తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి గెలిచారు. విజయం అనంతరం హుజురాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈటెలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని.. కౌశిక్‌తో ఇలాగే ఉంటదన్నారు.
‘నా గెలుపుకు కారణమైన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఈటెల రాజేందర్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. మోసం చేయడం ఈటెల నైజం. మా నాన్నను జడ్పిటిసీగా నిలబెట్టి మోసం చేసాడు. ఈ గెలుపు మా తండ్రికి అంకితమిస్తున్నా. ఈటెలా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను.. కౌశిక్‌తో ఇలాగే ఉంటది. హుజురాబాద్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇక వారికి సేవ చేసుకుంటా’ అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
బీజేపీ తురుపుముక్క ఈటల రాజేందర్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి చేతిలో ఏకంగా 17వేల ఓట్ల (17,158 ఓట్లు) మెజారిటీతో ఓడారు. దాంతో హుజూరాబాద్‌లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్‌ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలో నిలవగా.. అక్కడా చుక్కెదురైంది. ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది.