టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇంగ్లాడ్ పర్యటనకి ముందు హిట్‌మ్యాన్ టెస్టుల నుంచి వైదొలగడంతో ఇప్పుడు బీసీసీఐ రెండు విషయాపై దృష్టి సారించింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్ట్ సారధిని ఎంపిక చేసే పనిలో ఉంది. ఇప్పటికే టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ పేరు వినిపిస్తోంది. 2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటివరకు 32 టెస్టుల్లో 5 సెంచరీలతో 1893 పరుగులు చేశాడు.
మరోవైపు రోహిత్ శర్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతుంది. హిట్‌మ్యాన్ స్థానంలో ఓపెనర్‌గా సాయి సుదర్శన్ ఈ పేరును సెలక్షన్ కమిటీ పరిశీలిస్తోందట. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఓపెనర్‌గా ఆడుతున్న అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. సుదర్శన్ ఫామ్ చూసి టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి ఫిదా అయ్యాడు. ఇలాంటి కుర్రాడు భారత టెస్టు జట్టులోకి రావాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లకు సూచించాడు.
Also Read: Team India Captain: జస్ప్రీత్ బుమ్రా కాదు.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్ ఎలాంటి ఒత్తిడిలోనైనా సహనం కోల్పోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు.. దేశవాళీ క్రికెట్‌లోనూ అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 213. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్‌తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఓపెనర్‌గా రాణిస్తున్న భారత ఆటగాళ్లు మరెవరూ లేరు.