పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో సహా సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మరోసారి మందలించింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు ఏం కాదని తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మరోసారి బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలియజేశారు. తాము చేసింది కరెక్ట్ కాదని, భవిష్యత్తులోనూ ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాం అని అన్నారు. ‘చట్టం అందరికీ సమానం, మీరు ఏం చేసినా దానికి మీరే బాద్యులు. మీరు నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయొద్దని తెలియదా?. గత ఉత్తర్వుల్లో మేం ఏం చెప్పామో తెలియనంత అమాయకులేం కాదు మీరు’ అని కోర్టు మందలించింది. దీనికి రామ్‌దేవ్ బదులిస్తూ.. తాము చాలా రకాల పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ‘ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. మీరు పదేపదే ఉల్లంఘనలు చేసారు. మీ క్షమాపణను అంగీకరించాలా వద్దా అనే దానిపై మేము ఆలోచిస్తాము. వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి’ అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు.
ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. 2023 నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో ఆ సంస్థ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
Also Read: Bombay High Court: నిద్ర హక్కు మానవ ప్రాథమిక అవసరం.. దానిని ఉల్లంఘించకూడదు: బాంబే హైకోర్టు
అయితే ఆ హామీని ఉల్లంఘించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ సూచనలు చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయవద్దని మరోసారి హెచ్చరించింది. ఆ నోటీసులకు పతంజలి స్పందించలేదు. దాంతో తదుపరి విచారణ సమయంలో ఇద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోర్టు చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. దీనిపై తాజాగా విచారణ జరిపింది.