Purandeswari: సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు. కండువా వేసుకోవడమే కాదు.. బాధ్యతలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Year Ender 2024: ఈ ఏడాది విడుదలైన కార్లలో ఎక్కువగా లైక్ చేసినవి ఇవే..!
వాజ్‌పేయ్ జన్మదినోత్సవం రోజున చేరికలు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నాంది అంటూ ఆమె వ్యా్ఖ్యానించారు. వాజ్‌పేయ్ జీవిత ప్రస్థానంలో దేశాభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.మహనీయుల ఆశయాలను, సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన రోజు వారికి అర్పించే నిజమైన నివాళులు అంటూ పేర్కొన్నారు. రాజకీయ ప్రజా జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వాజ్‌పేయ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచే విధంగా సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఉచిత విద్యను ప్రవేశపెట్టిన మహానీయుడు వాజ్‌పేయ్ అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలను బీజేపీ నమోదు చేయగలిగిందని వెల్లడించారు. ప్రతి వర్గంలోనూ బీజేపీ పట్ల సదుద్దేశం ఉందన్నారు. దేశంలో ఉన్న 1500 పార్టీల్లోనూ బీజేపీ భిన్నమైనదని.. అందుకనే టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కాగలిగారని .. సాధారణ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాగలిగిందన్నారు.
వాజ్‌పేయ్ అడుగుజాడల్లోనే ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి భారత ప్రధాని మోడీ కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ నిమ్న కులాలకు, అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యమని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను అందరికంటే ఎక్కువ గౌరవించింది బీజేపీ మాత్రమేనన్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చింది బీజేపీనేనని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఇంటిని సైతం పవిత్ర స్థలంగా మార్చిన పార్టీ బీజేపీనేనని అన్నారు.బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించింది బీజేపీనే అని వెల్లడించారు. కులమతాలకు అతీతంగా బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేసిందన్నారు.
33 శాతం మహిళా బిల్లును అమోదించేట్లు చేసిన ఘనత బీజేపీదేనని.. 65 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మహిళలు గుర్తు రాలేదన్నారు. బెజవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం విజయవంతం చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అనేక సార్లు అవమానించిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు భారతరత్న వచ్చిందన్నారు. బీసీ కమిషన్‌కు మోడీ ప్రభుత్వమే చట్టబద్ధత కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు.