తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఓ ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలకు గురిచేశారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారి దాడి చేయడంతో ఖైదీకి తీవ్ర రక్తస్రావం అయింది. తన నివాసంలో పనులు చేయించుకుంటున్న ఉన్నతాధికారి.. ఖైదీపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజమండ్రి కేంద్ర కారాగారానికి చెందిన ఓపెన్ జైలులో సుభానీ అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఓపెన్ ఎయిర్ ఖైదీతో ఓ ఉన్నతాధికారి తన నివాసంలో పనులు చేయించుకుంటున్నాడు. సోమవారం రాత్రి ఖైదీ తీరుపై అసహనానికి గురైన ఉన్నతాధికారి.. అతడిని దారుణంగా కొట్టారు. రహస్య అవయవాలపై కర్రతో దాడి చేయడంతో ఖైదీకి రక్తస్రావం అయింది. అక్కడితో ఆగకుండా చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై జైలు అధికారులు నోరు మెదపడం లేదు.