Ajeya Kallam: ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోందని సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు. కోర్టు అనుమతి తర్వాతే చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అర్బన్, రూరల్ ప్రాంతాలను సర్వే చేస్తున్నామని.. గ్రామ, కంఠాల సర్వేనూ చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకూ 6వేల గ్రామాల్లో సర్వే పూర్తైందని.. 11 వేల గ్రామాల్లో ఇంకా సర్వే పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ సర్వే పూర్తైతే భూ వివాదాలు తగ్గిపోతాయని.. ఇప్పటి వరకు దేశంలో భూములకు టైటిల్ అనేదే లేదన్నారు. ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్లు ఆధారాలే తప్ప.. యాజమాన్యపు హక్కులు కావన్నారు.
Read ALso: Botsa Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తే భూములు ఈజీగా అమ్ముకోవచ్చు..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయని.. ఇది ఇష్టం లేని కొందరు అడ్వొకేట్లు లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో డ్రోన్ సర్వే చేపట్టారు.. ఫీల్డ్ సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. రూరల్ ప్రాంతాల్లో 6 వేల గ్రామాల్లో ఫీల్డ్ సర్వే పూర్తి అయిందన్నారు. ఆరు వేలకు పైగా గ్రామాల్లో సర్వే చేపడితే.. కేవలం రెండు శాతం మాత్రమే వివాదం వచ్చిందన్నారు. సర్వే పూర్తైతే ప్రస్తుతమున్న పాస్ పుస్తకాలకంటే.. రెండింతలు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ తరహా విధానం తేవాలని చాలా మంది ఐఏఎస్‌లు కలలు కంటారన్నారు. టైటిల్ ఇచ్చాక కూడా అభ్యంతరాలకు రెండేళ్ల పాటు గడువు ఉందన్నారు.రెండేళ్ల తర్వాత కూడా ఏమైనా వివాదాలు వచ్చి కోర్టులకెళ్తే.. ప్రభుత్వమే మొదటి రెస్పాడెంటుగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన టైటిలింగ్ ఏమైనా తేడాలున్నాయని నిరూపితమైతే.. ప్రభుత్వమే కాంపన్సేషన్ చెల్లిస్తుందన్నారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో డ్రాప్ట్ పూర్తైందని సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లాం వివరించారు.