తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. బలమైన ఈదురుగాలులతో.. ఉరుములు, మెరుపులతో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండు వేసవిలో వర్షాలు కురవడంతో ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. రాగల రెండు గంటల్లో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Also Read:Dandora: మరోసారి ‘కోర్ట్’ తరహా పాత్రలో శివాజీ?
తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాది కొత్తగూడెం.. మహబూబాబాద్.. ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్.. మహబూబ్ నగర్.. మేడ్చల్ మల్కాజ్గిరి.. నాగర్ కర్నూల్.. రంగారెడ్డి.. సిద్దిపేట్.. వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ ఈదురు గాలులు.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.