డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పర్యావరణ పరిరక్షణ కార్యకర్తను ఆక్వా రైతులు స్తంభానికి కట్టి చితకొట్టారు. తీవ్ర గాయాలైన సదరు కార్యకర్త అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. గ్రామంలో ఆక్వా చెరువుల తవ్వకాల పర్యావరణతో పాటు నీట కాలుష్యం అవుతుందని వీర దుర్గాప్రసాద్.. కోర్టుకు వెళ్లారు. దాంతో చెరువులను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఆక్వా రైతులు.. చెరువుల తవ్వే ప్రయత్నం చేశారు. దీంతో ఆధికారులను వీర దుర్గాప్రసాద్ ఆశ్రయించారు.
అధికారుల ఆదేశాల మేరకు ఫోటోలు తీయడం కోసం వీర దుర్గాప్రసాద్ చెరువుల దగ్గరకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఆక్వా రైతులు, దుర్గాప్రసాద్ మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ఆక్వా రైతులు.. అతడిని స్తంభానికి కట్టి చితకొట్టారు. గాయాలతో వీర దుర్గాప్రసాద్.. అమలాపురం ఏరియాకి వెళ్ళాడు. అక్కడ అతడికి డాక్టర్లు చికిత్స అందించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.