Sunrisers Eastern Cape Reach SA20 2024 Final: సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో క్వాలిఫయర్స్‌కు చేసిన సన్‌రైజర్స్.. ఫైనల్ పోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. న్యూలాండ్స్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2023లో టైటిల్ సాధించిన సన్‌రైజర్స్.. మరో టైటిల్ కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ మలన్ (63; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ (30; 23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లు కేశవ్ మహారాజ్, జూనియర్ డాలా తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
Also Read: Hyderabad Student: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.. కేంద్రం సాయం కోరిన కుటుంబ సభ్యులు!
మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ పేసర్లు ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెస్ తలో నాలుగు వికెట్స్ తీయడంతో డర్బన్ బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. డర్బన్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (20), వియాన్ మల్దర్ (38), హెన్రిచ్ క్లాసెన్ (23) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన ఒట్నీల్ బార్ట్‌మన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఓడిన డర్బన్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో డర్బన్ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంది.