Supreme Court: అధిక జనాభా సమస్యను నియంత్రించేందుకు నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వం నుంచి వివరణను కోరింది. అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి దండి స్వామి జితేంద్రనంద్ సరస్వతి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతోందని.. అయితే సహజ వనరులు మాత్రం పరిమితంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
Assam: నెలలు నిండకముందే గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపలపెట్టి కుట్లు
అధిక జనాభా వల్ల నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయని స్వామి జితేంద్రనంద్ సరస్వతి అన్నారు. అధిక జనాభా సమస్య కారణంగా భారతదేశంలోని మిలియన్ల మంది పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించడానికి సమర్థవంతమైన నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని పిల్లో కోరారు. బిలియన్ల మంది భారతీయ పౌరుల జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేసే, అనేక తీవ్రమైన సమస్యలకు దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో అధిక జనాభా ఒకటి అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ జనాభా 139 కోట్లు అని, ఇది ప్రపంచ జనాభాలో 17.8 శాతం అని పిటిషన్లో ప్రస్తావించారు. కానీ దేశంలో వ్యవసాయ భూమి 2శాతమే ఉందని గుర్తు చేశారు. అమెరికాలో రోజుకు 10,000 మంది చిన్నారులు జన్మిస్తుండగా.. భారత్‌లో రోజుకు 70,000 మంది పుడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.