తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్తారు.. అయితే, నిన్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై నేడు హైకమాండ్ పెద్దలతో సీఎం చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో పార్టీ అధిష్టానానికి ఆయన చెప్పనున్నారు. ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతరులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపైనా కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది.
Read Also: Nizamabad: వరుస హత్యల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు..
అయితే, ప్రధానంగా ఆరు మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక, ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి తిరిగి హైదరాబాద్ రాననున్నారు. ఒక్కరోజులోనే చర్చలన్నీ ముగియనున్నాయి. కాగా, ఈసారి గెలిచిన నేతలకే కాకుండా.. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తారని సమాచారం.. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్, నిజామాబాద్ లో షబ్బీర్ అలీ లాంటి వారికి ప్రాధాన్యం ఉంటుందని టాక్. తద్వారా మైనార్టీలకు పార్టీ మరింత దగ్గరవుతుందనే అంచనాలో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. అయితే, ఆశావహులు మాత్రం ఎక్కువగానే ఉన్నారు.