Stree Summit 2.0: హైదరాబాద్ నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్ వేదికగా స్త్రీ సమ్మిట్ 2.0 – 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ అవగాహన సదస్సులో మహిళల భద్రత, చిన్నపిల్లల రక్షణ, సైబర్ సెక్యూరిటీ, అర్బన్ ఎన్విరాన్మెంట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్ వంటి అంశాలపై చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన 500 మందికి పైగా మహిళలు, యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ సందర్బంగా.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం – ప్రైవేట్ భాగస్వామ్యం ఆధారంగా ప్రజల కోసం పనిచేసే వేదిక HCSC అని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రైవేట్ కంపెనీల సహకారం తీసుకుంటున్నామని.. కంపెనీల యజమానులు, సీఈఓలు HCSCలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాట్లు తెలిపారు. అలాగే.. మహిళల భద్రత కోసం సిటీ పోలీస్ – HCSC కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని.. గర్ల్ చైల్డ్ రేషియో ప్రస్తుతం 942గా ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ ఈవెంట్లు జరుగుతున్నా, అక్కడ షీ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. గత ఏడాది మహిళలపై, చిన్నారులపై నేరాలకు పాల్పడిన అనేక మంది నిందితులను జైలుకు పంపించామని తెలిపారు.
హైదరాబాద్ పోలీసు పరిధిలో ఏడు ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రాత్రి వేళల్లో కూడా ఉమెన్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. మహిళలు భయపడకుండా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.