ఫీజు కట్టలేదన్న కారణంగా శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం అర్ధరాత్రి ఓ విద్యార్థిని బయటికి పంపేసింది. విద్యార్థి తండ్రి రాత్రికి రాత్రే రూ.20,000 ఫీజు చెల్లించి.. తన కుమారుడిని లోపలి అనుమతించాలని కోరినా యాజమాన్యం కనికరించలేదు. దాంతో ఇక చేసేది లేక తండ్రి కొడుకులు ఇద్దరు అర్ధరాత్రి కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో చోటుచేసుకుంది.
ఆబోతు గౌతమ్ అనే విద్యార్థి కంకిపాడు సమీపంలో శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు ముగించుకొని.. తండ్రి ఆబోతు టార్జాన్‌తో కలిసి హైదరాబాద్ నుంచి రాత్రి కళాశాలకు చేరుకున్నాడు. ఫీజు చెల్లించాలని యాజమాన్యం చెప్పడంతో.. టార్జాన్ రాత్రి రూ.20,000 ఫీజు చెల్లించాడు. మిగతా ఫీజు కూడా కడితేనే కళాశాలలోకి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పింది. తన దగ్గర డబ్బులు లేవని, తర్వాత కడతామని ఎంత వేడుకున్నా యాజమాన్యం కనికరించలేదు. తండ్రి కొడుకులు అర్ధరాత్రి కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 112 కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.
Also Read: Vijaya Rangaraju Dead: ప్రముఖ టాలీవుడ్ విలన్ మృతి!
ఆబోతు టార్జాన్ మాట్లాడుతూ… ‘నేను కూడా హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. పిల్లల పట్ల యాజమాన్యం ఇంత కఠినంగా వ్యవహరించడం తగదు. ఈరోజు రూ.20,000 ఫీజు కట్టాను. మిగతా బకాయి కూడా చెల్లిస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఇంటర్ పరీక్షలు ఉండగా.. ఈలోపు మిగతా బకాయి చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం వినలేదు. మొదటి సంవత్సరం ఫీజు పూర్తిగా చెల్లించా. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఈ సంవత్సరం ఫీజు కట్టడం ఆలస్యమైంది. అర్ధరాత్రి పిల్లవాడిని లోపల అనుమతించకుండా.. బయటికి పంపించారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కాలేజీ దగ్గరే కూర్చున్నాము’ అని తెలిపారు.