ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్, ఫైనల్స్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. బాల్ వేసిన అనంతరం స్టంప్స్ వెనకే ఉండడం, ఫీల్డర్ త్రో విసిరినా బంతిని పట్టుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో 41వ ఓవర్‌లో రవీంద్ర జడేజా మెరుపు వేగంతో బంతిని వేయగా.. వికెట్లకు దగ్గర నుంచి వెళ్తున్న బంతిని కుల్దీప్ పట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. సెమీస్‌లో స్టీవ్ స్మిత్ ఆడిన బంతిని కూడా వదిలేశాడు. దీనిపై సారథి రోహిత్ శర్మ మాట్లాడాడు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… మైదానంలో భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉంటాయని, ఆ సమయంలో అప్పుడప్పుడు తాను నియంత్రణను కోల్పోతానని రోహిత్ పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం బలమైన జట్టు ఉంది. నిబద్ధత కలిగిన వ్యక్తులతో కలిసి ఆడటం ఆనందంగా ఉంది. ప్రతిఒక్కరికి వారి పాత్ర ఏంటి, బాధ్యతలు ఏంటో తెలుసు. మైదానంలో ప్రతిఒక్కరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నేను నియంత్రణ కోల్పోతా. అయితే అదంతా ఆటలో భాగమే. మైదానంలో ఎవరినీ బాధ పెట్టాలని తిట్టను. అందరి లక్ష్యం విజయమే. అందుకు దేనికైనా సిద్దమే’ అని రోహిత్ చెప్పాడు.
‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఐదు మ్యాచ్‌ల్లోనూ మేం టాస్ ఓడిపోయాం. అయినా కూడా టైటిల్ గెలిచాం. ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా.. విజేతగా నిలవడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. టైటిల్ విజయంలో అందరూ పాలు పంచుకున్నారు’ అని రోహిత్ శర్మ తెలిపాడు. ఫైనల్‌లో కుల్దీప్ యాదవ్ రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (37), విలియమ్సన్ (11)ను ఔట్ చేశాడు. ఫైనల్‌లో తాను వేసిన మొదటి బంతికే రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు.