About My Father: ఈ యేడాదితో 80 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో ‘అబౌట్ మై ఫాదర్’ సినిమాతో సందడి చేయనున్నారు. 1981లో తన ‘రేజింగ్ బుల్’ సినిమాలోని నటనకు ఆస్కార్ అవార్డు అందుకున్న రాబర్ట్ డి నీరో అనేక చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’నూ 2016లో ఆయన అందుకున్నారు. డి నీరో తాజా చిత్రం ‘అబౌట్ మై ఫాదర్’లో ఆయన తండ్రి పాత్రను పోషించారు. ఈ సినిమా మే 26న జనం ముందుకు రానుంది. ‘అబౌట్ మై ఫాదర్’ ట్రైలర్ విడుదలై ఎన్నో గంటలయినా, దానిని పట్టించుకున్న నాథుడే లేడు. అదే విచిత్రంగా ఉందని అంటున్నారు. ఎంత లేదన్నా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డి నీరో ఫ్యాన్స్ అయినా, దానిని చూడాలి కదా!
Read Also: Shriya Saran: శ్రీయా.. చీర కట్టినా సూపరే
తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిన ‘అబౌట్ మై ఫాదర్’ సినిమాలో నవతరానికీ నచ్చే అంశాలు బోలెడు ఉన్నాయని చిత్ర నిర్మాతల్లో ఒకరైన క్రిష్ నెయిల్జ్ అంటున్నారు. ఇందులో రాబర్ట్ డి నీరో తనయునిగా సెబాస్టియన్ మేనిస్కాల్కో నటించారు. ఇటలీకి చెందిన ఓ ఫ్యామిలీ చుట్టూ ఈ కథ సాగుతుందట! ఇటలీ సెంటిమెంట్స్ కు విలువ నిచ్చే ఓ తండ్రి అమెరికాలో ఉన్న తనయుడి దగ్గర ఉంటాడు. తండ్రితో తాను ఓ అమెరికన్ అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నట్టు కొడుకు చెబుతాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఇటాలియన్ తండ్రి మాట్లాడాలని అంటాడు. కొడుకు ఏర్పాటు చేస్తాడు. అయితే రెండు వేర్వేరు దేశాల సంప్రదాయాల నడుమ ఒకరి ఆచారాలు మరొకరికి నచ్చక సతమతమవుతారు. వాటిని ఆకళింపు చేసుకోవడానికి రెండు వైపుల ప్రయత్నిస్తారు. ఈ జర్నీలో వినోదం భలేగా పండుతుందని డైరెక్టర్ లారా టెర్రసో అంటున్నారు. రాబర్ట్ డి నీరో కెరీర్ లో మరో బెస్ట్ మూవీగా ‘అబౌట్ మై ఫాదర్’ నిలుస్తుందనీ వారంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయ్, సినిమాకు ఇంకా బజ్ రాలేదే? అన్నదే ట్రేడ్ పండిట్స్ మాట. విడుదలకు మరో మూడు నెలల సమయం ఉంది కాబట్టి, ఆ పాటికి ‘అబౌట్ మై ఫాదర్’ సినిమా క్రేజ్ సంపాదిస్తుందని నిర్మాతల అభిలాష! ఏమవుతుందో చూడాలి.