Loss For Life Insurers: ప్రజల జీవితాలకు బీమా ఇవ్వాల్సిన కంపెనీలకే ధీమా లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్.. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్ను విధించాలన్న బడ్జెట్ ప్రతిపాదన తమకు నష్టదాయకంగా మారనుందని జీవిత బీమా సంస్థలు బాధపడుతున్నాయి.
వార్షిక ప్రీమియం 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉన్న బీమా ఉత్పత్తులపై ట్యాక్స్ వేస్తే తమ రెవెన్యూ 10 నుంచి 12 శాతం వరకు పడిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. కొవిడ్ ప్రభావం వల్ల ప్రజలు దీర్ఘకాలిక పొదుపు పథకాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, ఇది ఇన్సూరెన్స్ కంపెనీల సేల్స్ పైన ప్రభావం చూపుతోందని పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ప్రపోజల్‌ను తెర మీదికి తేవటం తమ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టేనని విచారం వ్యక్తం చేస్తున్నాయి.
read more: Global Economy’s Ray of Hope: అన్ని దేశాల ఆశాకిరణం చైనా.. గ్లోబల్ ఎకానమీని గట్టెక్కించేనా?
5 లక్షలకు బదులుగా 10 లక్షల రూపాయలు (లేదా) అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన ప్రీమియం ప్రొడక్టులపై సుంకం విధించాలని కోరుతున్నాయి. ఇన్సూరెన్స్ సెక్టార్‌కి కాంపోజిట్ లైసెన్స్ ఆశిస్తున్నామని, దీనివల్ల లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు హెల్త్ బిజినెస్‌ని ఇతర కంపెనీలకు అద్దెకి ఇచ్చుకునే వెసులుబాటు కలుగుతుందని వివరిస్తున్నాయి.
2015వ సంవత్సరం వరకు ఈ సౌలభ్యం తమకు ఉండేదని జీవిత బీమా సంస్థలు గుర్తుచేస్తున్నాయి. ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను మినహాయింపును పరిమితం చేయడం ద్వారా కేంద్ర బడ్జెట్.. జీవిత బీమా సంస్థలకు బ్యాడ్ న్యూస్ చెప్పిందని నిపుణులు విమర్శిస్తున్నారు.