RIL Investments: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నాలుగేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా కొత్తగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పెట్టుబడులు.. ఈ ఉద్యోగాలు.. టెలికం, రిటైల్ మరియు రెనివబుల్ బిజినెస్‌లలో అందుబాటులోకి రానున్నాయి. రిలయెన్స్ ఇప్పటికే యూపీలో 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. తద్వారా 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.
read more: Loss For Life Insurers: అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్నుల ప్రభావం
ఇప్పుడు రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో ఒకటి.. జియో స్కూల్ కాగా రెండోది.. జియో ఏఐ డాక్టర్. ఈ రెండు కార్యక్రమాలతో రాష్ట్రంలోని చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లో ఆరోగ్య రంగాన్ని మరియు విద్యా రంగాన్ని బలోపేతం చేయనుంది. వీటితోపాటు 10 గిగా వాట్ల సామర్థ్యంతో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కేంద్రాన్ని మరియు ప్రతిష్టాత్మకమైన నూతన బయో ఎనర్జీ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ విషయాలను రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. లక్నోలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో వెల్లడించారు. అర్బన్ ఇండియా, రూరల్ భారత్ అనే భేదాలు చెరిగిపోతున్నాయని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు ప్రపంచంలో ఎవరూ ప్రశ్నించలేనంత పటిష్ట స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు దోహదపడేలా కొత్త బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పురోగతికి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆలోచనతో మనసు పెట్టి పనిచేసే విధానం ఇకపైనా కొనసాగుతుందని ముఖేష్ అంబానీ భరోసా ఇచ్చారు.