Father kills daughter for marrying a poor man in Tamil Nadu: తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన మూడో రోజే ఓ యువ జంటను కొందరు అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో పోలీసులు అనుమానించిందే నిజమైంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె తండ్రే హత్య చేశాడు. పేదవాడిని పెళ్లి చేసుకున్నందుకే తన కుమార్తెను హత్య చేశానని తండ్రి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం… తమిళనాడు తూత్తుకూడి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన మారి సెల్వం (24), కార్తిక (20)లు గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండేందుకు.. పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని కార్తిక తన కుటుంబ సభ్యులకు తెలపగా వారు ఒప్పుకోలేదు. సెల్వం తక్కువ కులానికి చెందినవాడని, పేదవాడిని యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న సెల్వం, కార్తిక.. మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయి ఓ గుడిలో వివాహం చేసుుకున్నారు. ఈ విషయం కార్తిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు.
పెళ్లి అనంతరం సెల్వం, కార్తికలు మురుగేషన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న కార్తిక తండ్రి ముత్తు రామలింగం వారిని చంపేందుకు ప్లాన్ వేశాడు. గత అర్ధ రాత్రి ఐదుగురు యువకులతో సెల్వం, కార్తికలు ఉంటున్న ఇంటికి వెళ్లి దాడి చేశాడు. అందరూ కలిసి కత్తులతో యువ జంటను పొడిచి చంపేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి ఒంటిపై 12, యువకుడి శరీరంపై 20 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Mohammed Shami: లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు! షమీ సూపరో సూపర్
కార్తిక తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం చేస్తూ సెల్వం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కార్తిక తండ్రి ముత్తు రామలింగంను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఓప్పుకున్నాడు. పేదవాడిని పెళ్లి చేసుకున్నందుకే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. రామలింగంకు సహకరించిన ఐదురుగుని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు.