తిరుమలలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపంలో ఈ వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 11) శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడి అధికారులు రద్దు చేశారు.
ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా సాలకట్ల వసంతోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీ. మొదటి రోజు ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మాఢవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజు భూ సమేత మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి.. తిరుమాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆపై వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటు సీతా రామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని.. సాయంత్రం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.