Jagadeeshwar Goud: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకున్నారు. నాయకులు ఇచ్చే డబ్బులకు ఓటు అమ్ముకొవద్దని.. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించిందని.. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు. రాత్రి ప్రచారంలో భాగంగా చందానగర్ డివిజన్‌లో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, బహుజనులను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించిందని చెప్పారు.
Also Read: Priyanka Gandhi: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారు
కేజీ టూ ఈజీ వరకు స్కాలర్‌షిప్ అందించి అక్షరాస్యతను పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ప్రణాళికలు పొందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు ఐదు వందలకు వంట గ్యాస్, బీమా సదుపాయం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. అంతకుముందు చందానగర్‌లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలనేసి జగదీశ్వర్ గౌడ్ నివాళులర్పించారు.