదాల్లో గుట్టలు గుట్టలుగా నగదు పట్టుబడుతోంది. తనిఖీల్లో తెలంగాణవ్యాప్తంగా 720కోట్లకు పైగా నగదు పట్టుకున్నారంటేనే ఏ స్థాయిలో డబ్బులు సమకూర్చుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. 125కోట్ల మద్యం, 40కోట్ల డ్రగ్స్, 186కోట్ల మెటల్స్, 84కోట్లు ఉచిత బహుమతులను సీజ్ అధికారులు సీజ్ చేశారు. అసలే ఇవాళ సైలెంట్ డే.. రేపు పోలింగ్ కావడంతో.. ఇంకా ఎక్కువగా పంపకాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు.. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. ఫోర్ వీలర్, టూ వీలర్ తేడా లేకుండా తనిఖీ చేస్తున్నారు. దీంతో.. 24 గంటల వ్యవధిలో సుమారు 20 కోట్ల నగదు పట్టుబడింది. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. దాన్ని సంతలో సరుకులా అమ్ముకోవద్దని చెబుతున్నారు సామాజిక వేత్తలు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటనే అస్త్రాన్ని నోటుతో వదులుకోవద్దని సూచిస్తున్నారు. ఇప్పడు వెయ్యి, రెండు వేలు, ఐదు వేలకో ఓటును అమ్ముకుంటే ఐదేళ్లూ దోచుకుంటారని.. అప్పుడు వారిని నిలదీసే నైతిక హక్కును కోల్పోతారని అంటున్నారు. మన విలువైన ఓటును సారా చుక్కకు, మాంసపు ముక్కకు, కాసుల నోటుకు అమ్ముకోవద్దని సూచిస్తున్నారు.