Leopard Attack: తిరుమలలో చిన్నారి లక్షితను బలితీసుకున్న చిరుతలు.. ఇప్పటికీ అక్కడక్కడ సంచరిస్తూ కలకలం రేపుతూనే ఉన్నాయి.. తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. అయితే, తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయన్న ఆయన.. వైసీపీలో పుష్పాలు ఎక్కువయ్యారు అంటూ విమర్శించారు. వైసీపీ పుష్పాలు ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా చేస్తున్నారు.. ఎర్ర చందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయన్నారు. చిరుత పులిని తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట అని ఎద్దేవా చేశారు. ఆ రూళ్ల కర్రలతో భక్తులు ప్రభుత్వానికి బడితే పూజ చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక రూళ్ల కర్ర ఇస్తామంటారా..? అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి మాటలు.. తుగ్లక్ చేష్టలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బోండా ఉమ.
ఇక, మేం విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం.. వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తుందని విమర్శించారు బోండా ఉమ.. అభివృద్ధి ఎలా చేయాలో అనేది మా విజన్ డాక్యుమెంట్.. ఎంత మంది జైళ్లకి పంపాలోననేది వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ అని దుయ్యబట్టారు.. వైసీపీకి విజన్ అంటే అర్థమే తెలియదన్న ఆయన.. అబద్దాలు చెప్పే వైసీపీ అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు అవినీతి చేశాడంటున్న వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లు ఏం పీకారు..? అంటూ మండిపడ్డారు. ఒక్క రూపాయైనా చంద్రబాబు అక్రమంగా దోచుకున్నారని వైసీపీ ఎందుకు నిరూపించ లేకపోయింది.. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారనే సొల్లు పురాణం ఎన్నాళ్లు చెబుతారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఎంక్వైరీలు వేసుకున్నా చంద్రబాబు కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయారు. చంద్రబాబు ఏదైనా తప్పు చేస్తే.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ ఊరుకునేవాడా..? చంద్రబాబు 420 నా.. అయితే వైసీపీ వాళ్లంతా 840 గాళ్లు… ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్ల మేర దోచుకున్నారు. తాగుబోతుల జేబులను కొట్టేసే వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా..? అంటూ విరుచుకుపడ్డారు.
సీఎం వైఎస్ జగన్ పని అయిపోయింది.. అందుకే అబద్దాలు చెప్పి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు బోండా ఉమ.. సీఎం వైఎస్ జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమే. నవరత్నాలు అంటూ నవ మోసాలు చేశారన్న ఆయన.. పది మందికిచ్చి.. 90 మందికి పథకాలు ఎగ్గొట్టారని ఆరోపించారు.. ఒంటి మీద మంచి బట్టలున్నా.. పథకాల్లో కోత వేశారంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.