ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరుకావాలంటూ గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఆయా కారణాలతో నాలుగుసార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈసారి మాత్రం విచారణకు హాజరుకాకపోతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఛాన్సుందని వార్తలు వినిపిస్తున్నాయి.
లిక్కర్ స్కామ్‌లో నాలుగు సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. మరోసారి జనవరి నెలాఖరున శుక్రవారం విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు డుమ్మాకొట్టారు. ఐదోసారి కూడా కేజ్రీవాల్ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల ఛండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ఆప్ ఆరోపిస్తోంది. ఆప్, కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఉన్న కూడా మేయర్ పదవిని మాత్రం బీజేపీకి తన్నుకుపోయింది. ఈ నేపథ్యంలో నిరసన తెలిపేందుకు శుక్రవారం కేజ్రీవాల్ ఛండీగఢ్ వెళ్తున్నారు. దీంతో ఆయన ఈడీ విచారణకు హాజరుకాకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోతే ఈడీ ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.
లిక్కర్ కేసులో గత ఏప్రిల్‌లో దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. కానీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. కానీ ఇదే కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్‌సింగ్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్‌లో సంజయ్‌సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ వెంటాడుతోంది. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు ఆప్ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈడీని వాడుకుంటుందని ఆప్ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కేసులో బుధవారమే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది.