ఢిల్లీ మద్యం కేసులో అరబిందో శరత్ చంద్రా రెడ్డి పట్టుబడటం, అరబిందో కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి. అభివృద్దిని విస్మరించి ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతూ ఉన్నారనీ ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని విస్మరించింది కాబట్టే బీజేపీ అభివృద్ది పై దృష్టి పెడుతోందని, అందుకే మోడీ రేపు వస్తున్నారన్నారు పురంధేశ్వరి. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కేసులో పట్టుబడ్డ శరత్ చంద్ర కి ఇక్కడ నేతలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసనీ, విశాఖ లో దస్పల్లా తో పాటు జరిగిన భూ దందాల ఖాతాలన్నింటిపై ఈ డీ కి ఫిర్యాదు చేస్తాం అన్నారు. శరత్ చంద్ర రెడ్డి ఫోన్ లో అన్ని వివరాలు లభ్యం అయ్యాయని అందరి సంగతి తెలుస్తామన్నారు సీఎం రమేష్. ప్రధాని వస్తుంటే వైసీపీ అత్యుత్సాహాన్ని చూస్తుంటే పోలీస్ లను చూసి హడావుడి చేసే వాళ్ళ లా అనిపిస్తోందన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యం లో విశాఖ వచ్చిన బీజేపీ నేతలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
Also Read : Special Shows: స్టార్స్ ఇమేజ్ పై స్పెషల్ షోస్ దెబ్బ
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్. భూసర్వేలకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి దానిలో అవినీతి ఎలాగో వెతుకుతున్నారన్నారు. వివాదాలు సృష్టించి, భయపెట్టి భూములు కాజేస్తున్నారన్నారు. భూరక్ష, భూహక్కు పథకం పేరుతోనూ భూకబ్జాయే చేస్తున్నారన్నారు సత్యకుమార్. విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో 40 ఎకరాల భూకబ్జా చేసిన మంగళ కృష్ణ ఎవరు? అతని పై ఎన్ని కేసులున్నాయి? అని ప్రశ్నించారు.