Suryakumar Yadav Speech after IND vs SL 2nd T20I: టీ20 ఫార్మాట్‌లో సానుకూల దృక్పథం, భయంలేని ఆట తీరుతో ముందుకు సాగుతామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వర్షం రావడం తమకు కలిసొచ్చిందని, బ్యాటర్ల ఆటతీరు అద్భుతం అని ప్రశంసించాడు. ఇప్పటి వరకు బెంచ్‌కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్‌లో ఆడించడంపై నిర్ణయం తీసుకుంటమని సూర్య చెప్పాడు. పల్లెకెలె వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సూర్య సేన కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘టోర్నమెంట్ ఆరంభానికి ముందు మేం ఎలా ఆడాలనుకుంటున్నామో చెప్పాం. ఇదే ధోరణితో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. చిన్న లక్ష్యమైనా లేదా భారీ ఛేదన అయినా ఇలానే ఆడుతాం. వాతావరణాన్ని పరిశీలించాక శ్రీలంకను 160 పరుగుల కంటే తక్కువకు కట్టడి చేయాలనుకున్నాం. మా బౌలర్లు రాణించారు. వర్షం రావడం మాకు కలిసొచ్చింది. మా బ్యాటర్ల ఆటతీరు అద్భుతం. ఇప్పటివరకు బెంచ్‌కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్‌లో ఆడించడంపై నిర్ణయం తీసుకుంటాం. యువకుల ఆట పట్ల చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.
Also Read: Sai Durgha Tej: అందుకే పవన్ కల్యాణ్ మామయ్యను ఎత్తుకున్నా: సాయి తేజ్
శ్రీలంక సిరీస్‌తో సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడిగా సూర్య వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగనున్నాడు. శ్రీలంక సిరీస్‌లోని ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు. 6.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది.