అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ పసి పిల్లల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. పిల్లలు లేని తల్లిదండ్రులు లక్షలు కుమ్మరించి పసి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిరుప్రాయానికి వెల కడుతున్నారు. అన్నెం పున్నెం ఎరుగని బాల్యాన్ని అంగట్లో సరుకును చేస్తున్నారు. కంటికి రెప్పలా సాకాల్సిన కన్నబిడ్డలను డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఒకరి నుంచి మరొకరికి బిడ్డలు చేతులు మారుతూ వెలను మారుస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలు చేసిన పిల్లలను కఠినమైన జీవితానికి బలి చేస్తున్నారు.
Read Also: New Rules 2024: అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. పెట్రోల్, ఎల్ పీజీ ధరల్లో మార్పులు
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులో పసి పిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నాడు. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతుంది ఈ ముఠా. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని గుట్టురట్టు చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో తల్లీకొడుకుతో పాటు ఇద్దరు ముఠా సభ్యులు ఉన్నారు. మరోవైపు.. పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also: Praja Bhavan: ప్రజా భవన్కు బాంబు బెదిరింపు.. పోలీసుల విస్తృత తనిఖీలు
వారం రోజుల క్రితం మేడిపల్లిలో చిన్నారిని అమ్ముతుండగా ఓ స్వచ్ఛంధ సంస్థతో కలిసి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టైన వారు ఇచ్చిన సమాచారంతో మరి కొంత మంది చిన్నారులను పోలీసులు కాపాడారు. చిన్నారులను అమ్మకాలు చేస్తుంది ఓ అంతర్జాతీయ ముఠాగా గుర్తించారు రాచకొండ పోలీసులు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో.. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. మరోవైపు.. రాచకొండ కమిషనరేట్ వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కమిషనరేట్ వద్దకు వచ్చారు. చిన్నారులను శిశువిహార్ కు తరలిస్తుండటంతో పేరెంట్స్ అడ్డుకున్నారు. తమ పిల్లలను తమకు అప్పగించాలంటూ ఆందోళన చేశారు. అల్లారుముద్దుగా పిల్లలను పెంచుకుంటున్నామని రోధిస్తున్నారు. శిశువిహార్‌కు చిన్నారులను తరలిస్తుండటంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు శోభారాణితో పాటు మరి కొంత మంది ఏజెంట్లు లీగల్ అని చెప్పి అమ్మారని పేరెంట్స్ చెబుతున్నారు.