టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టాడు. టెస్ట్ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు తాను గర్వపడుతున్నానని, ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. టీ20, టెస్టు ఫార్మాట్లకు దూరమైన హిట్‌మ్యాన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. అయితే టీ20, వన్డేల్లో తనదైన ముద్ర వేసిన రోహిత్.. టెస్టుల్లో మాత్రం అంతగా రాణించలేదు. హిట్‌మ్యాన్ టెస్ట్ కెరీర్ అంతంత మాత్రమే అని చెప్పాలి.
రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 212. 2013లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌పై హిట్‌మ్యాన్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే 177 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2019లో ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకోవడం రోహిత్ టెస్ట్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయింది. ఓపెనర్‌గా తొలి సిరీస్‌లోనే రెండు సెంచరీలు బాదాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డలపై సెంచరీలు చేశాడు. 2022లో విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న హిట్‌మ్యాన్.. టీమిండియాను డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు చేర్చాడు. అయితే టైటిల్ మాత్రం అందించలేకపోయాడు.
Also Read: YS Jagan: కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం.. తప్పకుండా అధికారంలోకి వస్తాం!
ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ ప్రదర్శన దారుణంగా ఉంది. గత 10 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. బోర్డర్ గవాస్కర్ 2025 ట్రోఫీలో అయితే దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్, కెప్టెన్‌గా విఫలమైన రోహిత్.. ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో స్వయంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అప్పుడే రోహిత్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు.అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడంతో ఇంగ్లండ్ పర్యటనలో ఆడుతాడని అందరూ అందుకున్నారు. భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించారని ఈరోజు ఉదయం వార్తలు చక్కర్లు కొట్టాయి. సాయంత్రానికే రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. రోహిత్ 24 టెస్ట్‌ల్లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.