యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విభజన చట్టం అమలు విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐటిఐఆర్ ప్రాజెక్టును కక్షపూరితంగా కేంద్రం రద్దు చేసిందని, భారతీయ జనతా పార్టీనీ ఇండియా గేటు వద్ద ఉరి తీసినా తప్పులేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ను మోసం చేసి మోడీ పంచన చేరిన వారికి ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలంటూ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టిఆర్ఎస్ పార్టీ తుంగలోకి తొక్కిందని, కుక్క, నక్క, తోడేలు ఈ మూడు జంతువుల కలయికే కేసీఆర్ అని, వీఆర్ఏలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు.
పోత్తులో కమ్యూనిస్టులకు సీటు ఇచ్చి గెలిపిస్తే.. ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలో కలిపేసుకున్నాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కమ్యూనిస్టు నాయకులు ఎటు వెళ్లినా కార్యకర్తలు మాత్రం ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని నా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవకాశం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వచ్చింది.. వినియోగించుకుంటారని భావిస్తున్నా.. సెప్టెంబర్ 17 నా మా అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.. పాల్వాయి స్రవంతిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని ఆయన కోరారు.